చెరనుండి విడిపించాలన్న ప్రార్థన వెనువెంటనే సహజంగా ఈ వచనాలు వచ్చేశాయి. చెరనుంచి విడుదలైనవారు శుభవార్తను ప్రకటిస్తూ శ్రమిస్తారు. వారు ప్రభువుకోసం పంటను కోస్తారు. దేవుని సేవకుల్లో ఉండే గొప్ప పట్టుదల, తీవ్రతలను ఈ కన్నీళ్ళు, ఏడుపు సూచిస్తున్నాయి. పాపాత్ములు అడ్డంకులను కల్పించే సంగతినీ, మనుషుల హృదయ కాఠిన్యాన్నీ, పాపంలో నశించిపోతున్నా వారికోసం పొంచివున్న ఆపదలనూ చూచి వారు ఏడుస్తారు. అంతేగాక తాము బలహీనులము, సేవ సరిగా చేయలేనివారము, తప్పులు చేసేవారమని కూడా వారు ఏడవవచ్చు. క్రీస్తు ప్రేమను బట్టి, నశించిన మనుషులపై తమకున్న జాలిని బట్టి కూడా వారు ఏడుస్తారు. అలాంటి మనుషులు తప్పకుండా పంట కోస్తారు. చివర్లో ఆనందం వారిదౌతుంది – కీర్తనల గ్రంథము 119:136; యెషయా 22:4; యిర్మియా 9:1; యిర్మియా 13:17; యిర్మియా 14:17; లూకా 19:41; అపో. కార్యములు 20:19 అపో. కార్యములు 20:31; 1 కోరింథీయులకు 15:58.