Psalms - కీర్తనలు 33 - గ్రంథ విశ్లేషణ

1. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

“దైవ సంస్తుతి”– కీర్తనలు 7:17; కీర్తనలు 8:2; కీర్తనలు 9:1; కీర్తనలు 16:7; కీర్తనలు 18:3; కీర్తనలు 42:5; కీర్తనలు 100:4; కీర్తనలు 150:6; యెషయా 12:1; మత్తయి 5:16; మత్తయి 11:25; లూకా 1:68; రోమీయులకు 15:7 రోమీయులకు 15:11; 2 కోరింథీయులకు 1:3; ఎఫెసీయులకు 1:3 ఎఫెసీయులకు 1:6 ఎఫెసీయులకు 1:12 ఎఫెసీయులకు 1:14; ప్రకటన గ్రంథం 5:12-13; ప్రకటన గ్రంథం 19:5. ఆదికాండము 24:27; నిర్గామకాండము 15:2; లేవీయకాండము 19:24; ద్వితియోపదేశకాండము 8:10; ద్వితియోపదేశకాండము 32:3; 1 దినవృత్తాంతములు 16:4 1 దినవృత్తాంతములు 16:9 1 దినవృత్తాంతములు 16:25 కూడా చూడండి. తనకు స్తుతులు కరువయ్యాయని దేవుడు మనలను స్తుతించాలని ఆజ్ఞాపించలేదు. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని తాపత్రయ పడడానికి ఆయనేమీ మనిషి కాదు. ఆయన తనను స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెపుతున్నాడన్న మాట. స్తుతి అంటే మాటలతో వెల్లడి చేయబడిన మెప్పు, ఆమోదం. మనుషులు తమకు ఏవైతే మంచివిగా, అందమైనవిగా, శక్తివంతమైనవిగా, అర్థవంతమైనవిగా అనిపించినవో వాటిని పొగడుతారు. తమకు యోగ్యంగా అనిపించినదానిలో తమ సంతోషాన్ని వెల్లడిస్తారు. అతి ఉన్నతమైన మంచితనం, అందం, బలప్రభావాలు, అర్థం దేవునిలోనే ఉన్నాయి. ఈ విశ్వంలోని వస్తువులు, మనుషులు జీవులన్నిటిలో అందరికంటే మిన్నగా స్తుతికి పాత్రుడు ఆయన. మనం దీన్ని గుర్తించాలని ఆయన ఉద్దేశం. ఆయన కోసం కాదు, మన మేలుకే. మనం అంతటిలో, అందరిలోకెల్లా స్తుతికి పాత్రుడైనవాణ్ణి గుర్తించి స్తుతించేవారమై ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన యోగ్యతను గమనించడమే. అంటే, అతి శ్రేష్ఠమైన, ఉన్నతమైన దానిలో మన ఆనందాన్ని కనుక్కోవడమన్నమాట. ఇలా చెయ్యడం మనకు సమంజసం, తగినది (1 వ). తమ స్తుతికి తగని అనేక రకాల వస్తువులనూ వ్యక్తులనూ మనుషులు స్తుతిస్తారు. అయితే దేవుణ్ణి ఎరిగినవారు స్తుతికి పాత్రుడైన ఆయన్నే స్తుతించడం తగిన పని కాదా. మూర్ఖులు, తృప్తి లేనివారు, స్వార్థపరులు, నమ్మకం లేనివారు, నైతికంగా, ఆధ్యాత్మికంగా అంధులు. ఆత్మలో, సత్యంలో దేవుణ్ణి ఆరాధించరు. వినయ మనస్కులు, న్యాయవంతులు, జ్ఞానప్రకాశం పొందినవారు, సత్యాన్ని గ్రహించినవారు అలా చెయ్యగలరు, చేస్తారు. దుర్మార్గులు తమ లజ్జాకరమైన విషయాలను బట్టి ఆనందిస్తూ లోక సంబంధమైనవాటినే పొగడుతూ ఉంటారు (ఫిలిప్పీయులకు 3:19). న్యాయవంతులైతే దేవునిలోను తమ రక్షకుడైన క్రీస్తులోను ఆనందిస్తారు (1 కోరింథీయులకు 1:31; 2 కోరింథీయులకు 10:17; గలతియులకు 6:14; 1 తిమోతికి 1:17). దేవుణ్ణి స్తుతించకపోవడం, కృతజ్ఞతలు చెప్పకపోవడం నిందాపాత్రం. ఇది మనిషి స్వభావంలోనే ఒక లోపాన్ని చూపెడుతుంది. ఈ లోపం తన ప్రజలలో ఉండకూడదని దేవుని ఉద్దేశం. స్తోత్రాలు చెల్లించడం, పాటలు పాడడం, దేవుణ్ణి కీర్తించడం ఇవన్నీ వారికి స్వతహాగా వస్తాయి. ఇవి వారి కొత్త స్వభావాన్ని సూచిస్తాయి. దేవుణ్ణి బాగా ఎరిగినవారు, అందరికంటే ఎక్కువ జ్ఞానప్రకాశం, వినయం ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా స్తుతిస్తారు.

2. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
ఎఫెసీయులకు 5:19

3. ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
ప్రకటన గ్రంథం 5:9, ప్రకటన గ్రంథం 14:3

4. యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది.

న్యాయవంతులు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలనే దానికి మరిన్ని కారణాలు – ఆశ్చర్యకరమైన, సుందరమైన కార్యాల్లో ఆయన ఉపయోగించిన ఆయన వాక్కు, ఆయన విశ్వసనీయత, నీతిన్యాయాలు, ఆయన కృప, ఆయన బలప్రభావాలు. 10,11వ వచనాల్లో మరో కారణం కనిపిస్తున్నది – తన ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగలిగేందుకు ఆయనకున్న సామర్థ్యం.

5. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవా కృపతో నిండియున్నది.

6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
హెబ్రీయులకు 1:14, హెబ్రీయులకు 11:3

శాస్త్రవేత్తలు, వేదాంతుల ఊహాగానాలన్నటినీ కలిపి చూచినా ఈ విశ్వం పుట్టుక గురించి ఈ ఒక్క వచనంలో ఉన్న సత్యానికి సాటి రావు. కీర్తనలు 148:5; ఆదికాండము 1:1; యెషయా 40:25-26; యోహాను 1:1-2; హెబ్రీయులకు 11:3 చూడండి.

7. సముద్రజలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.

8. లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుప వలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను.

పాపవిముక్తి లేనివారు తగిన రీతిగా దేవుణ్ణి స్తుతించలేరు. అయితే ఆయనకు భయపడడం వారు నేర్చుకోవాలి. ఆయన మహా బలాఢ్యుడైన సృష్టికర్త. భూనివాసుల ఎత్తు గోడలను ఆయన కూలద్రోస్తాడు. తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు (కీర్తనలు 2:4-6; సామెతలు 19:21; యెషయా 8:10; యెషయా 14:24; యెషయా 19:3; అపో. కార్యములు 2:23; రోమీయులకు 11:33-36).

9. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
హెబ్రీయులకు 1:14, హెబ్రీయులకు 11:3

10. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును.

11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.

భూమిపై తన సంకల్ప సిద్ధికి దేవుడు ఇస్రాయేల్ జాతిని ఎన్నుకొన్నాడు. అంతేగాక అన్ని జనాలను ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. ఎక్కడెక్కడా జరుగుతున్నదంతా ఆయనకు తెలుసు. సైన్యాలు యుద్ధానికి కదులుతాయి, గుర్రాలు కదను తొక్కుతాయి, యోధులు తమ బలాబలాలు తేల్చుకుంటారు. అయితే గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం దేవుడే. ఆయన అన్ని విషయాలనూ తన మహిమార్థం, న్యాయవంతుల శ్రేయస్సు కోసమే ఏర్పాట్లు చేస్తాడు (2 దినవృత్తాంతములు 16:9; రోమీయులకు 8:28).

12. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.

13. యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు.

14. తానున్న నివాసస్థలములోనుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు.

15. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలన్నియు విచారించువాడు వారిని దర్శించు వాడు.

16. ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.

17. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు.

18. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును

19. యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచు చున్నది.

“కరవు”– కరవు కాలంలో దేవుడు ఆదుకునేది ఎలాంటివారినో గమనించండి. కీర్తనలు 37:19 కూడా చూడండి.

20. మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మికయుంచి యున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించు చున్నది

హృదయంలో మనం అవలంబించవలసిన ఏకైక తీరు ఇదే. కల్లోలంతో, తిరుగుబాటుతో, వినాశంతో నిండివున్న ప్రపంచంలో మానసిక శాంతి దొరికే ఏకైక మార్గం ఇదే.

21. మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొను చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.

“మనకు నమ్మకం ఉంది”, “ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం”– ఈ మనోభావం క్షేమాన్నీ ఆనందాన్నీ తెస్తుంది.

22. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.