కథానాయకులు

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

కథానాయకులు
Audio: https://youtu.be/OLk20IYyBEQ

శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. లూకా 6:40

అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు. అనుభవాల క్రమమే జీవితం అయితే, ఆ అనుభవమే ఉపాధ్యాయుడు. పిల్లలకు జ్ఞానమనే జలాన్ని పోస్తూ, విజ్ఞానమనే విరులను విరులెత్తిస్తూ, క్రమశిక్షణలో నడిపిస్తూ, భవిష్యత్తును సరిదిద్ది, సమాజ శ్రేయస్సు కొరకై, భావితరాలకు భవితవ్యాన్ని సిద్ధం చేస్తాడు ఏ గురువైనా.

బాలుడు నడువ వలసిన త్రోవను మొదటి గురువైన తల్లి తన ఒడిలో నేర్పిస్తే తరువాత బడిలో మన జీవితాలను మలిచే కథానాయకులు గురువులే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో గొప్ప బోధకులు, గురువులు ఉన్నారు. గమలియేలు పాదముల దగ్గర శిక్షణ పొంది ధర్మశాస్త్రాన్నంతా క్షుణ్ణంగా నేర్చుకున్న అపో. పౌలు తన గురువును గూర్చి ప్రస్తావించడం ఏంతో ప్రశంశనీయం. క్రైస్తవ సిద్ధాంతాలను మనకు అర్ధమయ్యే విధంగా వివిధ పత్రికల రూపంలో మనకు బోధించే అపో.పౌలు నాడు నేడు మరువలేని ఉపాధ్యాయుడు. పామరులైన శిష్యులను సిద్ధరపరచడమే కాకుండా, వారికి అనేక రకములైన బోధనలలో శిక్షణ నిచ్చి, ఓపికతో సహనముతో సరిదిద్ది, సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించే యోధులనుగా సిద్ధపరచిన గురువులకే గురువైన క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు.

ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా మనల్ని ప్రతిభావంతులనుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం. ఎగిరే గాలిపటం విద్యార్ధి అయితే దానికి ఆధారమైన దారం గురువే కదా. జీవితంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయాం అని మనం అనుకుంటే సరిపోదు, మన ప్రవర్తన పదిమందికి మార్గదర్శికంగా ఉండాలని మనకొరకు ఒదిగిపోయిన గురువులను జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన నా ఉపాధ్యాయులకు మరియు గురువులందరికి హ్యాపీ టీచర్స్ డే.