దేవుని దృష్టికోణం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

దేవుని దృష్టికోణం.

జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆ సాధన వెనక మన శ్రమ ఉన్నప్పటికీ మనం సాధించగలం అనే ప్రోత్సాహం ఇచ్చే వారు తప్పకుండా ఉండి ఉంటారు కదా. వాస్తవంగా ప్రోత్సాహించే వారి దృష్టి కోణం లో ఆలోచన చేస్తే మనం సాధించగలం అనే సంకల్పాన్ని,శక్తిని, సామర్ధ్యాన్ని వారు మనకంటే ఎక్కువగా గ్రహించి యుంటారని నా ఉద్దేశం.

ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, అబ్రాము గృహంలో బానిసగా ఉంటున్న హాగారు గురించి నేను ఆలోచించాను. అబ్రాము శారాయి అనేక సంవత్సరములు వారసునికొరకు ఎదురుచూసిన తరువాత, శారాయి ఆనాటి సంస్కృతికి అనుగుణమైన సాంప్రదాయాన్ని అనుసరించి హాగరు ద్వారా బిడ్డను కనుమని అబ్రాముకు చెప్పింది. అయితే హాగరు గర్భవతియైన తరువాత శారాయిని చులకనగా చూసింది. తిరిగి శారాయి ఆమెను శ్రమ పెట్టినందున ఆమె అరణ్యములోనికి పారిపోయింది.

దేవుడు హాగరు బాధను, కలవరాన్ని చూసి లెక్కించలేనంత విస్తారమైన సంతానాన్ని దయజేస్తానన్న వాగ్ధానంతో ఆమెను ఆశీర్వదించాడు. ఒంటరితనంలో హాగరు అరణ్యములో దుఖపడుతూ, విడనాడబడినది కాదని తెలుసుకొని దేవుని వైపు కన్నులెత్తి “ఏల్ రోయి” అంటే “నన్ను చూచుచున్న దేవుడవు” (ఆది 16:13) అని పిలిచింది.

దేవుడు హాగరును ఎలా చూశాడో, ఎలా ప్రేమించాడో మనపట్ల కూడా అలాగే ఉంటాడు. స్నేహితులు, బంధువులు కొన్ని సార్లు మన కుటుంబ సభ్యులు మనల్ని నిర్లక్ష్యంగా, తృణీకరించినట్లు అనిపించవచ్చు. అయితే మన పరలోకపు త్రండ్రి మనం ఈ లోకానికి కనబరచుకుంటున్న కోణాన్నే కాక, మన అంతరంగాలోని భావాలను, భయాలను కూడా చూస్తున్నాడని గ్రహించాలి. దేవుని దృష్టి కోణాన్ని గ్రహించి తెలుసుకున్నప్పుడు జీవింప జేసే దేవుని మాటలు మనకు ఓదార్పును కలుగజేసి ధైర్యన్నిస్తాయి.

Audio: https://youtu.be/PbsvNQQb7BE