40 రోజుల సిలువ ధ్యానములు - Day 30 - సిలువ మాదిరి
Audio: https://youtu.be/cfpRSxJkgPo
మనిషిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పింది చేయ్యడు. చెయ్యాలని ఆశ ఉంటుంది కాని, చెయ్యలేడు. ఇతరులలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటాడో అవి తనలోనే కనిపించవు. ఇలాంటివన్ని నాకిష్టము లేదంటాడు, చేసేవన్ని అలాంటి పనులే. ఒక ప్రక్క అబద్దాలు చెప్తునే నెనేప్పుడు అబద్దాలు చెప్పనని దబాయిస్తాడు. మాట తప్పడమనేది సులువైనదే కాని, దానివలన ఎంత మంది గాయపడుతున్నారో, ఎంతమంది నష్టపోతున్నారో ఆలోచించరు. మనిషిని మనిషి మోసం చేసే స్వార్ధపూరితమైన జీవితం మనిషిది.
దేవునియందు విశ్వాసముంచిన వారు కూడ మాట మీద నిలబడలేక ఇతరులను బాధపడుతూనే ఉంటారు. సంఘములోని విశ్వాసులు మాట మీద నిలబడలేకపోవుటకు కారణం, వారిని నడిపించే సేవకులే. కొంతమంది బోధలు ఎలా ఉంటాయంటే; రాహాబు గురించి గొప్పగా ప్రసంగిస్తారు కాని, అదే రాహాబు సంఘములో ఉంటే అంగీకరించలేరు. బీద విధవరాలు తన దగ్గర ఉన్నదంతా అనగ రెండు కాసులు కానుక పెట్టెలో వేసింది, యేసు ప్రభువు తనను ఘనపరిచాడని సంతోషంగా బోధిస్తారు కాని, అదే రెండు రూపాయలు ఎవరైన సంఘములో కానుక వేస్తే గుండె జారిపోతుంది. ఇలా కొంతమంది చేసే బోధకు, జీవితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టే విశ్వాసులు వారి దారిలోనే నడుస్తుంటారు. బోధకులు అనేకులు ఉన్నారు కాని, చెప్పింది చేసే బోధకులు, చేసినవాటినే బోధించే బోధకులు అరుదుగ కనిపిస్తారు.
యేసు ప్రభువు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగించినప్పుడు మొట్టమొదటి మాట ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. ఈ మాట చెప్పిన యేసు ప్రభువు శిష్యులందరి పాదాలు కడిగి; నేను సేవ చేపించుకొనుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చానని తనలో ఉన్న దీన స్వభావమును కనుబరచాడు. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిదని చెప్పిన యేసు ప్రభువు ఏ నేరము చేయకపోయిన మనలను నీతిమంతులనుగా చేయుటకు క్రూరముగ హింసించబడినాడు. తనను అప్పగించుటకు ఇస్కరియోతు యూదా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసిన తన పాదములు కడిగాడు. ఏదైతే యేసు ప్రభువు బోధించాడో అక్షరాల చేసి చూపించాడు.
క్రైస్తవుడు అంటేనే క్రీస్తు ప్రతిరూపం. ఆనాడు అంతియోకయలో శిష్యులు క్రీస్తు వలె జీవించారు, బోధించారు కాబట్టే క్రైస్తవులని పేరు పెట్టారు. యేసు ప్రభువు మొహమాటం లేనివాడు, సత్యమును సూటిగ బోధించాడు. ఆయన శోధింపబడినను పాపము చేయకుండ యదార్ధమైన జీవితము జీవించాడు. సిలువ అనగా మాదిరి. యేసు ప్రభువు ఎలా జీవించాడో అలాగుననే క్రైస్తవుడని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు క్రీస్తు వలే మాదిరికరమైన జీవితము జీవించాలి. క్రైస్తవుడు అనగా మాట తప్పనివాడు, మాదిరిగల జీవితము గలవాడు. ఈ సిలువ ధ్యానములు మనమందరము క్రీస్తును ప్రతిబింబచేసి జీవితము జీవించులాగున నడిపించును గాక.