Malachi - మలాకీ 1

1. ఇశ్రాయేలీయులనుగూర్చి మలాకీద్వారా పలుక బడిన యెహోవా వాక్కు.

1. దేవుని దగ్గర్నుండి ఇది ఒక సందేశం. ఈ సందేశం యెహోవా దగ్గరనుండి వచ్చింది. ఇశ్రాయేలీయులకు ఈ సందేశాన్ని మలాకీ ఇచ్చాడు.

2. యెహోవా సెలవిచ్చునదేమనగానేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరుఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.
రోమీయులకు 9:13

2. “ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు యెహోవా. కానీ “నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియ జేసేది ఏమిటి?” అని మీరు అన్నారు. యెహోవా చెప్పాడు: ‘ఏశావు యాకోబుకు సోదరుడు. కానీ నేను యాకోబును ఎన్నుకొన్నాను.

3. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.

3. మరియు ఏశావును నేను అంగీకరించలేదు. ఏశావా యొక్క కొండ దేశాన్ని నేను నాశనం చేశాను. ఏశావు దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి కుక్కలు మాత్రమే నివసిస్తాయి.”

4. మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీ యులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగావారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.

4. ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చును. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోముదుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.

5. కన్ను లార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.

5. ప్రజలారా, మీరు ఈ సంగతులు చూశారు, మరియు “ఇశ్రాయేలుకు వెలుపల కూడ యెహోవా గొప్పవాడు” అని మీరు చెప్పారు.

6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
లూకా 6:46

6. “పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. కనుక మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు” అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు. కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని చూపించడానికి మేము ఏమి చేశాం?” అని అంటారు.

7. నా బలి పీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా
1 కోరింథీయులకు 10:21

7. “పాడై పోయిన రొట్టెను మీరు నా బలిపీఠం దగ్గరకు తీసికొని వస్తారు” (అని యెహోవా చెప్పాడు.) కానీ మీరు “ఆ రొట్టెను ఏది పాడు చేస్తుంది?” అని అంటారు. (యెహోవా చెప్పాడు,) “ నా బల్లను మీరు గౌర వించరు.

8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

8. గుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. మరి అదీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! ఆ కానుకలు అతడు అంగీకరించడు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

9. దేవుడు మనకు కటా క్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

9. “యాజకులారా! యెహోవా మా యెడల దయగలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కాని ఆయన మీ మాట వినడు. మరి ఆ తప్పు అంతా మీదే”. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

10. మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్య మును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

10. “కనీసం, మీ యాజకుల్లో కొందరు దేవాలయం తలుపులు మూయపచ్చు, హోమాలు సరిగ్గా వెలిగించవచ్చు. మీ విషయం నాకు సంతోషంగా లేదు. నేను మీ కానుకలు అంగీకరించను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.

11. తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మత్తయి 8:11, లూకా 13:29, 2 థెస్సలొనికయులకు 1:12, ప్రకటన గ్రంథం 15:4

11. “ప్రపంచం అంతటా మనుష్యులు నన్ను గౌరవిస్తారు. ప్రపంచం అంతటా మనుష్యులు నాకు మంచి కానుకలు అర్పిస్తారు. నాకు కానుకగా వారు మంచి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే, ఆ మనుష్యులందరికీ నా పేరు ముఖ్యం గనుక.” సర్వశక్తి మంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12. అయితే­యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు
1 కోరింథీయులకు 10:21

12. “కానీ మీరు మాత్రం నా పేరు అంటే మీకు గౌరవం లేదని చూపించారు. యెహోవా బల్ల మలినంగా ఉందని మీరు అంటారు.

13. అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చు చున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.

13. ఆ బల్లమీది భోజనం మీకు ఇష్టంలేదు. ఆ భోజనాన్ని మీరు వాసన చూచి, తినుటకు నిరాకరిస్తారు. అది చెడిపోయిందని మీరు చెబుతారు. కానీ అది సత్యం కాదు. ఆ తర్వాత జబ్బువి, కుంటివి, గాయపర్చబడిన జంతువులను మీరు నాకోసం తెస్తారు. జబ్బు జంతువులను నాకు బలి అర్పణలుగా ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. కానీ మీ వద్దనుండి ఆ జబ్బు జంతువులను నేను అంగీకరించను.

14. నేను ఘనమైన మహారాజునైయున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

14. కొంతమంది దగ్గర వారు బలి అర్పణలుగా ఇవ్వగలిగిన మంచి మగ జంతువులు ఉన్నాయి. కానీ ఆ మంచి జంతువులను వారు నాకు ఇవ్వరు. కొంత మంది మంచి జంతువులను నాకోసం తీసికొని వస్తారు. ఆరోగ్యంగా ఉన్న ఆ జంతువులను నాకు ఇస్తాం అనివారు వాగ్దానం చేస్తారు. కానీ వారు ఆ మంచి జంతువులను రహస్యంగా మార్చివేసి, జబ్బు జంతువులను నాకు ఇస్తారు. ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. నేను మహారాజును. మీరు నాయెడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచం అంతటా ప్రజలు నాయందు భయభక్తులు కలిగి ఉంటారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2017. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.