వర్ధిల్లడానికి సమయం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

వర్ధిల్లడానికి సమయం
Audio: https://youtu.be/WepDvdUB0J4

నా తండ్రి ఒక చిన్న కుండీలో పూల మొక్కను వేసి దానికి ప్రతి రోజు నీళ్ళు పోస్తూ ఉండేవాడు. కొంతకాలమైన తరువాత దానికి పూలు రాకపోవడంతో ఆ మొక్కను మార్చాలనుకున్నాడు. తన వృత్తిలో బిజీగా ఉన్న కారణంగా ఆ పని చేయడం ఆలస్యమయ్యింది. అయితే కొద్ది వారాల తరువాత ఆ పూల మొక్క మేమెన్నడూ చూడనంతగా పుష్పించింది. వందలకొద్దీ సువాసనతో నిండుకొనిన పెద్ద పూలతో పెరటిలోనికి వ్యాపించి, నేలంతా అందమైన పూరేకులను కుమ్మరించింది.

ఆ పూల మొక్క మళ్ళీ ప్రాణం పోసుకోవడం లూకా 13:6-9 లో అంజూరపు చెట్టును గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని నాకు గుర్తు చేసింది. ఇశ్రాయేలు దేశంలో అంజూరపు చెట్లు ఫలించడానికి మూడేళ్ళు సమయమివ్వడం అన్నది ఆనవాయితి. ఈలోపు అవి ఫలించకపోతే, ఆ నెల మరింత మంచిగా వాడబడడం కొరకు వాటిని నరికివేస్తారు. యేసుక్రీస్తు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తోటమాలి ఒక ప్రత్యేకమైన చెట్టు ఫలించడానికి నాల్గవ సంవత్సరకాలాన్ని దయచేయమని తన యజమానుడిని వేడుకుంటాడు.

ఈ ఉపమాన సారాంశం మనకో సంకేతాన్నిస్తుంది; ఇశ్రాయేలీయులు వారు జీవించవలసిన రీతిగా జీవించలేదు, కాబట్టి దేవుడు వారిని న్యాయబద్ధంగా తీర్పు తీర్చవచ్చు. అయితే దేవుడు వారిని సహించి, వారాయన తట్టు తిరగడానికి, క్షమాపణ పొందడానికి, తిరిగి వికసించడానికి విశేషమైన సమయాన్ని దయజేసాడు. తన ప్రజలంతా వృద్ది చెందాలని కోరుతూ దేవుడు మనకు విశేషమైన సమయాన్ని దయచేస్తూనే ఉన్నాడు. మనమింకా విశ్వాసము దిశగా ప్రయాణము చేస్తున్నా మనలోని లోటుపాట్లను సరిదిద్దుకొనుటకు మరియు ఆయన క్షమాపణకు ప్రతిస్పంచించడానికి దేవుడు విశేషమైన సమయాన్ని అనుదినం దయజేస్తూ ఉన్నాడు. ప్రతి దినం సజీవుల లెక్కలో మనం ఉన్నమంటే, అది కేవలం పరలోకపు తండ్రి మనయెడల చూపించే అపారమైన కృప. ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయనలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దామా?