తన పిల్లల్లో ప్రతి వ్యక్తినీ దేవుడు పరీక్షిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. మనం ఏమై ఉన్నామో దానిని, మన ఆలోచనలను, మన నమ్మకాలను, మన చర్యలను అన్నిటినీ ఆయన పరీక్షకు గురి చేసి శోధిస్తాడు. ఆయనమీద నమ్మకముంచిన వారికి ఈ లోకం పరీక్షా ప్రదేశం. దేవుని వెండిని (విశ్వాసులను) శుద్ధి చేసే కొలిమి ఇది. అంటే ఇక్కడ దేవుడు నమ్మకాన్నీ గుణాలనూ శుద్ధి చేస్తూ వికసింపజేస్తూ ఉన్నాడు. ఇది ఒక అరణ్య ప్రాంతం, ఒక ఎడారి. ఇక్కడ కఠినులైన మనుషులు విశ్వాసులను వేటాడి పట్టుకుని వారి పై మోయరాని బరువులను మోపడం, గర్విష్ఠులు వారిపై స్వారీ చేస్తూ వారిని ధూళిలో తొక్కివేయడం జరుగుతున్నది (అయితే ఇదంతా దేవుని మంచి ఉద్దేశాలు నెరవేరేందుకే). ఈ లోకాన్ని దేనితో పోల్చాలి? ఇది దేవునికి చెందిన లోహాన్ని ముందు కొలిమిలో కాల్చి తరువాత నీటిలో ముంచడం ద్వారా చేవ పెట్టడం, పదును చేయడం జరుగుతున్న స్థలం. ఈ విధంగా పవిత్రులు దృఢపడతారు. దావీదు వ్యక్తిగత జీవితంలో ఇలానే జరిగింది. నిజంగా దేవునికి చెందిన వారందరి జీవితాల్లో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది (యోహాను 16:33; హెబ్రీయులకు 12:7-11; 1 పేతురు 1:6-7; 1 పేతురు 4:1 1 పేతురు 4:12). ఈ వచనాల్లో ఈ పనులన్నీ చేస్తున్నది మనుషులే అయినప్పటికీ, వాటి వెనుక ఉన్నది దేవుని హస్తమే అని గమనించండి. ఆదికాండము 45:5; ఆదికాండము 50:20; అపో. కార్యములు 2:23 చూడండి. ఇలాంటి పరీక్షల గురించి ఆదికాండము 22:1; న్యాయాధిపతులు 2:22 నోట్స్ చూడండి.
“వెండి”– వెండిని శుద్ధి చేసేందుకు ఎంతో శ్రద్ధ, నిపుణత అవసరం. కొలిమిలో మంట ఎక్కువ గానీ తక్కువ గానీ కాకూడదు. దేవుడు తన పిల్లలను విషమ పరీక్షలకు గురి చేయడంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు. ఎంతో ఓపిక చూపుతాడు. తమ పిల్లలను ప్రేమించని తల్లిదండ్రులు అడపాదడపా ఒక చెంప దెబ్బ మినహా మరి ఏ విధమైన క్రమశిక్షణా లేకుండా పెంచుతారు. దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వారికి క్రమశిక్షణ నేర్పుతాడు. విషమ పరీక్షలు మాకు వద్దని మనం తోసిపుచ్చితే శుద్ధి కావడానికి, పవిత్రం చేయబడడానికి నిరాకరిస్తున్నాం అన్నమాట.