బాధ నుండి సంతోషం


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

బాధ నుండి సంతోషం

Audio: https://youtu.be/ahp41_NC8SA

ఏదైన కోలిపోయినప్పుడు కలిగిన బాధ వర్ణించలేము. నష్టము అనేది ఎవరు భరించలేరు. అయిదు రూపాయలు ఎక్కువ పెట్టి కూరగాయలు కొన్నామని తెలుస్తేనే కొంత సమయం వరకు ఆ బాధపోదు. అలాంటిది జీవితములో ఏదైనా నష్టపోతే, కోలిపోతే మరెంత బాధ కలుగుతుంది? చాలా సార్లు అనవసరంగా ఆ పని చేసాను, ఈ పని చేసాను. నా తొందరపాటు వలన ఈ నష్టము కలిగిందని కుమిలిపోతుంటాము.

విశ్వాస జీవితములో కూడా కష్టం ఎదురైనప్పుడు, నష్టము కలిగునప్పుడు, బాధలో ఉన్నప్పుడు నావల్లే ఇలా జరిగిందని లేదా నీవల్ల అలా జరిగిందని గొడవపడుతుంటారు కాని, నష్టము అనేది, కోలిపోవడమనేది విశ్వాస జీవితములో లేనేలేదు. నష్టము అనేది నష్టమే కాదు, బాధ అనేది బాధే కాదు.

ఎందుకంటే లూకా 15వ అధ్యాయములో గమనిస్తే; తప్పిపోయిన గఱ్ఱెను వెదకినప్పుడు దొరికింది. పోగొట్టుకొనిన నాణెము వెదకినప్పుడు దొరికింది. తప్పిపోయి కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. ఇక్కడ మూడు సందర్భాలలో నష్టము కనిపించింది కాని, ఆ నష్టము చివరికి సంతోషమును నింపింది. బాధ సంతోషముగ మారుటకు కారణము మరియు బాధకు సంతోషముకు మధ్యలో ఏముందని ఆలోచిస్తే, వెదకుట కనిపిస్తుంది. తప్పిపోయిన గఱ్ఱెను వెదకినప్పుడే దొరికింది. పోగొట్టుకొనిన నాణెము వెదకినప్పుడే దొరికింది. తప్పిపోయి కుమారుని కూడా తండ్రి ప్రార్థనలో వెదికాడు. తండ్రి మర్చిపోయింటే మురికి బట్టలతో పిచ్చివాడిలా దూరంలో ఉన్న కుమారుని గుర్తుపట్టేవాడు కాదు. విశ్వాస జీవితములో వెదకుట చాలా ప్రాముఖ్యమైనది.

నష్టములోనే ఆశీర్వాదమున్నది, బాధలోనే సంతోషమున్నది. ఎందుకంటే సిలువలో శాపమును దేవుడు కొట్టివేసాడు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు, క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన నీవు ఆశీర్వాదమునకే పాత్రుడవు కాని శాపమునకు కాదు.

ఈ రోజు నీవు పోగొట్టుగొనిన దాని కొరకు, నష్టపోయిన దాని కొరకు దిగులుపడవలసిన పని లేదు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, దేవుడు నీ కొరకు సిద్ధపరచిన దానిని అడ్డగించేవారు ఎవరు లేరు. నీకేది కావాలన్నా దేవుని సన్నిధిలో వెదకు, వాక్యములో వెదకు, ప్రతి రోజు వెదకు నీ నష్టము ఆశీర్వాదముగా మారుతుంది. నీకు కావలసినది నీ ముందుంటుంది. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు భూమ్యాకాశములు సృజించిన దేవుడు. మనం ఎవరి మీద ఆధారపడినామో ఆయన మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు. మనలను పిలిచినవాడు ఉన్నవి లేనట్లుగా పిలిచే దేవుడు. ఆయనను అడిగి, విశ్వాసముతో ఆయన సన్నిధిలో వెదకడం చేతకాక అసాధ్యమే ఎరుగని దేవునిని చేతకాని వానిని చేయ్యోద్దు.