Psalms - కీర్తనల గ్రంథము 1 - గ్రంథ విశ్లేషణ

1. దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

ధన్యజీవులు అని తర్జుమా చేయబడిన హీబ్రూ పదానికి ఆనందంగా ఉండేవారు, ఆనంద కరమైన స్థితిలో ఉండేవారు లేక అదృష్టవంతులు అని అర్థం. కీర్తనల్లో ఈ పదానికి లోతైన అర్థాన్ని మరింత సంపూర్ణంగా గ్రహించాలంటే ఈ వచనాలు చూడండి – Psa 2:12; Psa 32:1-2; Psa 40:4; Psa 41:1-2; Psa 65:4; Psa 84:4-5; Psa 94:12; Psa 106:3; Psa 119:1-2; Psa 128:1. ధన్యత, దేవుని దీవెనల గురించి నోట్స్ కోసం ఆదికాండము 12:2-3; సంఖ్యాకాండము 6:22-27; Deut 28:3-14; మత్తయి 5:3-12; లూకా 11:28; అపో. కార్యములు 3:26; గలతియులకు 3:9 గలతియులకు 3:14; ఎఫెసీయులకు 1:3 చూడండి. దేవుడు ప్రేమస్వరూపి (1 యోహాను 4:8). మనుషుల్ని దీవించడం ఆయనకు అతి ప్రియం. అయితే దేవుని దీవెనల సంపూర్ణత ఇక్కడ వర్ణించబడిన వ్యక్తులకే కలుగుతుంది. ఈ పతిత లోకం ఎలాంటిదో ఈ మొదటి వచనంలో టూకీగా చెప్పబడింది. ఎటు చూచినా దేవుని వాక్కుకు విరుద్ధమైన సూచనలు, చెడు సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. దేవుని మార్గాలను తిరస్కరించి, పాపానికి తమను తాము ఇచ్చివేసుకొని, దేవుని సత్యాలను పరిహాసం చేస్తున్నారు. ధన్య జీవులైనవాళ్ళు అలాంటివారి మాట వినరు. వారితో సహవాసం చెయ్యరు. ఈ వచనాల్లో దుర్మార్గం ఎలా ఎదుగుతూ వెళ్తుందో చూడండి – నడవడం, నిలవడం, కూర్చోవడం. ఒక మనిషి చెడు సలహాలను పాటిస్తూవుంటే అది అతణ్ణి చివరికి దేవుని విషయాలను వెక్కిరించే స్థితికి తీసుకుపోతుంది (విశ్వాసులు ఎక్కడ కూర్చోవాలో, ఎలా నిలబడాలో, ఎలా నడవాలో క్రొత్త ఒడంబడిక చూపిస్తున్నది – ఎఫెసీయులకు 2:6; ఎఫెసీయులకు 6:11 ఎఫెసీయులకు 6:14; Col 2:6 మొ।।).

2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

ఈ వచనంలో నిజమైన ధన్యతకూ దేవుడు వెల్లడించిన సత్యాన్ని ప్రేమించడానికీ మధ్య ఉన్న సంబంధం అర్థమౌతున్నది. ధన్యజీవి చెడు మాటలకూ చెడు విధానాలకూ దూరంగా ఉండడమే కాదు, పూర్తిగా వేరొక దానిలో నిమగ్నమై ఉంటాడు అని “ఆనందిస్తూ”, “ధ్యానం చేస్తూ” అనే రెండు ముఖ్యమైన పదాలు సూచిస్తున్నాయి. దేవుని ఉపదేశంలో ఆనందించడమంటే దేవునిలోను, దేవుని మార్గాల్లోను వెల్లడైన ఆయన సంకల్పంలోనూ ఆనందించడమే. హృదయానికి మరేదీ ఇవ్వలేనంత ఆనందాన్ని ఇది ఇస్తుంది. Psa 37:4 మొ।। పోల్చిచూడండి. దేవుని ఉపదేశంలో ఆనందించే ఒక మనిషి ఉదాహరణ కావాలంటే 119వ కీర్తన చూడండి. ఇక్కడ ఉపదేశం అని తర్జుమా చేసిన మాటకు “ధర్మశాస్త్రం” అని కూడా అర్థం ఉంది. అప్పటివరకు దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడి చేసినదంతా అని దీని భావం. ఇప్పుడు మనకు బైబిలంతా అని అర్థం చేసుకోవాలి. దేవుని సత్యం మూలంగా మాత్రమే మనుషులు నిజమైన ధన్యతను అనుభవించగలరు. ఈ ధన్యత గురించి జ్ఞానులు, మతోపదేశకులు, వేదాంతులు అందరి రచనలన్నిటి కంటే బైబిలులో ఎంతో ఎక్కువ ఉంది. మనుషులు దేవుని వాక్కులో ఆనందించి, ధ్యానించి, లోబడే మేరకు ఈ ధన్యతను అనుభవిస్తారు. “రాత్రింబగళ్ళు” అనే మాటలు చూడండి. అంటే దేవుడు వెల్లడించిన సత్యాన్ని అస్తమానం మననం చేసుకొంటూ మన సామాన్య దిన కృత్యాల్లో కూడా అది మన హృదయాలనూ మనస్సులనూ నిండిపోతూ ఉండాలి. యోహాను 15:7; Col 3:16 మొ।। చూడండి. దాన్లో మనం ఆనందిస్తే ఇది అసాధ్యమని ఎంత మాత్రం అనిపించదు. “ధ్యానం చేస్తూ”– అంటే దేవుని వాక్కు అర్థం చేసుకుంటూ మన జీవితాల్లో ఆచరిస్తూ ఉండేలా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం గానీ జపం గానీ యోగ ధ్యాన సాధనాలు గానీ కాదు.

3. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

దేవుని ఉపదేశాల్లో ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉండడం వల్ల కలిగిన ఫలితాలివి – ఆధ్యాత్మిక పోషణ, ఎడతెగని ఫలాలు, విజయం. న్యాయవంతులు దేవుడు నాటిన చెట్లు – యెషయా 60:21; యెషయా 61:3; మత్తయి 15:13. వారు “కాలువల దగ్గర నాటి ఉన్న” చెట్లలాంటివారు. బైబిల్లో నీరు కొన్ని సార్లు దేవుని ఆత్మకు గుర్తు. చెట్లకు నీరెలా అవసరమో దేవుని ప్రజల జీవానికి, అభివృద్ధికి దేవుని ఆత్మ అంత అవసరం. దేవుని సత్యంలో అస్తమానం ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండే వ్యక్తి తాను దీవెనలు ప్రవహించే నది పక్కనే ఉన్నాననీ దేవుని ఆత్మ తన చుట్టూ తనలో ఉన్నాడనీ తెలుసుకుంటాడు. యోహాను 7:37-39 పోల్చిచూడండి.

4. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

గాలికి కొట్టుకుపొయ్యే పొట్టు పనికి మాలినవాటికీ చంచలమైన వాటికీ గుర్తుగా ఉంది (యోబు 35:5; యెషయా 17:13; యెషయా 29:5; మత్తయి 3:12).

5. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

కీర్తనల్లో పదే పదే కనిపించే అంశాల్లో ఒకటి దుర్మార్గులకు కలగబోయే దేవుని తీర్పు (Psa 2:12; Psa 7:11; Psa 9:7-8; Psa 11:6; Psa 21:8-9; Psa 94:1-2; Psa 96:13; Psa 119:84). ప్రభువైన యేసు క్రీస్తు రెండో రాకడ సమయంలో ఈ వచనం నెరవేరుతుంది. ఇప్పుడైతే ఒకవేళ దేవుని ప్రజల సభల్లో దుర్మార్గులు కూడా కలిసిపోయి ఉండవచ్చు (మత్తయి 13:24-30; ప్రకటన గ్రంథం 2:14-16 ప్రకటన గ్రంథం 2:20-25; ప్రకటన గ్రంథం 3:1-4). అయితే దేవుడు న్యాయాధిపతిగా కూర్చున్న వేళ వారక్కడ ఇక నిలవలేరు.

6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

న్యాయవంతుల జీవిత విధానం దేవునికి తెలుసు, ఎందుకంటే అది దేవుని విధానమే. ఆ విధానాన్ని, దీనిలో ఉన్న వారందరినీ ఆయన ప్రేమాభిమానాలతో చూసుకుంటాడు. దుర్మార్గుల జీవిత విధానం, దానిలో ఉన్నవారందరూ శాశ్వతంగా లయమైపోతారు (యెషయా 66:22-24; మత్తయి 25:41-46; 2 థెస్సలొనీకయులకు 1:8-9; 2 పేతురు 3:13; ప్రకటన గ్రంథం 21:22-27). కపట మార్గాలు, వంకర దారులు, చెడు విధానాలు అన్నిటినీ భూమి పైనుంచి తుడిచి పెట్టేసే రోజు రాబోతున్నది. అంతటా శాశ్వతంగా దేవుని సత్యం, పవిత్రలతో కూడిన విధానాలు స్థిరపడబోతున్నాయి.