13. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,
దేవునిపై ఎడతెగకుండా నమ్మకం ఉంచుకోవాలనీ, ఆ నమ్మకంలోనే కొనసాగాలనీ, పాపానికి దూరంగా ఉండాలనీ క్రైస్తవులు ఇతర క్రైస్తవులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇది దేవుని చేతిలో ఎంతో మేలుకు కారణం కాగలదు.
పాపం గురించిన రెండు వాస్తవాలను గమనించండి. అది దేవునికి వ్యతిరేకంగా మనుషుల హృదయాలను బండబారి పోయేలా చేస్తుంది. అది మోసకరమైనది (2 థెస్సలొనీకయులకు 2:10). పాపం వికారమైనదని దేవుడు చెప్తున్నాడు. కానీ పాపం తనను తాను చాలా మనోహరమైనదిగా మనుషులకు కనపరచుకుంటుంది. అది నిజానికి విషం. కానీ తేనెలాగా కనిపించజూస్తుంది. సంతోషాలు ఇస్తానని అది ఊరిస్తుంది గానీ అది ఇచ్చే జీతం గురించీ (రోమీయులకు 6:23), దానికి వ్యతిరేకంగా వచ్చే దేవుని కోపం గురించి (రోమీయులకు 1:18) మాట్లాడదు.
మనుషులకు గుడ్డితనం కలిగించి, నాశనానికి దారి తీసే విశాల మార్గంలో ఉంచే మూడు మోసకరమైన శక్తుల్లో పాపం ఒకటి. మిగతా రెండింటి గురించి యిర్మియా 17:9; ప్రకటన గ్రంథం 12:9 చూడండి. మోసగాడైన సైతాను మోసగించే పాపాన్ని మోసకరమైన మానవ హృదయంలో ఉంచి ఉపయోగిస్తూ ఉండగా ఆ మోసానికి హద్దులుంటాయా?