“చెవులు”– ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్కును వినకుండా ఉండేవారికి వినడానికి సామర్థ్యం లేకుండా పోతుంది.
“కండ్లు”– చీకటి అంటే ఎన్నుకొన్నవారు ఆధ్యాత్మిక కాంతినీ, సత్యాన్నీ చూచే సామర్థ్యతను కోల్పోతారు. ఇలాంటి పనికి పిలుపు రావడం యెషయాకు బాధకరంగా ఉండివుండవచ్చు. ఇలాంటి నిష్ఠూరమైన సేవను ఎన్నాళ్ళు చేయాలో, చివర్లో నైనా ఇష్టంగా అనిపించే సేవ ఏదన్నా ఉంటుందో ఉండదోనన్న అనుమానం అతనికి సహజంగా వచ్చేదే. తరువాత కాస్త మెరుగైన పనిని ఇస్తానని దేవుడు మాట ఇవ్వలేదు. అయితే ఈ క్రొత్త ఒడంబడిక దినాల్లో తన సేవకులకు మరింత శ్రేష్ఠమైన, మహిమాన్వితమైన సేవను అప్పగించాడు (మత్తయి 28:18-20; 2 కోరింథీయులకు 3:6-11). యెషయా విషయానికొస్తే క్రీస్తు రాకడను గురించి ముందుగా ప్రకటించే ధన్యత తదుపరి కాలంలో అతనికి కలిగింది. అయితే ఇక్కడ మాత్రం అతనికి అలాంటి అవకాశం వస్తుందని ఎలాంటి వాగ్దానమూ లేదు.