‘యేసు” అనే పేరుకు (హీబ్రూ “యెహోషువ” అనే పేరు లాగానే) “యెహోవా రక్షిస్తాడు” అని అర్థం. “క్రీస్తు” అనేది గ్రీకు భాషా పదం. దీని అర్థం “అభిషిక్తుడు”. హీబ్రూ పదం “మెస్సీయ”కు ఉన్న అర్థమే గ్రీకు “క్రీస్తు”కూ ఉంది. మత్తయి ఈ శుభవార్త రాయడంలో అతని గొప్ప ఉద్దేశాల్లో ఒకటి పాత ఒడంబడికలో వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసేనని చూపడం. పాత ఒడంబడిక ప్రకారం మెస్సీయను దేవుడు అభిషేకిస్తాడు, అంటే దేవుడాయన్ను పాత ఒడంబడికలోని వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తాడు. ఆయన ప్రవక్తగా, యాజిగా, రాజుగా ఉంటాడు (ద్వితీయోపదేశకాండము 18:15; 2 సమూయేలు 7:11; కీర్తనల గ్రంథము 2:2-9; కీర్తనల గ్రంథము 89:27-29; కీర్తనల గ్రంథము 110:1, కీర్తనల గ్రంథము 110:4; యెషయా 7:14; యెషయా 9:6-7; యెషయా 11:1-9; యెషయా 52:13-15; జెకర్యా 6:12-13). పాత ఒడంబడిక ప్రకారం అభిషిక్తుడు జాతి పిత అయిన అబ్రాహాముకు, ఇస్రాయేల్వారి రాజులందరిలోకీ గొప్ప రాజైన దావీదుకూ సంతానమై ఉండాలి. యేసుప్రభువు విషయంలో ఇది వాస్తవం అని చూపేందుకు మత్తయి ఈ వంశావళిని ఇస్తున్నాడు. ఈ వంశావళులు రహస్య సమాచారమేమీ కాదు. అవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. కావాలనుకున్న ఏ యూదుడైనా వీటిని సరిచూసుకోవచ్చు.
బైబిల్లో “కుమారుడు” అనే మాటను అనేక రకాలైన సంబంధాలను సూచించేందుకు వాడారు. కొన్ని సార్లు మామూలుగానే ఒక వ్యక్తికి పుట్టిన కొడుకు అని అర్థం వస్తుంది. ఇదిగాక మనుమడు, శిష్యుడు, అతి ప్రియమైన వ్యక్తి, లేక ఏ తరంలో అయినా పుట్టిన ఆ సంతతివాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యేసు ఆయన మానవ స్వభావాన్ని బట్టి తనకు వెయ్యి సంవత్సరాలకు ముందు జీవించిన దావీదు సంతతికీ, రెండు వేల సంవత్సరాలకు ముందు జీవించిన అబ్రాహాము సంతతికీ చెందినవాడు అని అర్థం.