సిలువ ధ్యానాలు Day 15 - సిలువ - ఆధారపడుట
Audio: https://youtu.be/skzHzlu8vDk
తెలివిగలవారికైన తెలివిలేనివారికైన, జ్ఞానముగలవారికైన జ్ఞానములేనివారికైన భవిష్యత్తు మీద ఒక ప్రణాళికనేది ఉంటుంది. విశ్వాసులైతే దేవుని చిత్తం, ప్రార్ధన చేద్దాం అంటారు కాని మనస్సులో ఒక ప్రణాళిక లేకుండ ఎవరు ఉండరు. మనం వేసుకున్న ప్రణాళికలో సక్సస్ ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు కాని, ఒక పని కొరకు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పని చేసేలోపు అనేకసార్లు మారుస్తు ఉంటాము. నిర్ణయీలను మార్చుటకు కారణం ఒకటి ధైర్యం లేకపోవడం రెండవది ప్రక్కవారి మాటలను నమ్మి ఒకసారి ఇదని మరొకసారి అదని మారుస్తుంటాము.
మత్తయి 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. సిలువను మోయాలనుకొనే వాని గురించి ఇక్కడ చెప్పబడింది. యేసు ప్రభువును బంధించే ముందు, ఆ రాత్రి గెత్సమనే తోటలో ఆయన ఇలా ప్రార్ధన చేసాడు ‘తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు’. తరువాత వెంటనే నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని తండ్రి చిత్తమునకు లోబడ్డాడు. మరి కొద్ది క్షణాలలో తనతో ఉన్న శిష్యులు తనను వదిలి పారిపోతారు. తెల్లవారితే శిక్ష విధిస్తారు, ఒంటరిగా సిలువను మోయాలి. యేసు ప్రభువు ఇవన్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఈ సిలువ తొలిగిపోతే బాగుండు అనుకున్నాడు కాని, చివరికి అంగీకరించాడు.
సిలువ అనగా ఆధారపడుట. ఎవరి మీద ఆధారపడుట అనగా ఎవరిని నమ్మి సిలువను ఎత్తుకొన్నావో ఆ దేవునిపై ఆధారపడుట. సిలువ లేనిదే రక్షణ లేదు, సిలువ మోయనిదే పరలోకం లేదు. బాధాకర విషయమేమిటంటే సిలువను మోసేవానితో ఎవరు ఉండరు. అలాగని సిలువను దించితే యేసయ్య నీతో ఉండడు. లోకంలోని అందాలన్ని కావాలంటే, లోకంలోని మెప్పు కావాలంటే సిలువను ఉపేక్షించాలి, లేదు ఎవరు లేకపోయిన పర్వాలేదు క్రీస్తు నాతోవుంటే చాలనుకుంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించాలి.
యేసు ప్రభువు యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని ఎప్పుడైతే శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడో వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దించాడు. అంతకముందే నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పిన పేతురు ఇక్కడ అదే క్రీస్తును గద్దిస్తున్నాడు. పేతురు తనకనుకూలమైన పరిస్థితిని కోరుకుంటున్నాడు. అప్పటివరకు యేసుని, శత్రువును జయించే క్రీస్తనుకున్నాడు కాని, శ్రమలను అనుభవించే రక్షకుడు అనుకోలేదు. కంఫర్ట్ జోన్ లో ఉన్న పేతురు, యేసు ప్రభువు శ్రమలు ఎదుర్కొనాలనగానే జీర్ణించుకోలేకపోయాడు, అడ్డగించి తిట్లుతిన్నాడు. క్రైస్తవ జీవితం పూల పాన్పు కాదు ముళ్ళబాట. కాలుమీద కాలేసుకొని సేవలు చేస్తే పరలోకానికి వెళ్ళగలిగితే, పౌలు, అపోస్తలులు ప్రాణాలు తెగించి సేవ చేయవలసిన అవసరమేలేదు.
సిలువ అనగా ఆధారపడుట. ఒకసారి సిలువను ఎత్తుకున్నావంటే మొదట చేయవలసినది నా ఇష్టం, నా సంతోషం అనేది మరచిపోయి ఎన్ని శ్రమలొచ్చినా ఎవరు లేకపోయినా సిలువను దించకుండ; యేసుని వెంబడించాలి. ఎందుకనగా, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. ఎవరి మీద నీవు ఆధారపడ్డావో ఆ దేవుడు మాట మార్చుటకు, వదిలిపెట్టుటకు, మోసం చేయుటకు నరుడు కాదు. నీకు ఆధారమైన దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ పక్షాణ యుద్దము చేసి న్యాయము జరుగించే దేవుడు, ఆయన కునకడు నిదురపోడు. కాబట్టి సిలువను మోస్తూ దేవుని మీద ఆధారపడతావో, లేక సిలువ లేకుండ దేవునిపై ఆధారపడతావో నీ చేతిలో ఉంది. కాని, ఒకటి మరచిపోవద్ద సిలువ లేనిదే కిరీటం లేదు.