విశ్వాసపాత్రమైన సంబంధాలు


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

విశ్వాసపాత్రమైన సంబంధాలు.

Audio: https://youtu.be/QTe6Gffauu4

స్నేహితులు, బంధువుల మధ్య విబేధాలు కలిగినప్పుడు ప్రశాంతతను మనం కోల్పోతూ ఉంటాము. ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులతో విబేధాలు లేదా ఘర్షణలు గనుక ఉంటె కోపతాపాలు తప్పనిసరి. ఈ విబేధాలు మన రోజు వారి జీవితంపై ప్రభావితం చూపిస్తాయి. అంతేకాదు, భార్యాభర్తలు విభేదించినప్పుడు వారిద్దరిమధ్య సమాధానం కోల్పోయి, అసహనంతో కూడిన చిరాకుతో వారి ఎదుట ఉన్న పనులను అవి ఆటంకపరుస్తుంటాయి. కలిసి తీసుకునే నిర్ణయాలపై ప్రభావితం చేస్తాయి. మరియు వారు, వారి చుట్టూ ఉన్న వ్యక్తులపై తమ అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. విభేదాలు కుటుంబ జీవితాలను విచ్చిన్నం చేస్తుంటాయి. విభేదించినప్పుడల్లా వ్యక్తిగతంగా ఇరువురు పోటీ పడకుండా, గర్వాన్ని దిగమ్రింగుకొని దేవుని దగ్గర క్షమించమని అడగ గలిగితే, కుటుంబాల్లో సమాధానపడిన నెమ్మదిని అస్వాదించగలరు.

 ఇశ్రాయేలీయులు వ్యక్తిగత పాపము వలన కలిగిన బాధ అనంతరం తిరిగి సమకూర్చబడి ఆనందాన్ని అనుభవించారు. “శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.”(యెహోషువ 6:18) అని యెహోషువ హెచ్చరించాడు. అయితే అకాను శాపితము చేయబడినదానిలో కొంత తీసికొని తన గుడారములో దాచుకున్నాడు. అయితే, వాని పాపము బహిర్గతము చేయబడి దాని విషయములో వారు చర్చించినప్పుడే, ప్రజలు దేవునితో సమాధానపరచబడ్డారు.

“పాపాన్ని మన గుడారాలలో దాచుకోవడము” అన్నది మన హృదయాలను దేవుని నుండి మళ్ళించడంతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళను కూడా ఎలా ప్రబావితం చేస్తుందో అన్నదానిని ఆకానులా ప్రతిసారి మనము గ్రహించము. యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి, మన పాపాన్ని ఒప్పుకొని, క్షమాపణను వేడుకోవడమన్నది, దేవునితో మరియు ఇతరులతో విశ్వాసపాత్రమైన సంబంధాలకు పునాదిగా ఉంటుంది. మనం అట్టి ప్రేమను కలిగినప్పుడు ఇతరుల సంబంధాలతో ఏర్పడే బంధాలమధ్య ప్రేమను ఆస్వాదించడమే కాకుండా  మన జీవితాలను నిర్వహించేవాని సేవించే సన్నిధిని కూడా ఆస్వాదించ గలుగుతాము. ఆమెన్.