విలాప వాక్యములు


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు.

గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ గ్రంథము ద్వారా తన యొక్క వేదనతో కూడిన ఆలోచనలకు రెక్కలు ఇచ్చుచున్నాడు. యెరూషలేము పట్టణము కూలిపోయినది అది అందరికి అపహాస్యాస్పదముగా మార్చబడినది.

ఈ విలాప వాక్యములను అక్షర వరుసక్రమములో వ్రాసియున్నాడు. గ్రంథర్త 1 నుండి 4 వరకు ఒక్కొక అధ్యాయము ఆలెఫ్ అనబడిన హెబ్రీభాష మొదటి అక్షరముతో ప్రారంభించి తదుపరి వచ్చు ఒక్కొక్క వచనము వరుస క్రమములో మొదటి అక్షరముతో ప్రారంభించి చివరి అక్షరముతో ముగియబడుచున్నది. ఈ గొప్ప బాధకరమైన ప్రత్యక్షత మధ్యలో యెహోవా నీ యొక్క యదార్ధత గొప్పదైయున్నది. అనెడి ప్రకటన ద్వారా ఆధరణను నిరీక్షణను పొందుచున్నారు. ఈ విధముగా మిక్కిలి కీడైన బాధను విశ్వాసము యొక్క జయముగా మార్చుటకు యిర్మియా ప్రయాసపడుచున్నాడు.

గ్రంథకర్త : విలాపవాక్యముల యొక్క గ్రంథకర్త ఎవరని ఈ గ్రంథములో సూటిగా చెప్పబడలేదు. అయినప్పటికినీ అనేకమైన ఆంతర్యసాక్ష్యములు మరియు బాహ్య సాక్ష్యములును దీని యొక్క గ్రంథకర్త యిర్మీయా అని సాక్షమిచ్చుచున్నవి. సెప్టోజెంట్ భాషాంతర పరిచయ వాక్కులలో ఈ విధముగా వ్రాయబడియు యెరూషలేము నిర్మూలన చేయబడినది ఇశ్రాయేలీయులు దాసులుగా చెరపట్టబడిన తదుపరి యెరూషలేమును గూర్చి విలపించుచూ యిర్మీయా ఈ విలాప వాక్యములను విలపించెను. ప్రారంభకాల యూదా క్రైస్తవ పారంపర్యములు కూడా ఏక స్వరముతో ఈ గ్రంథకర్త యిర్మీయా అని అగీకరించుచున్నవి.

గ్రంథములో వివరించు సందర్భములో ముఖాముఖిగా చూచిన దృశ్యములుగా కనిపించుట గమనించదగినవి. (విలాపవాక్యములు 1:13-15; విలాపవాక్యములు 2:6-9; విలాపవాక్యములు 4:1-12 మొదలగు భాగములను చూడుము) యెరూషలేము పతనమైనది ముఖాముఖిగా చూచుట మాత్రమే కాదుగాని అందులోని జనులు దాసులుగా బబులోనుకు కొనిపోబడిన తరువాత కూడా కొంత కాలము అక్కడనే నివశించెను. యిర్మీయా ప్రవచనా భాషాశైలికి భిన్నమైనదిగా ఇది కనిపించుచున్నదని కొందరు విమర్శించుచున్నారు. పద్యభాగమునకు, గధ్య భాగమునకు మధ్యలో భాషాశైలిలో భేదముండుట సహజమే. అయినప్పటికినీ యూదా ప్రజల పతనమును గూర్చిన దుఃఖము అంజలియు ఈ రెండు గ్రంథములలో ఒకే విధముగా ధ్వనించుచున్నవి.

కాలము : యెరూషలేము పతనమైన తరువాత ప్రారంభ సంవత్సరములలో ఈ గ్రంథమును వ్రాసి ఉండవచ్చును క్రీ.పూ 588 నుండి 586 వరకు నెబుకద్నెజరు యొక్క సైన్యము యెరూషలేమును ముట్టడి వేసెను. క్రీ.పూ. 586 సంవత్సరము ఆగస్టు నెలలో పట్టణము పతనమైనది. యూదాలో సంభవమునకును మిగిలిన ప్రజలు యిర్మీయాను వారితో కూడా ఐగుప్తుకు తీసుకువెళ్ళుటకు మధ్యకాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉండవచ్చును.

ముఖ్య పదము : దుఖఃము

ముఖ్య మైన వచనములు : విలాపవాక్యములు 2:5-6; విలాపవాక్యములు 3:22-23

ముఖ్యమైన అధ్యాయము : అధ్యా 3. నాశనము, లేమి, నీరసత్వము అనునవి పొంగిపొర్లే ఈ గ్రంథములో తాను దేవుని వాగ్దానములను, మరియు దేవుని యదార్థతను ప్రాధమికాంశముగా కలిగిన ఒక విశ్వాసములో గ్రంథకర్త ఆశ్రయమును పొందుటను చూచుచున్నాము. మిగతా నాలుగు అధ్యాయములలో వేదనతో కూడిన ఆలోచనలకు మధ్యలో దేవుని యొక్క కనికరములో నిరీక్షణ కలిగిన మహిమతో నిండిన పూర్ణ విశ్వాసమును విలాపవాక్యములు 3:22-25 లో చూడగలము.

గ్రంథ విభజన : 40 సంవత్సరము లకు పైగా యెరూషలేముకు వచ్చు తీర్పును గూర్చి ప్రవచనము పలికి హెచ్చరికలను ఇచ్చిన ప్రవక్తగా యిర్మీయా కనిపించుచున్నాడు. క్రీ.పూ. 586 సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును పతనము చేసిన తరువాత తనయొక్క హెచ్చరికలను అశ్రద్ధ చేసిన యూదులను నిర్లక్ష్యపరచి నేరము మోపుటకు యిర్మీయా ప్రయత్నించలేదు. అదే సమయములో యెరూషలేము యొక్క దుస్థితిని చూచి వేదనతో విలపించెను. ఈ విధముగా తన దేశ ప్రజలతో ఏకీభవించెను. పాపులును కఠిన హృదయము గలవారుగా కనిపించిన తన దేశ ప్రజలతో కఠినమైన దేవుని వాక్కులను ప్రకటించుటకు నియమింపబడిన ప్రవక్త యొక్క కనికరముగల మనసును ఈ గ్రంథము ప్రతిబింబిచుచున్నది. దీని అధ్యాయములకును దాని సారాంశముల మూలానుసారముగా ఇవ్వబడిన పేర్లు క్రింద ఇవ్వబడినవి.

అధ్యాయము 1 : యెరూషలేము నాశనము

అధ్యాయము 2 : దేవుని కోపము

అధ్యాయము 3 : కనికరము కొరకైన విన్నపము

అధ్యాయము 4 : యెరూషలేము ముట్టడి

అధ్యాయము 5 : విమోచనకొరకైన విన్నపము

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 25వ పుస్తకము ; అధ్యాయములు 5; వచనములు 154; ప్రవచన వచనములు 2; ప్రశ్నలు 13; ఆజ్ఞలు 3; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 2; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు లేవు.