ఇది కూడా అభిషిక్తుని కీర్తన. అంటే ప్రభువైన యేసుక్రీస్తును గురించిన భవిష్యద్వాక్కులు ఇందులో ఉన్నాయి. రచయిత దావీదురాజు కాలంలో హేమాను ఆసాపులతో కలిసి పనిచేసిన ఏతాన్ (1 దినవృత్తాంతములు 15:19). అతడు రాసిన కీర్తనల్లో మనకు ఉన్నది ఇదొక్కటే. దీన్ని అతడు పండు వృద్ధాప్యంలో రెహబాం కాలంలో, ఇస్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయిన సమయంలో రాసి ఉండవచ్చు. ఇక్కడ ఈ కీర్తన ముఖ్యాంశాన్ని రచయిత తెలియజేస్తున్నాడు – ఇస్రాయేల్ వారి ఒడంబడిక దేవుడైన యెహోవా యొక్క కరుణ, విశ్వసనీయత. దేవుని విశ్వసనీయత – 1, 2, 5, 8, 14, 24, 33, 49 వచనాలు. ఈ లక్షణం “ఆడితప్పను” (33,34 వ) “ప్రమాణం చేశాను”. (3,35,49 వ) అనే మాటల ద్వారా కూడా వెల్లడి అయింది. దేవుని కరుణ – 1, 2, 14, 24, 28, 33, 49 వచనాలు. ఈ కీర్తన ద్వారా ఏతాన్ గత 3000 సంవత్సరాలలో ఉన్న తరాల విషయంలో దేవుని విశ్వసనీయతను ప్రకటిస్తున్నాడు.