Hebrews - హెబ్రీయులకు 11 | View All

1. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.

“నమ్మకం”అంటే ఏమిటో మాటల్లో చెప్పిన సందర్భం బైబిల్లో ఇదొక్కటే. నమ్మకం రెండు విషయాలకు సంబంధించి ఉంది – రాబోయేవి (ఆశతో ఎదురుచూచే వాటిని గురించి), కంటికి కనిపించనివి. దేవుడు ఈ రెండు విషయాలకు సంబంధించిన వాగ్దానాలు చేశాడు, కొన్ని సత్యాలను వెల్లడించాడు. నమ్మకం ఈ వాగ్దానాలను నమ్మి వెల్లడించిన ఈ సత్యాలపై ఆధారపడుతుంది. ఇది హృదయానికి నిశ్చయతను కలగజేస్తుంది. నమ్మకం అంటే చీకటిలోకి దూకడం కాదు. వెలుగులోకి దూకడమే. గాలి మేడలు కట్టడం కాదు. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉన్నది. నిజమైన నమ్మకం దేవుణ్ణి గురించి మనుషులు చెప్పే ప్రతి మాటనూ నమ్మేయదు, లేక దేవుడు వెల్లడించాడని మనుషులు అనుకునే ప్రతిదాన్నీ స్వీకరించదు. బైబిల్లో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.

2. దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.

“పూర్వీకులు”– అంటే గత కాలాల్లో నివసించిన దేవప్రజలు. ఈ మెప్పు ఏమిటంటే మానవ జాతిలోకెల్లా వారే సరైనా త్రోవలో ఉన్నారు, ఏకైక నిజ దేవుణ్ణి నమ్మారు, దేవుని ఎదుట న్యాయవంతులుగా అయ్యారు. ఈ అధ్యాయంలో ఆ మెప్పు ఏమిటో కొంతవరకు చూడవచ్చు. దేవుని దృష్టిలో మానవ చరిత్ర అంటే ఆయనలో నమ్మకం ఉంచినవారి చరిత్ర. నమ్మకమూ, అది సాధించిన కార్యాలే శాశ్వతంగా నిలిచేవి కాబట్టి అవి ప్రాముఖ్యమైనవి. లోకంలోని మిగతాదంతా గతించిపోతుంది (1 యోహాను 2:17).

3. ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
ఆదికాండము 1:1, ద్వితీయోపదేశకాండము 32:18, కీర్తనల గ్రంథము 33:6, కీర్తనల గ్రంథము 33:9

నమ్మకం మానవ గ్రహింపు శక్తికీ బుద్ధికీ విరుద్ధమైనది కాదని గమనించండి. అసలు నమ్మకం గ్రహింపును కలిగిస్తుంది. అది వెలుగును లోపలికి రానిచ్చే కన్ను వంటిది. విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చిందో విశ్వాసులకు తెలుసు. ఎందుకంటే దేవుడు దాన్ని వెల్లడి చేశాడు. అవిశ్వాసుల్లాగా వారు సృష్టి ఆరంభం గురించి ఊహాగానాలు చెయ్యనవసరం లేదు. దేవుడు చెప్పాడు, సృష్టి ఆరంభమైంది (ఆదికాండము 1:1, ఆదికాండము 1:3, ఆదికాండము 1:6, ఆదికాండము 1:9, ఆదికాండము 1:14, ఆదికాండము 1:20, ఆదికాండము 1:24; కీర్తనల గ్రంథము 33:6; యెషయా 40:26; యెషయా 42:5; యోహాను 1:3; కొలొస్సయులకు 1:16)

4. విశ్వాసమునుబట్టి హేబెలకయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.
ఆదికాండము 4:4

నమ్మకం కలిగి జీవించిన పూర్వీకుల గురించి రచయిత ఇప్పుడు మాట్లాడసాగుతున్నాడు. వారిలో అందరూ అనన్య సామాన్యులూ మహనీయులూ కారు (ఉదా।। హేబెలు గొర్రెల కాపరి; యాకోబు, సమ్సోనుల్లో కావలసినన్ని పొరపాట్లు ఉన్నాయి; రాహాబు ఒకప్పుడు వేశ్య). అయితే వారందరిలోనూ ఒకటి మాత్రం ఉంది – వారు దేవునిలో నమ్మకం ఉంచారు. ఇందులో మనందరికీ వీరు ఆదర్శ వ్యక్తులు. పాత ఒడంబడిక గ్రంథంలోని విశ్వాసులందరి పేర్లు ఇక్కడ కనిపించవు. నమ్మకంలోని ఆయా అంశాలను వివరించేందుకు రచయిత ఆయా వ్యక్తుల పేర్లు ఉదహరించాడు. ఇక్కడ కనిపించే, నమ్మకంవల్ల కలిగే ఫలితాలు మూడు. ఒకటి, నమ్మకం ఉన్నవారిచేత అది ఏదో ఒకదాన్ని చేయించింది. నిజ విశ్వాసం నిర్జీవంగా ఉండదు. అది బహు శక్తివంతమైనది (హెబ్రీయులకు 10:39 నోట్స్ చూడండి). రెండు, నమ్మకం దేవుని నుంచి దీవెనలు పొందింది. ఈ జాబితాలోని ప్రతి విశ్వాసినీ ఏదో ఒక అద్భుత రీతిలో దేవుడు దీవించాడు. మూడు, నమ్మకం ఉన్నవారిని అది అన్నిటినీ ఓర్చుకొనేలా, అంతం వరకు ఓర్చుకొనేలా చేసింది. కాబట్టి నిజమైన నమ్మకం క్రియలు జరిగిస్తుంది, దీవెనలు పొందుతుంది, ఓర్పు ఇస్తుంది. ఇవి మూడూ చేయని నమ్మకం బైబిలు సంబంధమైన నిజమైన నమ్మకం కాదు. “హేబెలు”– ఆదికాండము 4:1-10 చూడండి. ఇతని విషయంలో నమ్మకానికీ అర్పణకూ ఉన్న సంబంధాన్ని చూస్తాం. పాపులమైన మనమంతా ఆరంభించవలసినది ఇక్కడే. ఈ లేఖలో ఉన్న ముఖ్యమైన ఉపదేశాల్లో ఇది ఒకటి. హేబెలు నమ్మకం దేవుడు వెల్లడించిన సత్యంపై ఆధారపడింది (నిజమైన నమ్మకం ఎప్పుడూ ఇంతే). నమ్మకం మూలంగా అతడు దేవుడు నియమించిన అర్పణను ఎన్నుకొన్నాడు. కయీను ఇలా చేసేందుకు నిరాకరించాడు. అందువల్ల హేబెలు అర్పణ కయీను అర్పణ కన్నా మంచిది. “నమ్మకాన్ని...న్యాయవంతుడనే”– ఆదికాండము 15:6; రోమీయులకు 1:17; రోమీయులకు 3:22; రోమీయులకు 5:1 పోల్చి చూడండి. ఈ ఆదర్శం ద్వారా హేబెలు ఈ రోజుకూ మనతో మాట్లాడుతున్నాడు – “దేవుడు తెలియజేసిన దాన్ని నమ్మండి. దేవుడు నియమించిన అర్పణను ఎన్నుకోండి” అంటున్నాడు. ఇప్పుడు ఈ అర్పణ యేసు క్రీస్తు హెబ్రీయులకు 7:27; హెబ్రీయులకు 9:12, హెబ్రీయులకు 9:26, హెబ్రీయులకు 9:28; హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14.

5. విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.
ఆదికాండము 5:24

హనోకు నమ్మకానికీ దేవునితో సహవాసానికీ మధ్య ఉన్న సంబంధానికి ఉదాహరణగా ఉన్నాడు. ఆదికాండము 5:21-24 చూడండి. నమ్మకం లేకుండా దేవుణ్ణి తెలుసుకునే అవకాశం, ఆయనతో నడిచే అవకాశం లేవు. అపనమ్మకం ఉన్న వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా ఎంచుతున్నట్టున్నాడు (1 యోహాను 5:10). ఒక వ్యక్తి హృదయంలో మరొక వ్యక్తి గురించి అపనమ్మకం, అపనింద తలంపులు ఉంటే వారిద్దరి మధ్య సహవాసం ఎలా సాధ్యం? హనోకు నమ్మకానికీ చావులేని స్థితికీ ఉన్న సంబంధానికి కూడా ఉదాహరణగా ఉన్నాడు. ఈ స్థితి యేసుప్రభువు తిరిగి వచ్చే సమయంలో జీవించి ఉన్న విశ్వాసులకు కలుగుతుంది (1 కోరింథీయులకు 15:51-53; 1 థెస్సలొనీకయులకు 4:15-17).

6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

“అసాధ్యం”– కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. అపనమ్మకం అనేది దేవుడు చూచీ చూడనట్టు ఊరుకునే చిన్న పొరపాటో, దురదృష్టకరమైన సంగతో కాదు. అది దేవునికీ మనిషికీ మధ్య ఉండవలసిన సంబంధాన్ని సమూలంగా నాశనం చేసే భయంకరమైన పాపం. మనిషి తన మనసులో దేవునికీ వెలుగుకూ బదులు పాపాన్నీ చీకటినీ కోరుకోవడమే అపనమ్మకం. దేవుడు వెల్లడించిన సత్యాలను, దేవుని కుమారుణ్ణి త్రోసిపుచ్చడమే. దానికి తగిన శిక్షను దేవుడు ఇస్తాడు – హెబ్రీయులకు 3:11-12, హెబ్రీయులకు 3:19; యోహాను 3:36; ప్రకటన గ్రంథం 21:8. నమ్మకం రెండు సంగతులను సత్యాలుగా స్వీకరిస్తుందని గమనించండి. ఒకటి, బైబిల్లో వెల్లడి అయిన దేవుడు ఉన్నాడని. రెండు, ఆయన్ను హృదయపూర్వకంగా వెతికేవారికి ప్రతిఫలం ఇస్తాడని. వ 1లో చెప్పిన రెండు విషయాలు ఇక్కడ చూడవచ్చు. కంటికి కనిపించనివి (దేవుడు), రాబోయేవి (ప్రతిఫలం), దేవుడు ఈ సత్యాలను వెల్లడించాడు కాబట్టి నమ్మకం వీటిని స్వీకరిస్తుంది – హెబ్రీయులకు 1:1-3; యెషయా 44:6; యెషయా 45:5, యెషయా 45:18, యెషయా 45:21; యోహాను 1:18; మత్తయి 7:7-8. “వెదికేవారికి”– ద్వితీయోపదేశకాండము 4:29; యిర్మియా 29:13.

7. విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
ఆదికాండము 6:13-22, ఆదికాండము 7:1

నోవహు నమ్మకానికీ పాపంపై దేవుని కోపం నుంచి తప్పించుకోవడానికీ ఉన్న సంబంధానికి ఉదాహరణగా ఉన్నాడు. ఆదికాండము 6:9-22. ఇప్పుడు క్రీస్తే తన ప్రజలకు ఆశ్రయం. విశ్వాసులు ఆయన సంరక్షణ కింద క్షేమంగా ఉంటారు. “భయభక్తులవల్ల”– ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:7-11; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7 నోట్స్ చూడండి. “ఇంటివారి”– అపో. కార్యములు 16:31 పోల్చి చూడండి. “లోకం...తీర్చాడు”– విశ్వాసం అపనమ్మకానికీ, వెలుగు చీకటికీ తీర్పు తీర్చే ఉదాహరణగా ఉంది (యోహాను 3:18-21; యోహాను 15:22-24). “నీతిన్యాయాలకు”– రోమీయులకు 1:17; రోమీయులకు 3:24-25; మొ।।.

8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయల
ఆదికాండము 12:1

ఈ అధ్యాయంలో అందరికంటే ఎక్కువ వచనాలు అబ్రాహాము గురించి చెప్తున్నాడు రచయిత. పాత ఒడంబడికలో నమ్మకానికి ఇతడు ఉత్తమమైన ఉదాహరణ, “నమ్మే వారందరికీ తండ్రి” అని పేరు పొందినవాడు – రోమీయులకు 4:11, రోమీయులకు 4:16. నమ్మకానికి ఉన్న వివిధ కోణాలను చూపే ఉదాహరణ పూర్వకమైన జీవితం అతనిది. ఆదికాండము 12:1-5; అపో. కార్యములు 7:2-4. ఇక్కడ నమ్మకానికీ దేవునిపట్ల విధేయతకూ ఉన్న సంబంధాన్ని చూస్తున్నాం. నమ్మకం లేనిదే నిజమైన విధేయత లేదు. విధేయత లేకపోవడం నమ్మకం లేదనడానికి రుజువు. అన్నిటినీ విడిచి అంతకుముందెన్నడూ చూడని ప్రదేశానికి వెళ్ళిపోవాలని అబ్రాహామును దేవుడు ఆదేశించాడు. అందువల్ల నమ్మకానికీ గతంలోని జీవిత విధానాలనుంచి వేరు పడడానికీ ఉన్న సంబంధానికి కూడా ఇతడు ఉదాహరణ, నమ్మకానికీ అన్నిటినీ విడిచిపెట్టి సంసిద్ధతకూ ఉదాహరణ (లూకా 14:33; లూకా 18:28-30; 2 కోరింథీయులకు 6:17-18). అయితే ఎక్కడికి వెళ్ళాలో ఏమి చెయ్యాలో తెలియకుండానే బయలు దేరడం తెలివితక్కువతనం కాదా? మనుషుల దృష్టిలో ఒకవేళ తెలివితక్కువతనం కావచ్చు, నమ్మకం, దానితోబాటు కలిగే దివ్య జ్ఞానం దృష్టిలో కాదు.

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27

ఆదికాండము 12:6-9. అబ్రాహాము గుడారాల్లో నివసిస్తూ, తరచుగా సంచారాలు చేస్తూ ఉండడం నమ్మకానికీ యాత్ర జీవనానికీ ఉన్న సంబంధానికి ఉదాహరణ. వ 13-16 చూడండి. అబ్రాహాము దృష్టి శాశ్వత లోకంపై ఉంది. కాబట్టి ఈ లోకంలో అతడు స్థిరపడదలచుకోలేదు. 1 పేతురు 2:11 పోల్చి చూడండి. ఇప్పుడు విశ్వాసులకు కూడా ఇదే దృష్టి ఉండాలి. వారి శాశ్వతమైన ఆస్తి, వారి పౌరసత్వం పరలోకంలో ఉన్నాయి (మత్తయి 6:19-20; ఫిలిప్పీయులకు 3:20). నమ్మకం ద్వారా వారు దీన్ని గ్రహించి ఈ లోకం తమ నివాసం కాదనీ, పరలోకంలో దేవుని నగరానికి వారు చేస్తున్న ప్రయాణంలో ఇది మజిలీ మాత్రమే నన్న సత్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు (హెబ్రీయులకు 12:22; గలతియులకు 4:26; ప్రకటన గ్రంథం 21:2).

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
ఆదికాండము 17:19, ఆదికాండము 18:11-14, ఆదికాండము 21:2

ఆదికాండము 15:4-6; ఆదికాండము 21:1-5; రోమీయులకు 4:18-21. తనకూ తన భార్య శారాకూ సంతానం కలుగుతుందన్న దేవుని వాగ్దానాన్ని మొట్టమొదట నమ్మినది అబ్రాహాము. అయితే శారా కూడా నమ్మింది. ఇద్దరూ కలిసి నమ్మకానికీ ఫలించడానికీ ఉన్న సంబంధానికి ఉదాహరణ. లేక నమ్మకానికీ అసాధ్యాలుగా కనిపించినవి సాధ్యాలు కావడానికీ ఉన్న సంబంధానికి ఉదాహరణ (మత్తయి 17:20).

12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
ఆదికాండము 15:5, ఆదికాండము 32:12, నిర్గమకాండము 32:13, ద్వితీయోపదేశకాండము 1:10, ద్వితీయోపదేశకాండము 10:22

13. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఆదికాండము 47:9, 1 దినవృత్తాంతములు 29:15, కీర్తనల గ్రంథము 39:12, ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27

వీరంతా అంతంవరకు ఓర్పుతో కొనసాగే నమ్మకానికి ఉదాహరణలు (హెబ్రీయులకు 10:30). “పరాయివారం”– అబ్రాహాము ఒక్కడే కాదు (వ 9,10), రచయిత ఇక్కడ చెప్పిన విశ్వాసులందరికీ ఇదే గ్రహింపు, ఇదే మనస్తత్వం ఉన్నాయి. ఆశాభావంతో ఎదురు చూస్తున్నవి, కంటికి కనిపించనివి అయిన విషయాలే వారి ఆలోచనల్లో, ఆశల్లో, నమ్మకాల్లో చోటు చేసుకున్నాయి.

14. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?

15. వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.

16. అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
నిర్గమకాండము 3:6, నిర్గమకాండము 3:15, నిర్గమకాండము 4:5

17. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సా కును బలిగా అర్పించెను.
ఆదికాండము 22:1-10

ఆదికాండము 22:1-19. ఈ సంఘటనలో నమ్మకానికి సంబంధించిన అనేక కోణాలు కనిపిస్తున్నాయి – నమ్మకం, పరీక్షలో విజయం; నమ్మకం, పునర్జీవితం; నమ్మకం, మాట తప్పని దేవుని వాగ్దానాలు. ఆదికాండము 21:12 లో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలంటే ఇస్సాకు బ్రతకాలి. ఇస్సాకును గనుక తాను బలి ఇవ్వవలసి వస్తే దేవుడు అతణ్ణి మళ్ళీ మరణం నుంచి సజీవంగా లేపుతాడని అబ్రాహాము నమ్మాడు. పరిస్థితులన్నీ అందుకు వ్యతిరేకంగా కనిపించినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నమ్మాడు. పరిస్థితులు, బయటికి కనిపించేవి ఎలా ఉన్నా నిజ విశ్వాసం మట్టుకు నిలిచే ఉంటుంది. దేవుడు అబద్ధమాడలేడన్న సత్యాన్ని చేబూని, ఆయన పక్షాన వాదిస్తుంటుంది.

18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
ఆదికాండము 21:12

19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

20. విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
ఆదికాండము 27:27-40, ఆదికాండము 27:30-40

ఆదికాండము 27:27-40. ఇవి నమ్మకానికీ ఆశాభావంతో ఎదురుచూచేవాటికీ ఉన్న సంబంధానికి ఉదాహరణ (వ 1).

21. విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
ఆదికాండము 47:31, ఆదికాండము 48:15-16

ఆదికాండము 49:1-28; ఆదికాండము 50:24-25. యాకోబు, యోసేపు ఇద్దరూ కూడా చావుదాకా కొనసాగే నమ్మకానికీ, ఇంకా భవిష్యత్తులో దేవుడు ఇస్తానన్న వాటి గురించిన నిశ్చయతకూ ఉదాహరణలు (వ 13). యాకోబు నమ్మకం అతని జీవితం చివరి దశలో అతి ప్రకాశవంతంగా కనిపించింది. నిజమైన నమ్మకం మరణ ఘడియలో కూడా వెనక్కు తీయదు (హెబ్రీయులకు 10:39). ఈ లేఖను అందుకున్న ఈ హీబ్రూ క్రైస్తవులు తమకు కలిగిన కష్టాల మూలంగా నమ్మకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారా? తమ పూర్వీకులను వారొక సారి చూడాలి. వారెన్ని కష్టాలూ బాధలూ దాటుకుని వచ్చారు! అయినా ప్రతి ఒక్కరూ చివరిదాకా సహించారు. నిజమైన నమ్మకానికి దేవుడిచ్చే సామర్థ్యం ఇదే.

22. యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
ఆదికాండము 50:24-25, నిర్గమకాండము 13:19

23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
నిర్గమకాండము 1:22, నిర్గమకాండము 2:2

నిర్గమకాండము 1:22; నిర్గమకాండము 2:2; అపో. కార్యములు 7:20. వారు దేవుణ్ణి నమ్మారు గనుక రాజాజ్ఞకు భయపడలేదు. బలమైన నమ్మకం భయాన్ని జయిస్తుంది – హెబ్రీయులకు 13:6; మత్తయి 8:26; మార్కు 4:40; అపో. కార్యములు 4:13. తమ పిల్లల విషయంలో పని చేసే నమ్మకానికి మోషే తల్లిదండ్రులు ఉదాహరణ. వ 7; అపో. కార్యములు 17:31 పోల్చి చూడండి.

24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
ఆదికాండము 4:10, నిర్గమకాండము 2:11

నిర్గమకాండము 2:11-13; అపో. కార్యములు 7:23-26. నలభై ఏళ్ళ ప్రాయంలో మోషే ఈజిప్టా, లేక దేవుడా అన్న నిర్ణయం చేసుకున్నాడు. ఈజిప్ట్‌ను ఎన్నుకుంటే లోక సంబంధమైన అధికారం, వైభవం, సుఖం ఉంటాయి. దేవుణ్ణి ఎన్నుకుంటే అదంతా విడిచిపెట్టి అక్కడి బానిసలుగా ఉంటున్న దేవుని ప్రజలతోబాటు కష్టాలు అనుభవించాలి. మోషే దేవుణ్ణి ఎన్నుకుని మిగతావాటిని వదిలేశాడు. అతనికి నమ్మకం ఉంది కాబట్టే ఇలా చేయగలిగాడు. ప్రతిదానికీ ఉన్న సరైన విలువను గుర్తించేందుకు నమ్మకం తోడ్పడుతుంది. రాబోయే కాలంలో కలుగనున్న అదృశ్యమైనవి ఇప్పుడు లోకం ఇస్తున్న వాటన్నిటికంటే మరెంతో విలువ గలవన్న నిశ్చయాన్ని నమ్మకం కలిగిస్తుంది. ఫిలిప్పీయులకు 3:7-8 పోల్చి చూడండి. నమ్మకానికీ పరిత్యాగానికీ ఉన్న సంబంధానికి మోషే ఉదాహరణ. హెబ్రీయులకు 10:34; లూకా 14:33; లూకా 18:28-30; మత్తయి 4:18-22; మత్తయి 10:37-39; మత్తయి 16:24-28 చూడండి. నిజమైన నమ్మకం క్రీస్తుకోసం దేన్నయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అలా చేయడానికి మనసు లేనివారు తమకు నమ్మకం ఉందని చెప్పుకున్నప్పటికీ, వారి నమ్మకం వాస్తవమైనదని ఇతరులు అనుకున్నప్పటికీ వారిలో బైబిలు సంబంధమైన నిజ విశ్వాసం లేదు. అలాగైతే మోషే, పౌలువంటివారి మార్గాన్ని త్రోసిపుచ్చి, క్రీస్తు కోసం బాధలు పడేందుకు నిరాకరించి, ఈ లోక సుఖభోగాలు లేక సంపదలు, లేక అధికారాల వెంట పరుగులెత్తేవారిని ఏమనాలి? ఈ గొప్ప సత్యాన్ని వారు నేర్చుకోవసిన అవసరత ఎంతైనా ఉంది – ఈ లోకం ధనధాన్యాల కన్నా క్రీస్తు కోసమైన నింద మేలు (వ 26; హెబ్రీయులకు 13:13; అపో. కార్యములు 5:41; 1 పేతురు 4:12-16).

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
కీర్తనల గ్రంథము 69:9, కీర్తనల గ్రంథము 89:50-51

27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
నిర్గమకాండము 2:15, నిర్గమకాండము 10:28-29, నిర్గమకాండము 12:51

“భయపడక”– మోషే నిర్గమకాండము 2:11-12 లో తాను చేసిన పనులు అందరికీ తెలిసాయని భయపడ్డాడని హెబ్రీయులకు 2:14 లో ఉంది. ఇది తన ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని అతడు గ్రహించి ఉంటాడు. అతని భయం వారికోసమే గానీ తనకోసం కాదు అనిపిస్తుంది. అతడు నమ్మకం ద్వారా ఈజిప్ట్ విడిచి వెళ్ళిపోయాడు గానీ భయం వల్ల కాదు. నిజమైన నమ్మకం ఎప్పుడూ దేవుడిచ్చిన మాటపై ఆధారపడుతుంది. దేవుడు తనకలా చెప్తున్నాడు కాబట్టి ఈజిప్ట్‌ను విడిచిపెట్టాడు మోషే. అతడు నమ్మకంతో ఓపిక వహించాడు (హెబ్రీయులకు 10:39). కంటికి కనిపించని దేవుణ్ణి అతడు చూశాడు (వ 1; 2 కోరింథీయులకు 4:18). నమ్మకం మనుషులకు ఆధ్యాత్మిక చూపు ఇస్తుంది.

28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
నిర్గమకాండము 12:21-29

నిర్గమకాండము 12:1-30. ఇక్కడ నమ్మకానికీ దేవుని తీర్పునుంచి తప్పించడానికీ ఉన్న సంబంధం ఉంది. వ 7; హెబ్రీయులకు 9:27-28; 1 కోరింథీయులకు 5:7 పోల్చి చూడండి.

29. విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
నిర్గమకాండము 14:21-31

నిర్గమకాండము 14:15-31. నమ్మకానికీ శత్రువుల బారినుంచి తప్పించడానికీ ఉన్న సంబంధం.

30. విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
యెహోషువ 6:12-21

యెహోషువ 6:12-20. నమ్మకానికీ దేవుడు మాట ఇచ్చిన దాన్ని చేపట్టడానికీ ఉన్న సంబంధం ఇందులో కనబడుతున్నది (యెహోషువ 1:3; 1 యోహాను 5:14-15; మార్కు 11:24).

31. విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
యెహోషువ 2:11-12, యెహోషువ 6:21-25

యెహోషువ 2:1-21; యెహోషువ 6:24-25. గొప్ప పాపం, అజ్ఞానంపై జయించే నమ్మకం, దేవుని శాపం నుంచి తప్పించే నమ్మకం ఇది (గలతియులకు 3:10-14; యోహాను 5:24 పోల్చి చూడండి).

32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
న్యాయాధిపతులు 4:10-17, న్యాయాధిపతులు 11:32-33, న్యాయాధిపతులు 16:28-30, 1 సమూయేలు 7:9-12, 1 సమూయేలు 19:8

రచయిత పాత ఒడంబడికనుంచి మరెన్నో ఉదాహరణలు ఇవ్వగలిగేవాడే కానీ ఇక అవన్నీ అవసరం లేదు. నిజమైన నమ్మకం ఏమిటో, అది ఏమి చేస్తుందో అతడు చూపించాడు. ఇప్పుడు విశ్వాస వీరులు కొందరిని చెప్తూ, వారి నమ్మకం ఎలా పని చేసింది, ఏమి సాధించింది, ఎలా ఓర్పు చూపింది అన్నది చర్చిస్తున్నాడు (వ 4 పై నోట్ చూడండి).

33. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
న్యాయాధిపతులు 14:6-7, 1 సమూయేలు 17:34-36, దానియేలు 6:22

పాత ఒడంబడిక గ్రంథంలోని విశ్వాసులు సాధించిన పది విషయాలు, సహించిన ఎనిమిది విషయాలు ఈ వచనాల్లో కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని వాటిని గురించి వారికున్న నిశ్చయతే వారి కార్య సిద్ధికి తోడ్పడింది. ఆశతో ఎదురుచూస్తున్న వాటిని గురించిన నిబ్బరమే వారి ఓర్పుకు దోహదం చేసింది. “రాజ్యాలను”– సంఖ్యాకాండము 21:23-35; యెహోషువ 12:7-24; 2 సమూయేలు 8:1-14. “సింహాలు”– దానియేలు 6:16-22.

34. అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.
దానియేలు 3:23-25

35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
1 రాజులు 17:17-24, 2 రాజులు 4:25-37

“చనిపోయిన”– 1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37. “ఇంకా...పునర్జీవితం”– పైన చెప్పిన ఇద్దరు స్త్రీల కొడుకులు బ్రతికిన దానికంటే మరింత శ్రేష్ఠమైన రీతిలో బ్రతకడం. “నిరాకరించారు”– దుర్మార్గతతో, అపనమ్మకంతో రాజీ పడవలసి వస్తే గనుక విడుదల తమకు వద్దన్నారు.

36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి.
ఆదికాండము 39:20, 1 రాజులు 22:26-27, 2 దినవృత్తాంతములు 18:25-26, యిర్మియా 20:2, యిర్మియా 37:15, యిర్మియా 38:6

37. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
2 దినవృత్తాంతములు 24:21

“రాళ్ళ దెబ్బలు”– మత్తయి 23:37. “రంపాలతో...కోయబడ్డారు”– వాడుకలో ఉన్న కథల ప్రకారం యెషయా ప్రవక్త చనిపోయింది ఇలానే. “విషమ పరీక్షలకు...కత్తి వాతకు...నిరుపేదలై”– అన్ని కాలాల్లోనూ భూమిపై నివసించిన అందరికన్నా న్యాయవంతులు అనేకమంది చరిత్రలను వర్ణించే మాటలివి. యోహాను 15:18-21; యోహాను 16:2-3, యోహాను 16:33; రోమీయులకు 8:35-37; 1 కోరింథీయులకు 4:11-13.

38. అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
1 రాజులు 18:4, 1 రాజులు 18:13

లోకంలో జీవించడానికి వారు తగరు అన్నట్టు లోకం వారిని చూచింది. కానీ వాస్తవం ఇందుకు వ్యతిరేకం. వారికి ఈ లోకంలో ఖాయమైన నివాసం లేదు గానీ దేవుడు వారిని పరలోకం ఇంటికోసం సిద్ధం చేశాడు.

39. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,

“మంచి సాక్ష్యం” – వ 2. “వాగ్దానం”– వ 10,16. క్రీస్తు తెచ్చే దీవెనల గురించి, శాశ్వత వారసత్వం గురించి రచయిత మాట్లాడుతున్నాడు – హెబ్రీయులకు 1:14; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 9:15.

40. దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.

“మరీ శ్రేష్ఠమైన”– ఈ లేఖలో మనం చూచిన మంచి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి – హెబ్రీయులకు 7:19; హెబ్రీయులకు 8:6; హెబ్రీయులకు 9:23. క్రీస్తుకు ముందు జీవించిన విశ్వాసులు, ఆయన వచ్చాక నమ్మిన విశ్వాసులు కలిపి ఒకే సారి పరిపూర్ణులు కావాలని దేవుని ఏర్పాటు. క్రీస్తు చేసిన బలి మన కోసమెలాగో వారికోసమూ అలాగే. ఎవరికైనా ఎప్పుడైనా సంపూర్ణ సిద్ధి కలగడానికి అదొక్కటే మార్గం – హెబ్రీయులకు 10:14; రోమీయులకు 3:25-26. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అంతిమ పరిపూర్ణత వస్తుంది – రోమీయులకు 8:23-30; 1 కోరింథీయులకు 15:50-53; 1 థెస్సలొనీకయులకు 4:15-17; 1 యోహాను 3:2.Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |