ఈ ఆఖరు దర్శనం భూమి అంతటిలో దేవుని ఉద్దేశం నెరవేరడం గురించి. జెకర్యా గ్రంథంలోని ఇతర భాగాలనుండి మనకు తెలిసినట్టుగా దేవుని ప్రజలను బాధించే దేశాలపై తీర్పు తీర్చడం ఈ ఉద్దేశంలో ఒక భాగం (జెకర్యా 1:14-15, జెకర్యా 1:21; జెకర్యా 12:2-4; జెకర్యా 14:2-3). యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు తదితర ప్రవక్తలు దీని గురించి రాశారు.
“రెండు పర్వతాల”– జెకర్యా జెరుసలంలో ఉన్నాడు. ఇవి అక్కడి ప్రాముఖ్యమైన పర్వతాలలో రెండై ఉండవచ్చు. ఈ దర్శనంలోని పర్వతాలు కంచువి. దేవుని దృఢ సంకల్పం గురించీ, జెరుసలం విషయంలో ఆయన ఉద్దేశాలు ఎప్పుడూ సమసిపోవు అన్న సత్యం గురించీ ఇది సూచిస్తూ ఉండవచ్చు, లేక ఆయన తీర్పును సూచిస్తూ ఉండవచ్చు (“కంచు”– సంఖ్యాకాండము 21:9; నిర్గమకాండము 27:1-2; ప్రకటన గ్రంథం 1:15).
“నాలుగు”– జెకర్యా 1:18.
“రథాలు”– కీర్తనల గ్రంథము 68:17; 2 రాజులు 6:17. ఇవి యుద్ధ రథాలై దేవుని ప్రజల సంరక్షణనూ వారి శత్రువుల ఓటమినీ సూచించవచ్చు.