3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
“రక్షణ, పాపవిముక్తి”– రోమీయులకు 1:16 దగ్గర నోట్. యూదా ఒక అతి శ్రేష్ఠమైన, మహిమతో కూడిన విషయం గురించి రాయదలచుకున్నాడు. అయితే అంత ఆహ్లాదకరం కాని మరో సంగతి గురించి రాయాలని అతనికి తోచింది.
“పవిత్రులకు”– రోమీయులకు 1:1.
“ఒక్క సారే అప్పగించబడ్డ”– దేవుడు క్రీస్తు ద్వారా, ఆయన శిష్యుల ద్వారా వెల్లడించిన విశ్వాస సత్యం సంపూర్ణమైనది. దానికి ఏమీ కలపకూడదు, దానినుండి ఏమీ తీసివేయకూడదు. ద్వితీయోపదేశకాండము 4:2; సామెతలు 30:6; ప్రకటన గ్రంథం 22:18-19 పోల్చి చూడండి. దేవుడు వేరెవరిద్వారా, మరెక్కడా మరి కొంత సత్యాన్ని ఇక వెల్లడించడు. కొత్త సిద్ధాంతాలేవైనా సరే తప్పక తప్పుడు సిద్ధాంతాలే. విశ్వాసులు తమకు అందిన విశ్వాస సత్యాలను అనుసరిస్తూ, ఆచరిస్తూ, వాటికేదైనా ముప్పు వాటిల్లితే వాటి పక్షంగా వాదించాలనే దేవుడు వాటిని వారికిచ్చాడు. 1 కోరింథీయులకు 4:1; 1 థెస్సలొనీకయులకు 2:4; 1 తిమోతికి 1:11; 1 తిమోతికి 6:20; 2 తిమోతికి 1:14.
“విశ్వాస సత్యాలు”– అంటే క్రీస్తు ద్వారా దేవుడిచ్చిన సత్యాలన్నిటినీ కలిపి ఇలా అంటున్నాడు. మనమేది నమ్మాలో, ఏ విధంగా జీవించాలో క్రీస్తు, ఆయన రాయబారులు మనకు నేర్పించారు. ఇదే “విశ్వాస సత్యాలు”. సరైన సిద్ధాంతాలకు అంటి పెట్టుకుని ఉండడం మాత్రమే చాలదు (అది ప్రాముఖ్యమే). ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి (ఎఫెసీయులకు 4:1; కొలొస్సయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:12). ఈ లేఖలో యూదా గట్టిగా చెప్పదలచుకున్నది సిద్ధాంతాల గురించి మాత్రమే కాదు. సరైన సిద్ధాంతం, సరైన ప్రవర్తన కలసి ఉండాలన్నదే. అతడు ఇస్తున్న హెచ్చరిక తప్పుడు సిద్ధాంతాల మూలంగా కలిగే అపవిత్ర జీవితం గురించి.
“పోరాడాలని”– ఇలా అనువదించిన గ్రీకు పదం యుద్ధ రంగంలోని పోరును తెలియజేసే పదం. ఎఫెసీయులకు 6:11-18; 1 తిమోతికి 6:12 పోల్చి చూడండి. ఈ భూమిపై సాధారణంగా, క్రైస్తవ లోకంలో కూడా దేవుడు వెల్లడించిన సత్యం విషయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంది.
“అవసరమని”– సంఘానికి అప్పటికి ఉన్న అవసరత అటువంటిది. క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప ప్రమాదం ఆసన్నమైంది. యూదాలో దేవుని ఆత్మ పని చేస్తూ అతణ్ణి బలవంతం చేస్తూ ఉంది.