దగ్గర దారి


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

దగ్గర దారి

Audio: https://youtu.be/aBRbAa5FYto

ఒకరోజు మొక్కల పెంపకంలో నాకు ఆశక్తి కలిగి ఒక చిన్న పూల మొక్కను నాటి దానిని ప్రతి రోజు గమనిస్తూ నీళ్ళు పోస్తూ ఉండేవాడిని. అది నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ దాని వీక్షిస్తున్న నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మొక్క త్వర త్వరగా పెరిగి పెద్దై వికసించే పూలు కాస్తే ఎంత బాగుంటుంది కదా. వాస్తవమే కదా, ఇటువంటి అద్భుతాలు మనం ఏ సందర్భాలోనైనా కోరుకుంటాం. క్షణాల్లో జరిగిపోవాలి, మనకు కావలసింది చిటికలో అయిపోవాలి. అంతేకాదు, ఏ పని చేయకుండానే అన్ని మనకు అనుకూలంగా జరిగిపోవాలి. ఎందుకంటే, మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి.

అనీతి మార్గాల్లో పనులు సులువుగా అయిపోతాయి. దగ్గర దారులు ఎప్పుడైనా కష్టపడకుండా సాగిపోతూ ఉంటాయి. కొన్ని దగ్గర దారులు ఆచరణాత్మకంగా కూడా ఉంటాయి, కాని యోగ్యమైనవన్నీ ఆచరించడానికి కష్టంగా ఉంటాయి. వ్యక్తిత్వానికి సంబంధించినదైతే, మనకు అనుకూలంగా ఉన్నవారితో మనం ఆనందంగా ఉన్నప్పటికీ, మనకు బిన్నమైనవారికి మనలను మనము అప్పగించుకునే ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. సర్దుకుపోవడం అత్యంత కష్టమైనది. కష్టం లేకుండా ఉండే ప్రేమలు అందరూ కోరుకుంటారు.

ఆధ్యాత్మిక జీవితంలో విభిన్న సంగతులను ధ్యానించినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో అనుకోని అసౌకర్యాలు కలిగినప్పుడు దేవుణ్ణి ఇష్టపడడం కొంచం కష్టం. ఆయనకు సమీపంగా చేరడం మరింత కష్టం. నేను నమ్మకంగా జీవిస్తున్నానే, ప్రార్ధనలో ఎడతెగక ఉన్ననే అయినా నాకు ఈ అసౌకర్యం ఎందుకు కలిగింది అనే ఆలోచన మనసులో ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ అసౌకర్యాలను దాటుకునే దగ్గర దారులు వెతకడం ప్రారంభిస్తాము. క్షణంలో ఒక అద్భుతం జరిగితే ఎంత బాగుండు? బైబిల్లోని ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడే నిజమవుతే అంతకంటే ఇంకా ఏమి అవసరం లేదు అనిపిస్తుంది.

మన జీవితాలను ఆయనకు అప్పగించుకొనే కష్టమైన ఎంపికను తప్పించుకునే దగ్గర దారి లేదని తన శిష్యులకు తేట పరిచాడు. శిష్యుడు కావాలనుకునే ఒకనితో “యేసు..నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని”(లూకా 9:62) హెచ్చరించాడు. క్రీస్తును వెంబడించాలంటే మన జీవితంలో సమూల మార్పు అవసరం. ఈ యోగ్యమైన ప్రయాణంలో విశ్వాసం అతి ప్రాముఖ్యం. విశ్వాసంతోపాటు త్యాగాన్ని కూడా జతచేయాలు మరి. నన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను (మార్కు 8:34).  నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్న దమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు...ఇహమందు ... నూరంతలుగా ...రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (మార్కు 10:29-30). 

క్రీస్తును వెంబడించడం కష్టమైనది. యోగ్యమైన మార్గంలో నడుస్తూ, ఎటువంటి అసౌకర్యాలు కలిగినప్పటికీ, పరిశుద్ధాత్మ సహాయం పొందుతూ సహనముతో అడుగులు ముందుకు వేయగలిగితే మనకు ఇప్పటికీ, ఎల్లప్పటికీ... సంపూర్ణమైన, ఆనందకరమైన జీవితం ప్రతిఫలంగా లభిస్తుంది. ఆమెన్.