Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

Deuteronomy - ద్వితియోపదేశకాండము 18

1. యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయుల కందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు.
1 కోరింథీయులకు 9:13

1. “ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ ప్రజలు యాజకులు సేవచేస్తారు. నిప్పుమీద వంటచేసి, యెహోవాకు అర్పించబడిన బలులు తింటూ వారు బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే.

2. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పి నట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱగాని మేకగాని బలిగా అర్పించువారి వలన

2. ఇతర వంశాల వారిలా ఆ లేవీ ప్రజలకు భూమిలో వాటా ఏమీ ఉండదు. యెహోవాయే లేవీయుల వాటా, యెహోవా ఇది వారికి వాగ్దానం చేసాడు.

3. యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను.

3. “మీరు ఒక ఆవును, ఎద్దును, లేక గొర్రెను బలిగా చంపినప్పుడు, జబ్బ, రెండు దవడలు, పొట్ట మీరు యాజకులకు ఇవ్వాలి.

4. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.

4. మీ మొదటి పంటలోనుండి మీ ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, నూనె మీరు యాజకులకు ఇవ్వాలి. మీ గొర్రెలనుండి కత్తిరించిన మొదటి ఉన్ని మీరు లేవీయులకు ఇవ్వాలి.

5. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు.

5. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ వంశాలన్నింటినీ చూసి, శాశ్వతంగా తనకు యాజకులుగా ఉండేందుకు లేవీయుని, అతని సంతతివారిని ఏర్పరచుకొన్నాడు.

6. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కు వతో వచ్చినప్పుడు

6. “ఇశ్రాయేలులోని ఏ పట్టణం నుండియైనా లేవీయుడు యెహోవా నియమించిన స్థలానికి తన ఇష్ట మున్నప్పుడెల్ల రావచ్చు.

7. అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను.

7. అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన యెహోవా పేరుమీద పరిచర్య చేయ వచ్చు. అతడు విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయు లందరిలాగే యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి.

8. అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను.

8. ఆ లేవీయుడికి సామాన్యంగా తన కుటుంబానికి వచ్చే వాటా కాకుండా, మిగిలిన లేవీయులతోను సమానంగా వాటా వస్తుంది.

9. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.

9. “మీ దేవుడైన యెహోవామీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల ప్రజలు చేసే దారుణమైన పనులు చేయటం నేర్చు కోవద్దు.

10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

10. మీ బలిసీఠాల అగ్నిమీద మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం చెప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూతవైద్యుని దగ్గర గాని సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసి కొనేందుకు ప్రయత్నించవద్దు.

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

11. ఎవరినీ యితరుల మీద మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.

12. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

12. అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. అందుకే ఆ ఇతర రాజ్యాల వాళ్లను మీ ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు.

13. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.
మత్తయి 5:48

13. మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి.

14. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

14. “మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి వెళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండ్ర మరియు శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి పనులు చేయనియ్యడు.

15. హోరేబులో ఆ సమాజదినమున నీవునేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు విన బడకుండును గాక,
మత్తయి 17:5, మార్కు 9:7, లూకా 9:35, లూకా 24:27, యోహాను 1:21, యోహాను 5:46, యోహాను 6:14, యోహాను 7:40, అపో. కార్యములు 3:22, అపో. కార్యములు 7:37

15. మీ దేవుడైన యెహోవా మీ దగ్గరకు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఈ ప్రవక్త మీ స్వంత ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి.

16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.

16. దేవుడే మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సినాయి) కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, కోండమీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. అందుచేత ‘మా దేవుడైన యెహోవా స్వరం మరోసారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గొప్ప అగ్నినిమాకు కనబడనీయవద్దు, మేము చస్తాము’ అని మీరు అన్నారు.

17. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;

17. “యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘వారు అడుగుతోంది మంచిదే.

18. వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.
యోహాను 1:21-45, యోహాను 6:14

18. నీవంటి ఒక ప్రవక్తను నేను వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు ప్రజలకు చెబుతాడు.

19. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.
అపో. కార్యములు 3:23

19. ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను శిక్షిస్తాను.’

20. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.

20. “అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నానని ప్రజలతో చప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే.

21. మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల,

21. ‘ప్రవక్త చెబుతోన్న విషయం యెహోవా చెప్పింది కాదు అని మనం ఎలా తెలుసు కోగలము’ అని మీరు తలుస్తూ ఉండవచ్చు.

22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడ లను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయ పడవద్దు.

22. ప్రవక్త యెహోవా పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగకపోతే, అది యెహోవా చెప్పింది కాదు అని అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ ప్రవక్త తన స్వంత ఆలోచనలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి మీరు భయపడాల్సిన పనిలేదు.