Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

John - యోహాను సువార్త 4

1. యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పడు

“పరిసయ్యులు”– మత్తయి 3:7. ఇక్కడ యోహాను యేసుకు “ప్రభువు” అనే బిరుదు వాడుతున్నాడు. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో యేసును ప్రభువని వందల సార్లు అనడం కనిపిస్తున్నది. అనేక చోట్ల ఈ మాటకు అర్థం మనుషులందరికి ఏకైక ప్రభువు, విశ్వానికంతటికీ మహామహుడైన ప్రభువు అని (1 కోరింథీయులకు 8:6; ప్రకటన గ్రంథం 1:16). పాత ఒడంబడిక గ్రంథం గ్రీకు అనువాదంలో “ప్రభువు” అనే పదానికి గ్రీకు పదం కురియొస్‌ను యెహోవా అనే పేరును అనువదించడానికి ఉపయోగించారు. (యెహోవా – నిర్గామకాండము 3:14-15 నోట్ చూడండి.) పాత ఒడంబడికలో యెహోవాను ప్రభువు అన్నారు, క్రొత్త ఒడంబడికలో యేసును ప్రభువు అన్నారు. లూకా 2:11 నోట్ చూడండి.

2. ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.

3. అయి నను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చు చుండిరి.

శుభవార్త పుస్తకాల్లో పరిసయ్యులు దాదాపు ఎప్పుడూ యేసుప్రభువుకు విరోధులుగానే కనిపిస్తారు. చివరికి వారు ఆయన్ను హతమార్చేందుకు కుట్ర పన్నారు (యోహాను 7:32; యోహాను 11:57; యోహాను 18:3). యేసుకు వారి హృదయాలు తెలుసు (యోహాను 2:24-25). పాపులకోసం తాను జెరుసలంలో చనిపోవలసిన సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. అందువల్ల వారితో అనవసరమైన వివాదాలెందుకని యూదయ ప్రాంతం విడిచి వెళ్ళిపోయాడు.

4. ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక

యూదయ, గలలీ ప్రాంతాలమధ్య ఉన్న ప్రాంతం సమరయ. ఆ ప్రాంతం ప్రజలను యూదులు సాధారణంగా అసహ్యించుకునేవారు (వ 9. సమరయవారి గురించి నోట్ 2 రాజులు 17:24; మత్తయి 10:5). యూదయనుంచి గలలీ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ మీదుగా వెళ్ళేది దగ్గర దారి. కానీ చాలామంది యూదులు సమరయ ప్రజలను తప్పించు కొనేందుకు ఆ ప్రదేశం బయటగా చుట్టు దారిన ప్రయాణించే వారు. యేసు సమరయ మీదుగా “వెళ్ళవలసి వచ్చింది” అంటున్నాడు యోహాను. హడావుడిగా గలలీకి చేరుకోవలసి ఉంటే, లేక సమరయలో చెయ్యవలసిన పనేదైనా ఉంటే ఈ విధంగా ప్రయాణించడం అవసరం. వ 40లో యేసు తొందరగా ప్రయాణం చేయడం లేదని కనిపిస్తుంది. అయితే ఈ అధ్యాయం మిగతా భాగమంతా సమరయ ప్రాంతంలో చెయ్యాలనుకున్న ఒక పని ఆయనకు ఉందని తెలియజేస్తున్నది. ఎంత మంచి పని అది! అలా ప్రయాణం చెయ్యడానికి మరో కారణం బహుశా ఆ ప్రజలపై యూదులకు సామాన్యంగా ఉండే ద్వేషం తనకు లేదని చూపించుకోవడానికి కావచ్చు.

5. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
ఆదికాండము 33:19, ఆదికాండము 48:22, యెహోషువ 24:32

6. అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

యేసు ఇలా అలసిపోవడం ఆయనలోని నిజమైన మానవ స్వభావాన్ని తెలియజేస్తున్నది. దేవుడుగా ఆయనకు అలసట ఉండదు (యెషయా 40:28). మనిషిగా కాలినడకన సుదీర్ఘ ప్రయాణం వల్ల ఆయన అందరిలాగే అలసిపోయాడు. క్రీస్తుకున్న రెండు స్వభావాల గురించి యోహాను 1:14; హెబ్రీయులకు 2:14-17 చూడండి.

7. సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.

ఇక్కడ మళ్ళీ ప్రభువులోని మానవ స్వభావం బహిర్గతమైంది. దాహం మనుషులకే వేస్తుంది గాని దేవునికి కాదు.

8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.

9. ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
ఎజ్రా 4:3, ఎజ్రా 9:1-1044

మొదట్లో ఈమె యేసును దాహంతో ఉన్న ఒక యూదుడుగానే చూచింది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆయనెవరో అన్న విషయం ఆమెకు మరింతగా తెలుస్తూ రావడం చూడవచ్చు – గొప్ప వాగ్దానాలు చేసేవాడు (వ 10-15), ఒక ప్రవక్త (వ 19), చివరగా అభిషిక్తుడు (వ 25,26,29). క్రీస్తు ఎవరో దశలవారీగా అర్థం కావడం అన్నది విశ్వాసులంతా ఎరిగిన అనుభవమే.

10. అందుకు యేసునీవు దేవుని వరమునునాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెన

ఈ స్త్రీని దేవుని రాజ్యంలో చేర్చాలన్నదే క్రీస్తు ఉద్దేశం. తన మాటల్లో ఆమెకు ఏవిధంగా ఆసక్తి పెరిగేలా చేశాడో చూడండి. “జీవజలం” అంటే ఆయనిచ్చే నూతన జీవం. ఇందులో నూతన జన్మ (యోహాను 3:5), శాశ్వత జీవం (యోహాను 3:16), విశ్వాసుల హృదయాల్లో నివసించే దేవుని ఆత్మ (యోహాను 7:37-39) మొదలైన భావాలన్నీ ఇమిడివున్నాయి. ఇది యేసు ఉచితంగా ఇచ్చేదే అన్న విషయం గమనించండి (ప్రకటన గ్రంథం 22:17). యేసుప్రభువును అడగడం ద్వారా దీన్ని పొందగలమని కూడా గమనించండి. నిజానికి దాన్ని ఇవ్వగలిగినది ఆయనొక్కడే. పాత ఒడంబడిక గ్రంథంలో కూడా నీరు ఆధ్యాత్మిక జీవానికి సూచనగా ఉంది – కీర్తనలు 36:9; యెషయా 55:1; యిర్మియా 2:13; యిర్మియా 17:13.

11. అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?

ఈ స్త్రీ యేసు మాటను పూర్తిగా అపార్థం చేసుకున్నట్టుంది. ఇది అప్పుడూ ఇప్పుడూ కూడా తరచుగా జరుగుతూ ఉంది. ఆయన మాటలను అక్షరాలా అర్థం చేసుకుందామె. అప్పటి వాడుకలో జీవజలం అంటే వాగు లేక నదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండే నీరు. యేసు ఆధ్యాత్మిక విషయం గురించి మాట్లాడుతున్నాడని ఆమె గ్రహించినట్టు లేదు.

12. తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.

13. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;

ఇప్పుడు యేసు తాను మామూలు నీళ్ళ గురించి కాక, ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నానని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. శాశ్వతంగా దాహాన్ని తీసివేసి, శాశ్వత జీవాన్ని కలిగించే మామూలు నీరు ఎక్కడా లేదు.

14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

“దాహం కాదు”– అంటే విశ్వాసులు దేవుణ్ణి మరింత లోతైన అనుభవంకోసం ఆశించరని గానీ సత్యం, నీతిన్యాయాల కోసం దాహం అనుభవించరని గానీ అర్థం కాదు (కీర్తనలు 40:1-2; కీర్తనలు 119:131; మత్తయి 5:6). దీని అర్థం కొత్త జన్మనూ కొత్త జీవాన్నీ దేవుని ఆత్మమూలంగా అనుభవించిన తరువాత వాటికోసం మళ్ళీ దప్పిగొనక్కర్లేదు. వారిలోని లోతైన అభిలాషలను సంతృప్తి పరచగలిగే ఒక ఊట వారిలో ఉంటుంది. యేసు ఇచ్చే జీవం జలజల పారే నీటిలాంటిది. విశ్వాసి హృదయంలో పెల్లుబికే ఊటలాంటిది. అది సమృద్ధి జీవం (యోహాను 10:10). ఈ నీరు త్రాగడమెలా? నమ్మకంతో క్రీస్తుచెంతకు వచ్చి ఆయన్ను ప్రభువుగా ముక్తిదాతగా రక్షకుడుగా మన హృదయాల్లోకి స్వీకరించడమే.

15. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా

యేసు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడు తున్నాడని ఈ స్త్రీ గ్రహించిందా? గ్రహించినట్టయితే బయట పెట్టడం లేదు. అయితే ఆధ్యాత్మిక జీవం గురించిన ఆశ బహుశా ఆమె మనసులో మొగ్గ తొడిగింది.

16. యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.

ఈ మాటలకూ ఇంతవరకు మాట్లాడినదానికీ ఎక్కడా పొంతన ఉన్నట్టు కనిపించదు. కానీ తప్పకుండా సంబంధం ఉంది, సందేహం లేదు. తాను సాధారణ వ్యక్తిని కానని ఆమె గ్రహించేలా చేస్తున్నాడు యేసు. ఆమె పాపభరితమైన జీవితం ఆమెకు గుర్తు చేస్తున్నాడు కూడా. ఆ జీవజలం కావాలంటే ఆ జీవితాన్ని విడిచి పెట్టేందుకు ఆమె ఇష్టపడాలి.

17. ఆ స్త్రీనాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే;

18. నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.

19. అప్పుడా స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.

“ప్రవక్త” గురించి నోట్ ఆదికాండము 20:7. దేవుడు కొన్నిసార్లు ఇతరుల గురించిన సత్యాలను తన ప్రవక్తలకు వెల్లడి చేసిన సంగతి ఆమెకు తెలుసు (లూకా 7:39 కూడా చూడండి).

20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను
ద్వితియోపదేశకాండము 11:29, ద్వితియోపదేశకాండము 12:5-14, యెహోషువ 8:33, కీర్తనలు 122:1-5

తన జీవితంలోని అనేకమంది మగవాళ్ళ గురించి మాట్లాడ్డం ఆమెకు ఇష్టం లేదు. అందుకని మాట మారుస్తున్నది. “మీరు అంటారు”– అంటే సాధారణంగా యూదులు ఇలా అంటారు. ఆమె మాట మార్చడంవల్ల ఆరాధన గురించిన ఒక గంబీర సత్యాన్ని ఆమెకు తెలిపే అవకాశం యేసుకు లభించింది. దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించవచ్చు (వ 21). ఇప్పుడు ఆరాధన స్థలానికి ప్రాధాన్యత ఏమీ లేదు (ఒకప్పుడు కొంతవరకు అలాంటి ప్రాధాన్యత ఉండేది – ద్వితియోపదేశకాండము 12:5; 2 దినవృత్తాంతములు 6:6-7 చూడండి). దేవుణ్ణి పరమ తండ్రిగా ఆరాధించాలి (వ 21,23; మత్తయి 5:16 నోట్‌). సమరయవారు (అంటే యూదేతర ప్రజలంతా అని అర్థం చేసుకోవచ్చు) తాము దేన్ని ఆరాధిస్తున్నదీ నిజంగా ఎరుగరు (వ 22). అపో. కార్యములు 17:23; రోమీయులకు 1:21-23. దేవుడు తన గురించి వెల్లడించిన సత్యాల ప్రకారం వారు ఆరాధించడం లేదు.

21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;

22. మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
యెషయా 2:3

“విముక్తి...వస్తుంది”– దేవుడు లోకానికి తన గురించి వెల్లడించడానికీ, తాను సిద్ధం చేసిన పాపవిముక్తిని తేవడానికి యూద జాతే కాలువలాంటిది. యేసుప్రభువు యూదుడుగా జన్మించాడు. దేవుడు కోరుతున్న ఆరాధనకు భౌతిక వస్తువులు, గుడులు, స్థలాలు, ప్రదేశాలతో ఎలాంటి సంబంధమూ లేదు (వ 23,24; అపో. కార్యములు 17:24-25). నిజమైన ఆరాధన ఆత్మలో చెయ్యవలసినదే. దేవుని ఆత్మమూలంగా తిరిగి జన్మించినవారి హృదయాల్లో నుండే అది రావాలి (3:5. దేవునికి అర్పించదగ్గ నిజమైన ఆరాధన ఏదో వేరెవరికీ తెలియదు). దేవుడు ఆత్మ గనుక భౌతిక వస్తువులేవీ నిజంగా ఆయనకు ప్రతినిధులుగా ఉండలేవు. ఏకైక శాశ్వతాత్మ దేవుణ్ణి ఆత్మ ద్వారా మాత్రమే నిజంగా ఆరాధించడం సాధ్యం. అలాంటి ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉండాలి. అంటే దేవుడు తన గురించి వెల్లడి చేసిన దానికి అనుగుణంగా ఉండాలి. మనఃపూర్వకంగా, వాస్తవంగా కపటం లేకుండా అది ఉండాలి. దేవుడు ఇలాంటి ఆరాధకుల కోసమే చూస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు గనుకే ఇలా వెదకుతున్నాడు (1 యోహాను 4:8). ఆయన మనుషుల్ని ప్రేమిస్తూ వారి ప్రేమను ఆశిస్తున్నాడు. వారికి ఉన్నతమైన మేలు జరగాలనే ఆయన కోరిక. నిజ దేవుని నిజ ఆరాధకులయితేనే ఇది సాధ్యం. లోకంలో అంతటా కనిపించే ఆచారపరమైన శూన్య ఆరాధనకంటే మరింత శ్రేష్ఠమైన ఆరాధనను ఆయన కోరుతున్నాడు. కీర్తనలు 50:8-15; యెషయా 1:11-17 పోల్చి చూడండి.

23. అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరు చ

24. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

25. ఆ స్త్రీ ఆయనతోక్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా

“అభిషిక్తుడు”– మత్తయి 1:1. యూదుల్లాగే సమరయవారు కూడా రానున్న అభిషిక్తుని కోసం ఎదురు చూచేవారు. యేసు ఆ అభిషిక్తుడై ఉండవచ్చన్న తలంపు ఈ స్త్రీలో ఆరంభమైందేమో. అలా కాకపోయినా ఆయన మాటలు మాత్రం ఆమె మనస్సులో బలంగా నాటుకున్నాయి (వ 29).

26. యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.

అంతా ఎదురు చూస్తున్న అభిషిక్తుడు తానే అని యేసు తేటతెల్లంగా చెప్పాడు. యోహాను 1:49-50; యోహాను 9:37; యోహాను 10:24-25; మత్తయి 26:63-64 కూడా చూడండి.

27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమి కావలె ననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడు చున్నావని యైనను ఎవడును అడుగలేదు.

ఆ రోజుల్లో యూదుల ఉపదేశకులు ఒక స్త్రీతో అంత సేపు మాట్లాడరు, ఆమెతో ఒంటరిగా ఉండడం ఎవరైనా చూచే ప్రమాదం కొనితెచ్చుకోరు. యేసుప్రభువైతే ఆ స్త్రీని చిన్నచూపు చూడడం లేదు. వారి అవసరతలో వ్యక్తులందరినీ సమానంగా ఆయన చూచేవాడు. తన గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న ఆందోళన ఆయనకు లేదు. శిష్యులు ఆయన్నేమీ ప్రశ్నించలేదు. ఆయన చేసే ప్రతి పనికీ సరైన కారణాలు ఉంటాయని వారికి ముందే తెలుసు.

28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి

29. మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా

వ 25.

30. వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

ఆమె సాక్ష్యం ఆ ఊళ్ళో పెద్ద కుతూహలం, ఆసక్తి రేపింది. మనుషులను క్రీస్తు చెంతకు తీసుకురావడానికి దేవుడు ఇప్పటికీ ఉపయోగించే పద్ధతి ఇలా సాక్ష్యం చెప్పడం.

31. ఆ లోగా శిష్యులుబోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి.

32. అందుకాయనభుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా

ఆధ్యాత్మిక ఆహారం అని యేసు ఉద్దేశం. కానీ వారు ఆయన మాటలను అక్షరాలా అర్థం చేసుకున్నారు. చెప్పిన ప్రతి మాటనూ ఈ విధంగా అక్షరార్థంగా తీసుకునేవారికి యేసు చెప్పిన అనేక మాటలు అభ్యంతరకరంగా అనిపిస్తాయి (ఉదాహరణగా యోహాను 6:52-58 చూడండి).

33. శిష్యులుఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి.

34. యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.

దేవుని సంకల్పం ప్రకారం ఆయన పని చెయ్యడంలోనే యేసుకు అసమానమైన సంతృప్తి ఉంది (యోహాను 5:30; యోహాను 6:38; యోహాను 8:29; యోహాను 9:4; యోహాను 14:31; యోహాను 15:10; యోహాను 17:4 పోల్చి చూడండి). దేవునికి విధేయత చూపుతూ, హృదయ పూర్వకంగా ఆయన పనిలో నిమగ్నమై, ఇతరులను క్రీస్తుపై నమ్మకంలోకి నడిపిస్తూ ఉండడంలో ఉన్న ఆనందంతో ఈ లోకంలో ఉన్న అన్ని శ్రేష్ఠమైన పదార్థాలతో విందుల్లో మునిగి తేలడం సాటి రాదు.

35. ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను.

ఇస్రాయేల్ దేశంలో విత్తనాలు చల్లే కాలం ముగిసిన తరువాత కోతకాలం ఆరంభం కావడానికి ముందు నాలుగు నెలల వ్యవధి ఉంది. వారు అంత కాలం వేచి ఉండనక్కర్లేదని యేసు అంటున్నాడు. అప్పుడే అక్కడే కోసుకోవడానికి పంట కోతకు వచ్చి సిద్ధంగా ఉంది. సత్యాన్ని విన్నప్పుడు తనలో నమ్మకం ఉంచడానికి అక్కడ సిద్ధంగా ఉన్న కొందరు సమరయవారి గురించి (ఇతరుల గురించి కూడా) ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఈ రోజుల్లో కూడా పంట ఎక్కడో ఒక చోట సిద్ధంగానే ఉంటుంది. యేసుప్రభువును స్వీకరించడానికి దేవుడు సిద్ధపరచిన మనుషులు ఎప్పుడూ ఉంటారు. దేవుని సేవకులు ఆసక్తితోను, దేవునిపై నమ్మకంతోనూ అలాంటివారి కోసం వెతకాలి. క్రీస్తు కాలం నుంచి ఇప్పటివరకు ఉన్న ఈ రెండు వేల సంవత్సరాలూ ఈ భూమిపై ఆగకుండా ఆత్మ సంబంధమైన పంటకోత జరుగుతూనే ఉంది.

36. విత్తువాడును కోయువాడును కూడ సంతో షించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.

ప్రభువు ఇక్కడ దేవుని సేవ గురించి కొన్ని సాధారణ సత్యాలు తెలియజేస్తున్నాడు. కోత పనివారికి (క్రీస్తు చెంతకు అనేకమందిని తీసుకువచ్చేవారు) జీతాలుంటాయి (వ 36). అవేమిటో ఇక్కడ చెప్పలేదు గాని వారు “ఇప్పుడే” జీతం పుచ్చుకుంటున్నారు అని రాసి ఉంది కాబట్టి క్రీస్తుకోసం ఇతరుల్ని సంపాదించడంలోని సంతృప్తి సంతోషాలనూ, ప్రేమ సహవాసాలనే అనుబంధాలనూ సూచించేందుకు జీతం అనేమాట వాడుతున్నాడని అనుకోవచ్చు (ఫిలిప్పీయులకు 4:1 చూడండి). అయితే వారి జీతాలు పరలోకంలో అనంత కాలంలో కూడా కనిపిస్తాయి (దానియేలు 12:3; 1 థెస్సలొనికయులకు 2:19-20; 1 పేతురు 5:4; ప్రకటన గ్రంథం 22:12). ఈ పంట (అంటే కోత పనివారి ప్రయత్నాలవల్ల క్రీస్తుపై నమ్మకంలోకి వచ్చేవారు) అంటే కేవలం ఈ లోకంలో ఈ కొద్ది కాలానికి మాత్రమే కాదు. అది ఎప్పటికీ ఉంటుంది. (వ 36). పంట కోతకు రావాలంటే ముందు ఎవరో ఒకరు దేవుని వాక్కు అనే మంచి విత్తనాలు చల్లాలి. చల్లేదీ పంట కోసేదీ ఒకే వ్యక్తి కావచ్చు గాని తరచుగా వేరువేరు వ్యక్తులు ఈ పనులు చేస్తారు (వ 37,38; 1 కోరింథీయులకు 3:5, 1 కోరింథీయులకు 3:9). విత్తనాలు చల్లేవాడు పంట కోసేవాణ్ణి చూచి అసూయపడకూడదు. ఇద్దరూ కలిసి సంతోషించాలి (వ 36). పరలోకంలో ఆ పంట కోత విషయంలో క్రీస్తుకు ఉన్న ఆనందంలో వారిద్దరూ శాశ్వతంగా పాలుగొంటారు. ఇదంతా చక్కగా గ్రహించి మనం కూడా జ్ఞానం కలిగి (సామెతలు 11:30), మనకు అవకాశం ఉన్నప్పుడే పట్టుదలతో ప్రయాసపడదాం (యోహాను 9:4).

37. విత్తువా డొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.
మీకా 6:15

38. మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.

39. నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమర యులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

ఒక్క స్త్రీ సాక్ష్యంవల్ల కలిగిన ఫలితం ఎంతో చూడండి. క్రీస్తు పక్షంగా మాట్లాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుని సేవకులంతా ఆయనకు సాక్షులుగా ఉండాలి (అపో. కార్యములు 1:8 చూడండి).

40. ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి,తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.

41. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచిఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక

42. మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

క్రీస్తే ముక్తి ప్రదాత అని మొత్తంగా యూదులు నమ్మడానికి నిరాకరించగా (యోహాను 1:11), యూదుల దృష్టిలో అంటరాని వారైన ఈ సమరయవారు సత్యాన్ని గ్రహించిన ధన్య స్థితిలోకి వచ్చారు. “ముక్తిప్రదాత”, “రక్షకుడు” గురించి నోట్ లూకా 1:47 చూడండి. యేసులో నమ్మకం ఉంచిన వారందరికీ, వారు ఏ జాతి, ఏ దేశం వారైనప్పటికీ, ఆయన ముక్తిప్రదాతే (1 తిమోతికి 2:3-6; రోమీయులకు 1:16-17; అపో. కార్యములు 4:12; మార్కు 16:15-16).

43. ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.

44. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్య మిచ్చెను.

45. గలిలయులుకూడ ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి ఆయన్ను వారు స్వీకరించారు గానీ అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా, లోక రక్షకుడుగా గౌరవించలేదు.

46. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూ ములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.

47. యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.

ఈ అధికారి యేసును ప్రవక్తగా ఎంచినట్టున్నాడు. గానీ దేవుని కుమారుడుగా లోకరక్షకుడుగా ఆయన్ను నమ్మలేదు. యేసు అతనితో అన్న మాటలు ఒక మందలింపులాంటివి. మత్తయి 12:38-39; మత్తయి 16:4; 1 కోరింథీయులకు 1:22 పోల్చి చూడండి. నిజమైన విశ్వాసం సూచనల, అద్భుతాల అవసరమేమీ లేకుండా క్రీస్తు వ్యక్తిత్వం, మాటల మీద నమ్మకం ఉంచుతుంది. వ 41 పోల్చి చూడండి.

48. యేసుసూచక క్రియలను మహత్కార్యములను చూడ కుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను.
దానియేలు 4:2, దానియేలు 4:37

49. అందుకా ప్రధానిప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను.

ఈ అధికారి తనలో లోపం లేదని తనను తాను సమర్థించుకోలేదు. కేవలం క్రీస్తు జాలి కోసం వేడుకున్నాడు. విశ్వాసం బలహీనంగా ఉన్నా యేసుప్రభువు ఈ లోకంలో పరిచర్య చేసిన రోజుల్లో ఇలాంటి విన్నపాలను ప్రతి సారి ఆయన ఆలకించి అనుగ్రహించాడు.

50. యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లి పోయెను.

వ 48లో యేసు మందలింపునుంచి ఈ అధికారి పాఠం నేర్చుకున్నాడు. ఎలాంటి సూచనా అవసరం లేకుండానే ఆయనలో నమ్మకం ఉంచడానికి సిద్ధమయ్యాడు.

51. అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి.

యేసు సాక్షాత్తూ ఒక ప్రదేశంలో ఉండడం ఎంత శక్తివంతమో ఆయన మాట అంత శక్తివంతమైనది. కీర్తనలు 107:20 పోల్చి చూడండి. చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లవాణ్ణి బాగుచేయాలంటే యేసు అక్కడికి వెళ్ళాలని మొదట్లో ఆ అధికారి అనుకున్నాడు. అయితే యేసుకు తన ఎదుట ఉన్నవారిని బాగు చెయ్యడం ఎంత తేలికో దూరాన ఉన్న వారిని బాగు చేయడమూ అంతే. ఆయన శరీరంతో ఈ లోకంలో ఉన్నట్టుగానే ఇప్పుడు పరలోకంనుంచి కూడా మనుషుల్ని బాగు చెయ్యగలడు. ఆయన ప్రతి సారి అలా చెయ్యకపోతే అందుకు కారణం అడిగేవారికి నమ్మకం లోపం కావచ్చు, లేదా అలాంటివారి విషయంలో వారిని బాగుచేయకపోవడానికి ఆయనకు వేరే జ్ఞానయుక్తమైన ఉద్దేశాలు ఉండడం కారణం కావచ్చు.

52. ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారునిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి.

53. నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.

“నమ్ముకొన్నారు”– అంటే బహుశా యేసు అభిషిక్తుడని నమ్మారు అని అర్థం. ఈ మనిషి నమ్మకం అభివృద్ధి చెందిన దశలు చూడండి. అతడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వ్యాధి నయం చేయగలడన్న నమ్మకం కొంత అతనిలో ఉంది. ఆ నమ్మకం యేసు చేసిన అద్భుతాలమీద ఆధారపడింది. అది కొంచెం పెరిగి సూచన ఏదీ అవసరం లేకుండానే యేసు మాటపై నమ్మకం ఉంచగలిగాడు. తరువాత అతని నమ్మకం స్థిరపడి అభివృద్ధి చెంది అతని కుటుంబమంతటి మీదా ప్రభావం చూపింది. క్రీస్తు ఆ పిల్లవాడి జ్వరాన్ని, ఆ అధికారిలోని బలహీనమైన నమ్మకమనే ఆధ్యాత్మిక జ్వరాన్నీ కుదిర్చాడు.

54. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

“సూచనలు”– యోహాను 2:11; మత్తయి 8:1 నోట్స్. యేసు వ్యాధులు బాగు చేసి ప్రాణాన్ని సంరక్షించే యెహోవాదేవుని అవతారం (కీర్తనలు 103:1-4), తన ప్రజల్లో సజీవమైన గట్టి నమ్మకాన్ని సృష్టించేవాడు (హెబ్రీయులకు 12:2).