Peter I - 1 పేతురు 4 | View All

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

1. క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి.

2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

2. ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటి వానికి పాపంతో సంబంధముండదు.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,

3. గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పొకిరి చేష్టలు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండటకు గడచిన కాలమే చాలును.

4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

4. కాని ప్రస్తుతం మీరు వాళ్ళ వలె మితిమీరిన దుష్ప్రవర్తకులోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

5. అయితే చనిపోయిన వాళ్ళ మీద బ్రతికియున్న వాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసిఉంటుంది.

6. మృతులు శరీరవిషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెను.

6. ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లు గానే వాళ్ళ మీద కూడా తీర్పు చెపుతాడు.

7. అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

7. అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మ నిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు.

8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
సామెతలు 10:12

8. [This verse may not be a part of this translation]

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

9. సణగకుండా, పరస్పరం అతిథి సత్కార్యాలు చేసుకోండి.

10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

10. ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి.

11. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచ బడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

11. మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచిన వాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవచెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

12. నా ప్రియమైన సోదరులారా!మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి.

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

13. క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
కీర్తనల గ్రంథము 89:50-51, యెషయా 11:2

14. ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

15. హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని, మీరు శిక్షను అనుభవించకూడదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

16. మీరు క్రైస్తవులైనందు వలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి.

17. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
యిర్మియా 25:29, యెహెఙ్కేలు 9:6

17. ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది?

18. మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?
సామెతలు 11:31

18. లేఖనాల్లో ఈవిధంగా వ్రాసారు: "నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే, నాస్తికుని గతి, పాపాత్ముని గతి, ఏమౌతుంది?"

19. కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
కీర్తనల గ్రంథము 31:5

19. అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించే వాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.Shortcut Links
1 పేతురు - 1 Peter : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |