Revelation - ప్రకటన గ్రంథము 21 - గ్రంథ విశ్లేషణ

1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
యెషయా 65:17, యెషయా 66:22

“కొత్త”– యెషయా 65:17; యెషయా 66:22; 2 పేతురు 3:13. “గతించిపోయాయి”– ప్రకటన గ్రంథం 20:11; మత్తయి 24:29; 2 పేతురు 3:10. “సముద్రం ఇక లేదు”– ప్రస్తుత స్థితులకు అంతా భిన్నంగా ఉంటుందన్న మాట.

2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
యెషయా 52:1, యెషయా 61:10

“కొత్త జెరుసలం”– గలతియులకు 4:26; హెబ్రీయులకు 11:10; హెబ్రీయులకు 12:22; హెబ్రీయులకు 13:14; ఫిలిప్పీయులకు 3:20; యోహాను 14:2 పోల్చి చూడండి. “పెండ్లి కూతురులాగా”– వ 9,10. “పరలోకం...నుంచి”– పాపవిముక్తులైన మనుషుల చివరి నివాసం కొత్త భూమిమీద ఉంటుంది, గాని పరలోకంలో కాదు. లేదా, పరలోకం కొత్త భూలోకం ఒకటి అవుతుందనవచ్చు.

3. అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
లేవీయకాండము 26:11-12, 2 దినవృత్తాంతములు 6:18, యెహేజ్కేలు 37:27, జెకర్యా 2:10

“పరలోకంనుంచి” (“సింహాసనం నుంచి”)– ప్రకటన గ్రంథం 4:2; ప్రకటన గ్రంథం 16:17; ప్రకటన గ్రంథం 19:5 – విశ్వంలో అధికారానికి కేంద్రమైన స్థలం నుంచి అన్నమాట. “దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది”– అంటే కొత్త భూమి మీద. దానిమీద దేవుడు మనుషుల మధ్య నివాసముంటాడు గనుక అది పరలోకం అవుతుంది. బైబిల్లోకెల్లా ఉన్నత సందేశం ఈ వచనంలో ఉంది. మొదట్నుంచి మనుషులకోసం దేవుని ఆలోచనకు, ఏర్పాటుకు ఇది నెరవేర్పు. నోట్, రిఫరెన్సుల కోసం నిర్గామకాండము 25:8 చూడండి. “ఆయనకు ప్రజలై...వారికి దేవుడై”– లేవీయకాండము 26:11-12; యెహేజ్కేలు 37:27; 2 కోరింథీయులకు 6:16; 1 పేతురు 2:9.

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
యెషయా 25:8, యెషయా 35:10, యెషయా 65:19, యిర్మియా 31:16, యెషయా 65:17

“కళ్ళలోనుంచి”– ప్రకటన గ్రంథం 7:17. “చావు...ఉండదు”– ప్రకటన గ్రంథం 20:14 – శరీర సంబంధమైన చావు ఉండదు, అంటే శరీరం నుంచి ఆత్మ వేరు కావడం అనేది ఉండదు. దేవుని నుంచి వేరు చేసే ఆత్మ సంబంధమైన చావు ఉండదు. “గతించిపోయాయి”– దుఃఖానికి, ఏడ్పుకు, నొప్పికి, చావుకు మూల కారణం పాపం (రోమీయులకు 5:12). కొత్త లోకంలో పాపం ఎన్నడూ ఉండదు గనుక అవి కూడా ఉండవు.

5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడుఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు
1 రాజులు 22:19, 2 దినవృత్తాంతములు 18:18, కీర్తనలు 47:8, యెషయా 6:1, యెషయా 43:19, యెహేజ్కేలు 1:26-27

“కొత్త చేస్తున్నాడు”– ఈ పని ఆయన ఇప్పటికే ఆరంభించాడు. 2 కోరింథీయులకు 5:17; ఎఫెసీయులకు 2:10 చూడండి. ఈ ప్రస్తుత భూమ్యాకాశాలను దేవుడు ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిన తరువాత వాటిని నాశనం చేసి కొత్తవాటిని సృజిస్తాడు. “సత్యమైనవి, నమ్మతగినవి”– ప్రకటన గ్రంథం 19:9; ప్రకటన గ్రంథం 22:6. ఈ విషయాలు ఊహాగానం కాదు, దర్శనంలో మాత్రమే కనిపించేవి కాదు గాని శాశ్వతమైన వాస్తవికతలు.

6. మరియు ఆయన నాతో ఇట్లనెనుసమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
కీర్తనలు 36:9, యెషయా 44:6, యెషయా 48:12, యెషయా 55:1, యిర్మియా 2:13, జెకర్యా 14:8

“ఆయన”– దేవుడు. “సమాప్తమైంది”– ఏదో ఒకటి సమాప్తమైందని దేవుడు చెపితే ఆ క్షణంలో సమాప్తం కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా సమాప్తం అవుతుందని అర్థం. యెషయా 46:10; రోమీయులకు 4:17 చూడండి. “అల్ఫాను, ఓమెగను”– ప్రకటన గ్రంథం 1:8; ప్రకటన గ్రంథం 22:13 నోట్స్. “జీవ జల”– ఇక్కడ ఈ జలాలను ఇచ్చేది దేవుడు. యోహాను 4:10, యోహాను 4:14 లో వాటిని ఇచ్చేది యేసుప్రభువు. “ఉచితంగా”– ప్రకటన గ్రంథం 22:17; యెషయా 55:1; రోమీయులకు 6:23.

7. జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
2 సమూయేలు 7:14, కీర్తనలు 89:26

“జయించే వ్యక్తి”– ప్రకటన గ్రంథం 2:7 నోట్. “వారసుడు”– రోమీయులకు 8:15-16, రోమీయులకు 8:19, రోమీయులకు 8:23, రోమీయులకు 8:29; ఎఫెసీయులకు 1:14; కొలస్సీయులకు 1:12; 1 పేతురు 1:4. ఈ వాగ్దానాన్ని బట్టి దీన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలోని వారసత్వాల మీద ఆశలను నిలపక జయించేవారితో తాము ఉండాలని నిశ్చయించుకోవాలి. అయితే ఈ వచనం చూచి దేవుని సంతానం కావడం అనేది జయించేవారికి ప్రతిఫలంగా లభిస్తుందని మనం అనుకోరాదు. దేవుని సంతానం కావడం దేవుడు తన కృప కారణంగా ఉచితంగా ఇచ్చేదే – యోహాను 1:12-13; గలతియులకు 4:4-7; ఎఫెసీయులకు 2:8-10; 1 పేతురు 1:3-5.

8. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ఆదికాండము 19:24, కీర్తనలు 11:6, యెషయా 30:33, యెహేజ్కేలు 38:22

రెండు రకాల వ్యక్తులు మాత్రమే ఉంటారు – పాప విముక్తీ రక్షణా పొందినవారు, పొందనివారు; దేవుడు నివాసం చేయబోతున్న ప్రజలు, దేవుని ప్రజలుగా ఉండడానికి సమ్మతించని వారు. “పిరికివారు”– ఈ సందర్భంలో వీరు ఇతరుల భయంచేత క్రీస్తును నమ్మి ఒప్పుకోవడానికి వెనక్కు తీసినవారు. “విశ్వాసం లేనివారు”– అంటే వెలుగుకు బదులుగా చీకటిని, క్రీస్తుకు బదులుగా తమను, పరలోకానికి బదులుగా ఇహలోకాన్ని కోరుకొని, క్రీస్తును నమ్మడానికి ఇష్టం లేకపోవడం వల్ల ఆయనను నమ్మనివారు (యోహాను 3:19-20, యోహాను 3:36; యోహాను 5:40; 2 థెస్సలొనికయులకు 2:10-11). అపనమ్మకం ఏదో అల్పమైన విషయం కాదు, ఏదో దురదృష్టం కాదు, చులకనగా క్షమించదగిన పొరపాటూ కాదు. అగ్ని సరస్సుకు మనుషులను గురి చేసే పాపాలన్నిటిలోకీ అపనమ్మకం ముఖ్యమైనది. ఇక్కడ మనుషుల్ని నీచులుగా చేసే పాపాలతో, హత్యతో సమానమైనది. “వ్యభిచారులు”– 1 కోరింథీయులకు 6:9-10; ఎఫెసీయులకు 5:5-6; కొలస్సీయులకు 3:5-6. “మాంత్రికులు”– ప్రకటన గ్రంథం 9:21; ప్రకటన గ్రంథం 18:23; ప్రకటన గ్రంథం 22:15; అపో. కార్యములు 8:11; ద్వితియోపదేశకాండము 18:9-14. మంత్ర విద్య వల్ల మనుషులు మోసపోతారు, దేవుని సత్యం నుంచి తొలగిపోతారు. అందుచేత అది బహు చెడ్డది. “విగ్రహ పూజ చేసేవారు”– విగ్రహ పూజ అసహ్యమనీ శిక్షకు తగినదనీ బైబిలంతట్లో కనిపిస్తున్నది. దేవుడు తానిచ్చిన పది ఆజ్ఞలలో నిషేధించిన పాపాలలో ఇది ఒకటి (నిర్గామకాండము 20:4-6). విగ్రహపూజ చేసేవారు పశ్చాత్తాపపడి తమ బొమ్మలను, దేవుళ్ళను, దేవతలను విడిచిపెట్టకపోతే వారు దేవుని ప్రజల లెక్కలో చేరబోరు. ఇది ఖాయం. “అబద్ధికులంతా”– వ 27; ప్రకటన గ్రంథం 22:15 కూడా చూడండి. ఇది ఈ జాబితాలో చివరగా కనిపిస్తున్నది కాబట్టి పాపాలన్నిట్లో స్వల్పమని ఎవరూ అనుకోకూడదు. అబద్ధికులు హంతకులతో, విగ్రహపూజ చేసేవారితో, “కుక్కల”తో (ప్రకటన గ్రంథం 22:15) ఒకే తరగతిలో చేర్చబడ్డారు. అబద్ధాలు చెప్పడం ఏదో తేలికైన విషయం కాదు. అది మరణకరమైన ఘోర పాపం, చివరికి అగ్ని సరస్సులోకి మనుషులను తీసుకుపోయే పాపం. దేవుడు తన వాక్కులో అంతటా ఈ పాపాన్ని ఖండిస్తున్నాడు. నిర్గామకాండము 20:16; కీర్తనలు 5:6; కీర్తనలు 15:2; కీర్తనలు 31:5; సామెతలు 6:16-19; సామెతలు 12:22; సామెతలు 19:5, సామెతలు 19:9, సామెతలు 19:22; మత్తయి 19:18; ఎఫెసీయులకు 4:15, ఎఫెసీయులకు 4:25; కొలస్సీయులకు 3:9 చూడండి. అబద్ధికులు సైతాను సంతానం (యోహాను 8:44). సైతాను వెళ్ళిపోయే స్థలానికి వారు వెళ్ళిపోతారు (ప్రకటన గ్రంథం 20:10). అబద్ధికులు అందరూ అగ్ని సరస్సులోకి పోతారని దేవుడు చెపుతున్నాడని గమనించండి. అంటే, అబద్ధమాడడం, మోసగించడం అభ్యాసం చేసేవారంతా, తాము క్రైస్తవులమని చెప్పుకొన్నా, పవిత్రులమని, క్రీస్తు సేవకులమని చెప్పుకొన్నా అలాంటి వారంతా అగ్ని సరస్సు అనే భయంకరమైన దండనకు గురి అవుతారు. ఆత్మలను నాశనం చేసే ఈ నీచమైన, ప్రాణాంతకమైన పాపంనుంచి మనమంతా మన ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయి తప్పించుకుందాం! “మండుతున్న సరస్సు...రెండో చావు”– ప్రకటన గ్రంథం 19:20; ప్రకటన గ్రంథం 20:6, ప్రకటన గ్రంథం 20:10, ప్రకటన గ్రంథం 20:14-15.

9. అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,
లేవీయకాండము 26:21

“చివరి ఏడు ఈతి బాధల”– ప్రకటన గ్రంథం 15:1. “భార్య”– ప్రకటన గ్రంథం 19:7.

10. ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
యెహేజ్కేలు 40:2, యెషయా 52:1

దేవదూత యోహానుకు దేవుని ప్రజను చూపించడానికి బదులుగా దేవుని నగరాన్ని చూపించాడు. ఈ నగరం దేవుని ప్రజకు నివాస స్థలం (వ 27), వారికి ప్రతినిధి. దీనితో 17వ అధ్యాయంలోని మహా వేశ్యను పోల్చి చూడండి. అది ఒక ప్రజను సూచిస్తున్నది గాని అది నగరం కూడా అని రాసి ఉంది (Rev,17,18]). నగరం అంటే కట్టడాలూ, వీధులూ మాత్రమే కాదు. అందులో నివాసముంటున్న జనం కూడా. అది ఒక పెద్ద మత సంస్థను కూడా సూచించగలదు. {Mat,23,37-39 పోల్చి చూడండి. ప్రవక్తలను చంపినది అక్షరాలా కట్టడాలూ వీధులూ కాదు గాని జెరుసలం ప్రతినిధిగా ఉన్న ఇస్రాయేల్‌ప్రజ. ఆ పాత జెరుసలం యూద జాతికి ఎలా ప్రతినిధిగా ఉందో అలాగే కొత్త జెరుసలం విముక్తులైన దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఉంది. వారు దాని పవిత్రత, మహిమ, వైభవాలలో భాగస్వాములై ఉంటారు.

11. దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
యెషయా 58:8, యెషయా 60:1-2, యెషయా 60:19

12. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.
నిర్గామకాండము 28:21, యెహేజ్కేలు 48:31-34

“ఇస్రాయేల్...గోత్రాల పేర్లు”– ప్రకటన గ్రంథం 7:5-8. దీన్నిబట్టి చూస్తే ఈ నగరం ఇస్రాయేల్ జాతీ క్రొత్త ఒడంబడిక సంఘమూ అనంతంగా ఏకమై ఉన్న స్థితిని సూచిస్తున్నది అనుకోవచ్చు. ఎఫెసీయులకు 2:1-22; రోమీయులకు 11:17-24 పోల్చి చూడండి. ఈ నగరం క్రీస్తు “భార్య”కు చిహ్నంగా ఉంది (వ 9) గనుక విమోచించబడబోయే ఇస్రాయేల్ జాతి ఆ “భార్య”లో ఒక భాగమై ఉన్నట్టు కనిపిస్తున్నది.

13. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.
నిర్గామకాండము 28:21, యెహేజ్కేలు 48:31-34

14. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

“పన్నెండుమంది రాయబారుల పేర్లు”– మత్తయి 10:2-4. యూదా ఇస్కరియోతు రాయబారిగా ఉన్న స్థానాన్ని పోగొట్టుకొన్నాడు – అపో. కార్యములు 1:15-20. మిగిలిన పదకొండు మందితో బాటు ఈ పునాదులపై ఎవరి పేరు ఉంటుందో అన్న విషయం గురించి సందేహమేమన్నా ఉందా? రోమీయులకు 1:3; 1 కోరింథీయులకు 15:7-10; గలతియులకు 2:8-9.

15. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.
యెహేజ్కేలు 40:3, యెహేజ్కేలు 40:5

16. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
యెహేజ్కేలు 43:16, యెహేజ్కేలు 48:16-17

“కిలోమీటర్లు”– గ్రీకులో “12,000 స్టాడియ.” ఈ నగరం బ్రహ్మాండమైనదిగా ఉంటుంది. దాని ఎత్తు ఆకాశంలోకి చాలా దూరం ఉంటుంది. అందులో నివసించబోయే విముక్తులైన గొప్ప జన సమూహాలకు ప్రతినిధిగా ఉండాలంటే ఇంత బ్రహ్మాండమైన నగరం అవసరం. ప్రకటన గ్రంథం 7:9 చూడండి.

17. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
యెహేజ్కేలు 41:5, యెహేజ్కేలు 48:16-17

ఈ నగరానికి ప్రాకారం ఎందుకు అవసరం? అది ఆ నగరంలో చేరతగనివారు ఎప్పటికీ బయట ఉంటారని సూచించే చిహ్నం కావచ్చు – వ 27; ప్రకటన గ్రంథం 22:15.

18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
యెషయా 54:11-12

స్వచ్ఛమైన స్ఫటికంలాంటి బంగారం ఇప్పుడు మనుషులకు తెలియని వస్తువు (నగర ద్వారాల తలుపులంత పెద్దగా ఉన్న ముత్యాలు కూడా ఇప్పుడు మనకు తెలియవు – వ 21). స్ఫటికం అంటే నిర్మలమైన గాజులాంటిది. వెలుగుతో అది తళుక్కుమని మెరుస్తుంది. భూమిమీద ఉన్న దృఢమైన ముతక వస్తువుల్ని దేవుడు పరలోకంలో ఉపయోగించనవసరం లేదు.

19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
యెషయా 54:11-12

“సూర్యకాంతం...ఊదామణి”– ఇలా తర్జుమా చేసిన గ్రీకు మాటలు కొన్ని ఏ ఏ రత్నాలను సూచిస్తున్నాయో ఖచ్చితంగా చెప్పలేము.

20. అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము,

21. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

ఈ ముత్యాల్ని చేసేది ఏ ముత్యపు చిప్పా కాదు గాని అన్నిటినీ నూతనంగా చేసేవాడే – వ 5.

22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.
ఆమోసు 4:13

అప్పుడు వస్తువులతో కట్టిన దేవాలయం అవసరం ఉండదు. పాత ఒడంబడిక గ్రంథంలో దేవాలయం (సన్నిధి గుడారం కూడా) దేవుడు నివాసమున్న స్థలం (నిర్గామకాండము 25:8). ఇస్రాయేల్‌ప్రజల ప్రముఖ యాజి ఒక్కడే దేవుని సన్నిధికి ప్రవేశం గలవాడు (హెబ్రీయులకు 9:7; లేవీయకాండము 16:1-2). తక్కినవారంతా బయట ఉండవలసిందే. కొత్త జెరుసలంలోనైతే దేవాలయం దేవుడు, క్రీస్తే. ఆయన ప్రజలంతా ఆయన సన్నిధానంలో, ఆయనలో నివాసముంటారు (వ 3; ప్రకటన గ్రంథం 3:12; యోహాను 17:20-23).

23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.
యెషయా 60:1-2, యెషయా 60:19

“సూర్యుడూ చంద్రుడూ”– ఇప్పటి సూర్యగోళం, చంద్రబింబం లాంటివి అప్పుడు ఆకాశంలో ఉంటాయో లేవో మనకు తెలియదు (ప్రకటన గ్రంథం 20:11) గానీ దీన్ని బట్టి చూస్తే ఉండవనిపిస్తుంది. “గొర్రెపిల్ల దానికి దీపం”– యోహాను 8:12; 2 కోరింథీయులకు 4:6; 1 యోహాను 1:5-6 పోల్చి చూడండి. ఈ లోకంలో ఆయన ఇచ్చే వెలుగులో నడిచేవారే ఆ లోకంలో అందులో నివసిస్తారు.

24. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
యెషయా 60:2, యెషయా 60:3, యెషయా 60:5, యెషయా 60:10-11

కొత్త భూమిమీద దేవుని ప్రజలకు ప్రత్యేక దేశాలూ పరిపాలకులూ ఉండవచ్చుననీ నగరంలోకి వస్తూ వెళ్తూ ఉంటారనీ ఈ వచనాల్ని బట్టి ఊహించవచ్చు.

25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.
జెకర్యా 14:7, యెషయా 60:10-11

“మూసి ఉండవు”– అక్కడ దొంగలవల్లా మరెవరివల్లా ఆపద ఎప్పుడూ సంభవించదన్నమాట. మత్తయి 6:20 పోల్చి చూడండి.

26. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
కీర్తనలు 72:10-11

27. గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
కీర్తనలు 69:28, దానియేలు 12:1, యెషయా 52:1

ఈ వచనాన్ని బట్టి వ 24-26లోని ప్రజలూ రాజులూ ఎవరో కాదు, దేవుని ప్రజలే, ఆయన ఆత్మవల్ల కొత్త జన్మం పొందినవారే అని తెలుసు. “అపవిత్రమైనదేదీ”– ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ లోకాన్ని పాడు చేసినది పాపం. అయితే ఆ లోకాన్ని పాపం ఎన్నటికీ పాడు చేయదు. ఏ మచ్చా, ఏ కళంకమూ లేని పవిత్రత శాశ్వతంగా అక్కడ ఏలుతుంది. “అబద్ధమాడేవారూ రానే రారు”– వ 8; ప్రకటన గ్రంథం 22:15 చూడండి. అబద్ధాలంటే దేవునికి ఎంతో అసహ్యం. కొత్త జెరుసలంలో ఏ అబద్ధమూ చెప్పడం ఎన్నటికీ జరగదు. పరలోకం పరలోకంగా అనిపించడానికి ఇది ఒక్కటే చాలు అని మనం ఇప్పుడు దాదాపుగా అనుకోవచ్చు. “జీవ గ్రంథం”– ప్రకటన గ్రంథం 20:12, ప్రకటన గ్రంథం 20:15.