దేవునిపై భారం వేద్దాం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

దేవునిపై భారం వేద్దాం.

ఒక రోజు రైతు రోడ్డుపై తన ఎద్దులబండిని తోలుకొని వెళుతూ ఉండగా, ఆ ప్రక్కనే వెళుతున్న ఒక స్త్రీ పెద్ద బరువుని తలపై మోసుకువెళ్లడం చూశాడు. తనకు సహాయం చేద్దామని ఆగి, ఆమెను తన బండిలో ఎక్కించుకున్నాడు. కృతఙ్ఞతలు తెలిపి బండి వెనుక భాగంలో ఎక్కి కూర్చుంది ఆ స్త్రీ. కొంత దూరం ప్రయాణించాక ఆ రైతు ఓ వింతైన సంగతిని గమచించాడు. బండిలో కూర్చున్నాకూడా ఆ స్త్రీ తన తలపై బరువును ఇంకా మోస్తూనే ఉంది. ఆశ్చర్యపోయిన రైతు ఆ స్త్రీతో అన్నాడు. “అమ్మా, మీ బరువు క్రిందకి దించండి, నా ఎద్దులు మిమ్మల్నీ మీ బరువును కుడా మోయగలవు. అన్నిటిని పక్కన పెట్టి సేదదీరండి” అన్నాడు.

జీవితంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు తరచూ కలిగే భయం, చింత వంటి భారాలన్నిటిని గూర్చి బాధ పడుతూ వాటిని మోస్తూనే ఉంటాము. అనేకసార్లు, దేవునితో సేదదీరకుండా ఆ స్త్రీ వాలే, ప్రతీ భారాన్ని మనం మోస్తూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాము. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. మత్త 11:28”. ప్రార్ధన ద్వారానే మన భారములను దేవుని చెంతకు తీసుకొని వచ్చి వాటిని క్రిందకు పెట్టిన వారమవుతాము. భారములు భుజములు మార్చుకునే స్థలమే ప్రార్ధన. ఈ అనుభవాన్ని గూర్చి అపో. పేతురు అంటాడు “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. 1 పేతురు 5:7”.

దేవుడు మనలను గూర్చి చింతిస్తున్నాడు గనుక, మన సమస్తమైన భారాన్ని ఆయనపై వేసి, మన ప్రతి సమస్యకు సమాధానం ఆ దేవుడే దయజేస్తాడని విశ్వసించే కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.

Audio : https://youtu.be/69jTj9Omcdw