యోహాను సువార్త


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

అధ్యాయములు: 21, వచనములు: 879

గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను.

రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం.

మూల వాక్యాలు:

1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.

1:29 ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

6:29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాస ముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

10:10 గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.

10:27,28 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను

11:25-26 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు

13:35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను .

14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ద్దకు రాడు.

19:30 సమాప్తమైనది

 

నాణెమునకు రెండు భాగములు కలవు. రెండింటికిని సమాన ప్రాధాన్యత ఉండెను. ఈ ప్రకారముగానే యేసుక్రీస్తుకు తుల్యప్రధానమైన స్వభావములు రెండు గలవు అవి ఏవనగా దైవత్వం మానవత్వం, అపొస్తులుడైన యోహాను క్రీస్తు జీవితములో నున్న దైవత్వ స్వభావమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుచు ఆయన దేవుని కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. లూకా యేసుక్రీస్తు జీవితములోనున్న మానవత్వమునకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చుచు ఆయన మనిషి కుమారుడని తన సువార్తలో వ్రాసియుండెను. కాలమునకు సంబంధించిన ఆధారములు వీటికి భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసికొని ఈ సువార్త రచింపబడెను. క్రీస్తు చేసిన ఏడు అద్భుతములను నేనే అని ఆయన దృఢముగా చెప్పిన ఏడు సత్యములను కేంద్రంగా చేసికొని సువార్త రచన ముందుకు సాగుచుండెను. మేడ గదిలో సిద్ధపరచబడిన చివరి రాత్రి భోజన వృత్తాంతములో తన శిష్యులకు చివరిగా ప్రసంగించెను. ప్రత్యక్ష సాక్ష్యముల వివరములతో ప్రారంభమై క్రీస్తు పునరుత్థాన సంభవములు తెలుపుచు, క్రీస్తు దేవుని కుమారుని యోహాను స్పష్టపరిచెను.

ఉద్దేశము : యేసు నిజముగా దేవుని కుమారుడని ఆయనయందు విశ్వాసముంచిన వారు నిత్య జీవము పొందుదురు అని నిరూపించుట.

గ్రంథకర్త : జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపొస్తలుడైన యోహాను. జెబెదయి కుమారులు “ఉరిమెడి "వారు అని పిలువబడియుండిరి.

ఎవరికి వ్రాయబడెను : నూతన విశ్వాసులకు, సత్యాన్వేషకులైన అవిశ్వాసులకు

వ్రాయబడిన కాలం : క్రీ.శ సుమారు 90 సంవత్సరములో

గత చరిత్ర : క్రీ.శ. 70 సంవత్సరములో యెరూషలేము నాశనం చేయబడిన తరువాత యోహాను పత్మాసు ద్వీపమునకు పరవాసిగా వెళ్ళకముందు యోహాను ఈ సువార్తను వ్రాసియుండెను.

ముఖ్య వ్యక్తులు : యేసు, బాప్తీస్మమిచ్చు యోహాను, యేసు శిష్యులు, మార్త, మరియ, లాజరు, యేసు తల్లి, పిలాతు, మగ్దలేనే మరియ.

ముఖ్య స్థలములు : యూదయ, సమరయ, గలిలయ, బేతనియ, యెరూషలేము.

గ్రంథ విశిష్టత : వ్రాయబడిన 7 అద్భుతములలో 6 అద్భుతములు దీనిలో మాత్రమే వ్రాయబడెను. అనగా మిగిలిన మూడింటిలో దేనిలోను ఇవి లేవు. అలాగే 14 - 17 అధ్యాయములలో వ్రాయబడిన, మేడ గదిలో ప్రభువు శిష్యులనుద్దేశించి చేసిన ప్రసంగములు కూడ ఈ పుస్తకములోని ప్రత్యేకత. ఈ సువార్తలోని విషయములు 90 శాతము వివరములు ఇతర సువార్తలలో లేవు. అయితే ఇతర సువార్తలలో చెప్పబడిన యేసు వంశావళి, జననము, బాల్యకాల విశేషములు, శోధనలు, రూపాంతరము, శిష్యుల నియామకము, ఉపమానములు, చివరి ఆజ్ఞ, ఆరోహణము అనువాటిని గూర్చి ఈ సువార్తలో ఏమియు వ్రాయబడలేదు.

ముఖ్య పద సముదాయము : యేసు దేవుని కుమారుడని నమ్ముట.

ముఖ్య వచనములు :యోహాను 1:11-13; యోహాను 20:30-31

ముఖ్య ఆధ్యాయము : 3వ అధ్యాయము యోహాను 3:16 అధికముగా చదువబడునది; ప్రసంగింపబడుచునున్న సువార్త వాక్యమిది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము - మున్నగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుటయే ఏకైక మార్గమని ఈ అధ్యాయము మనకు తెలియజెప్పుచున్నది.

కొని ప్రత్యేక సందర్భములలో యేసు పాత నిబంధనలో నేనే అని చెప్పినది. దేవునితో సమానుడని స్పష్టపరిచెను. ఆయన దైవత్వమును చాటి చెప్పు ముఖ్యాంశములను యోహాను 1:1; యోహాను 8:58; యోహాను 10:30; యోహాను 14:9; యోహాను 20:28 అను వచనములలో చూడగలము. నేనే అని యేసు తనను గూర్చి దృఢముగా చెప్పిన ఏడు మాటలను ఈ క్రింద చూతము.

  1. జీవాహారమును నేనే (యోహాను 6:35-48) 2. నేను లోకమునకు వెలుగైయున్నాను. (యోహాను 8:12; యోహాను 9:5). 3. నేనే ద్వా రమును (యోహాను 10:7-9).  4. నేను మంచి కాపరిని (యోహాను 10:11-14).  5. పునరుత్థానమును, జీవమును నేనే (యోహాను 11:25).  6. నేనే మార్గమును, సత్యమును, జీవమును (యోహాను 14:6).  7. నేనే నిజమైన ద్రాక్షావల్లిని (యోహాను 15:1-5).

గ్రంథ విభజన : ఇతర మూడు సువార్తలలో లేని ప్రత్యేకమైన యొక సారాంశమును శైలిని కలిగియున్న ఈ సువార్త - స్థూల పరిశీలనా సువార్తలు మత్తయి, మార్కు, లూకా విడిచి పెట్టిన కొన్ని ముఖ్యాంశములను వ్రాయుట ద్వారా క్రీస్తు చరిత్ర సంగ్రహమును సంపూర్ణము చేయుచున్నది. మిక్కిలి సులభశైలితో, అతి శ్రేష్ఠమైన వర్తమానములతో నిండియున్నది. ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోని పుస్తకములన్నింటిలో మిక్కిలి శ్రేష్టమైనది ఆత్మీయ సత్యములతో పరిపుష్టమైనది. యేసునందు విశ్వాసముంచుట ద్వారా మనుష్యులు ఆత్మ జీవులుగా మారగలరు అను సుస్పష్టమైన లక్ష్యముతో యోహాను ఈ సువార్తను వ్రాయుచున్నాడు. దీనిని ఐదు ముఖ్య భాగములుగా విభజింపవచ్చును.

  1. ఉపోద్ఘాతము: దేవుని కుమారుని అవతారం (యోహాను 1:1-18). 2. దేవుని కుమారుని బహిరంగ సువార్త సేవ (Joh,1,19-4,54). 3. దేవుని కుమారుడు ఎదుర్కొనిన ఎదిరింపులు అధ్యాయము 5 మొదలు 12 వరకు.  4. దేవుని కుమారుని శిష్యులను సేవకులుగా చేయుట అధ్యాయము 13 మొదలు 17 వరకు.  5. దేవుని కుమారుని సిలువ మరణము పునరుత్థానము అధ్యాయము 18 మొదలు 21 వరకు.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 43వ పుస్తకము; అధ్యాయములు 21; వచనములు 876; ప్రశ్నలు 167; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 15; నెరవేరిన క్రొత్త నిబంధన ప్రవచనములు 85; నెరవేరని ప్రవచనములు 7.

 

ఉపోద్ఘాతం: యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి రచించబడింది. ఆయన క్రీస్తు అనియు, దేవుని కుమారుడనియు, ఆయన నామమందు విశ్వాసము కలిగిన వారికి నిత్య జీవమనియు మరి ముఖ్యంగా తెలియజేస్తుంది. రెండవ తరం క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా తప్పుడు బోధలను సరి చేస్తూ వారికి సత్య సువార్తను నిక్షిప్తం చేస్తుంది ఈ గ్రంథం. యోహాను యేసు క్రీస్తు-ప్రభువు అనియు, మనుష్యకుమారుడు మరియు దేవుని కుమారుడు అని మరి ముఖ్యంగా తెలియజేస్తూ, క్రీస్తు ఆత్మ ప్రతీ వ్యక్తి పై ప్రభావితం చేస్తుంది అని వివరిస్తాడు.యేసు క్రీస్తు యొక్క బాప్తీస్మము మొదలుకొని మరణ పునరుత్థానము వరకు జరిగిన అన్ని సన్నివేశాలు ఈ గ్రంథం లో లిఖితం చేయబడినవి. ఈ సువార్త లో సువార్తికుడు కేవలం ఏడు అద్భుతాలను తెలియజేస్తూ ఆ ఏడు అద్భుతములు నేనే అని ఆయన ధృడంగా చెప్పిన ఏడు సత్యాలైన క్రీస్తు ప్రరిచర్యను విశ్లేషిస్తాడు. ఈ సువార్తికుని యొక్క గ్రంథం మిగతా సువార్తల కంటే ప్రత్యేకమైనది. కీస్తు ఆరోహణమైన తరువాత ఆదరణ కర్తయును సత్య స్వరూపియైన ఆత్మ ఏ విధంగా సర్వ సత్యమైన పరిచర్యలోనికి నడిపించిందో గమనించగలం. నమ్ముట, సాక్షి, ఆదరణ, జీవం – మరణం, వెలుగు – చీకటి, ప్రేమ అనే పదాలు అనేక మారులు ఈ సువార్తలో కనబడుతుంటాయి.

యేసు క్రీస్తును కేవలం తన జననం నుండే పరిచయం చేయడు కాని ఆది నుండి ఏమై ఉన్నదో ఆ వాక్యం నుండి వివరిస్తాడు. ఆదియందు వాక్యముగా, ఆ వాక్యమే శరీరధారియై, లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, మెస్సియగా, ప్రతీవాడు నశించకుండా ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు యేసు క్రీస్తును పరిచయం చేసింది ఈ సువార్త. యేసు క్రీస్తు జీవితములో ఉన్న దైవ స్వభావమును మానవత్వాన్ని వివరించి కాలమునకు సంబంధించిన భిన్నమైన ప్రాముఖ్యాంశములను ఆధారము చేసుకొని ఈ సువార్త రచించెను. యోహాను 3:16 అధికముగా చదవబడినది, అనేకులకు ప్రసంగించబడిన సువార్త వాక్యం ఇది. రక్షణ దేవుని వరమనియు, అది విశ్వసించిన వారికి మాత్రమే ఇవ్వబడుననియు ఈ వచనము చెప్పుచున్నది. అంతేకాదు నీకొదేముతో జరిగిన సంభాషణ, బాప్తీస్మమిచ్చు యోహాను సాక్ష్యము మొదలగు వాటి మూలమున, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నూతన జన్మ పొందుట ఒక్కటే మార్గమని తెలియజేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో తాను పొందబోయే ఆ సిలువ మరణము గూర్చి మరియు తాను ఆరోహణమైన తరువాత వారు చేయబోయే పరిచర్య విషయమై వారిని సిద్దపరిచాడు.

యేసు క్రీస్తు తనను గూర్చి దృఢంగా చెప్తూ, జీవాహారము నేనే (6:35,48), నేను లోకమునకు వెలుగై ఉన్నాను(8:12,9:5), నేనే ద్వారమును (10:7,9), నేను మంచి కాపరిని (10:11,14), పునరుత్థానమును జీవమును నేనే (11:25), నేనే మార్గమును సత్యమును జీవమును (14:6), నేనే నిజమైన ద్రాక్షావల్లిని (15:1-5) అను ఏడు సంగతులు ప్రత్యేకముగా వివరించాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనే ప్రాముఖ్యమైన సంగతి 4:24 లో గమనించగలం.

సారాంశం: నిజ జీవితంలో పరిపూర్ణమైన పరిచర్య ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా 3:16 తెలియజేస్తుంది. యేసు క్రీస్తు వలే మానవత్వంలో మాదిరికరమై, ఇతరుల పట్ల కూడా అదే జీవితం మనమందరం కలిగి యుండాలి, జీవించాలి. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించి, నిత్యజీవమునకు వారసులమై ఆశీర్వాదములు పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకారకులమయ్యే ధన్యత కలిగి యుండాలి. అట్లు ప్రభువు మీకు సహాయం చేయును గాక. ఆమేన్.