విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడమే - విజయోత్సవం

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation - విజయోత్సవములు

విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడమే - విజయోత్సవం

https://youtu.be/ZERKiUsZG_g

రెండు పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటూ ఇటూ పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. అతను తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. ఉత్కంఠతతో మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తునారు. అతడు నెమ్మదిగా అవతలి స్తంభం వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ, ఈలలు వేసి అభినందించారు. వారు కరచాలనం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. అప్పుడతడు ప్రేక్షకులను అడిగాడు "నేను ఇప్పుడు ఈ వైపు నుండి ఆ వైపుకు తిరిగి ఇదే తాడు మీద నడవగలనని మీరు అనుకుంటున్నారా?" ఏక కంఠంతో "అవును, అవును, నీవు చేయగలవు..." అన్నారు అందరు. మీరు నన్ను విశ్వసిస్తున్నారా? అని అతడు అడిగాడు. వారంతా అవును, అవును, మేము నీపై పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. సరే, మీలో ఎవరైనా మీ బిడ్డను నా భుజం మీద కూర్చోబెట్టగలరా; నేను మీ పిల్లవాడిని సురక్షితంగా మరొక వైపుకు తీసుకువెళతాను ..

అక్కడ ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం అలుముకుంది.. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండిపోయారు. నమ్మకం వేరు. విశ్వాసం వేరు. విశ్వాసం కోసం మనం పూర్తిగా లొంగిపోవాల్సి ఉంటుంది.. నేటి ప్రపంచంలో మనకు దేవుని పట్ల లేనిది ఇదే. మనం సర్వశక్తిమంతుడిని నమ్ముతాము. అయితే మనం ఆయనను సంపూర్ణంగా, సందేహం లేకుండా విశ్వసిస్తున్నామా!. ఈ ప్రశ్న నాకును మీకును ఆలోచింపజేస్తుంది. అపో. పౌలు హెబ్రీ 11:6 లో అంటాడు "విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా".

సాధించాలనే ఆలోచన పట్టుదల లేకుండా ఫలము పొందడం అసాధ్యం. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. ఈ ప్రయాణంలో కష్టం ఎదురవ్వచ్చు. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి "విజయం" విలువ తెలుస్తుంది. నీవు పొందే విజయాలన్నిటికి తొలిమెట్టు, అసాధ్యమైనవాటిని సుసాధ్యం చేయగల శక్తిమంతుని బలంగా విశ్వసించడమే. విశ్రమించని కష్టం, శ్రమ, అంకితభావం, దేవునికి ఇష్టంగా జీవించడం ఇవే విజయ రహస్యాలు. నీవు పొందబోయే ఆశీర్వాదాలు. ఆత్మీయ దైనందిన జీవితములో నీవు పొందే విజయాలు ఇతరులకు నీవిచ్చే కానుకల వంటివి. కొందరు నిన్ను ప్రోత్సాహించినందుకు మరికొందరు నిన్ను అవహేళన చేసినందుకు. విజయోత్సవం పొందాలంటే... విజయాన్ని నీ జీవితంలో వేడుక చేసుకోవాలంటే నిన్ను నీవు చూసుకోవడం కాదు, నిన్ను నీవు రూపుదిద్దుకోవడమే. క్రీస్తు పై విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆమెన్.