40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 4వ మాట - విడువబడుట
Audio: https://youtu.be/H37ktU7Vg7c
మత్తయి 27:46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
మరియ పరిశుద్దాత్మ వలన గర్భవతియైనప్పుడు దేవుడు యేసు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మరియను ఎవరు ఏమి చెయ్యలేదు. రెండు సంవత్సరంలోపు పిల్లలను చంపమని హేరోదు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు యేసు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఎవరు ఏమి చెయ్యలేకపోయారు. దేవుడు చెప్పగానే ఆ రాత్రి బెత్లహేము నుండి ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు యేసు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మార్గ మధ్యలో ఏ ఆటంకము కలుగలేదు. నజరేతులో యేసుని తలక్రిందులుగా పడవేయాలనుకున్నపుడు దేవుడు యేసు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఎవరు ఏమి చెయ్యలేకపోయారు. ఆయన పరిచర్యలో కొన్నిసార్లు రాళ్లతో కొట్టాలని, కొన్నిసార్లు చంపాలనుకున్నపుడు దేవుడు యేసు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఎవరు ఏమి చెయ్యలేకపోయారు. ఏ పరిస్థితిలోను యేసు చెయ్యి విడువని దేవుడు సిలువ మీద విడిచిపెట్టాడు.
తండ్రియైన దేవునికి అతి పెద్ద సవాలు ఇక్కడే మొదలైయింది. ఒక ప్రక్కన పాపము చేసిన మనిషి, మరొక ప్రక్కన ఏ పాపము చేయని ప్రియ కుమారుడు. ఒక ప్రక్కన నరక ద్వారం దగ్గర పాపము చేసిన మనిషి, మరొక ప్రక్కన మరణముతో పోరాడుతున్న కుమారుడు. తన ఏకైక కుమారుని బలి ఇవ్వమని అబ్రహామును పరీక్షించిన దేవునికి అదే పరీక్ష ఎదురైనది. మానవాళి విముక్తి కొరకు తన సొంత కుమారుని బలి చేయుటకు సిద్దపరిచిన గడియ. ఆది నుండి చేసిన వాగ్ధానములు నెరవేర్చు గడియ వచ్చేసింది అదే సొంత కుమారుని చెయ్యి విడిచే గడియ.
సిలువ నుండి క్రిందికి చూస్తే యేసుని ఎగతాళి చేస్తున్న మనుష్యులు, యేసు కొరకు ఏడుస్తున్న మనుష్యులు కనిపిస్తున్నారు కాని, ఒకసారి సిలువ పైకి చూస్తే మానవాళి విముక్తి కొరకు తన సొంత కుమారుని చెయ్యి విడునబోతున్న ఓ తండ్రి హృదయ వేదన, మానవాళి పాప విముక్తి కొరకు ఓ తండ్రి చేసిన త్యాగం కనిపిస్తుంది.
నిర్లక్ష్యముతో పాపము చేసి, తండ్రియైన దేవుని మోసము చేసి, తిరుగుబాటు స్వభావం కలిగిన లోబడని మనిషిని మరణమునకు అప్పగించడం తండ్రియైన దేవునికి ఇష్టము లేక కనికరముతో చివరిగా చేసిన త్యాగమే తన సొంత ప్రియ కూమారుడైన నజరేయుడైన యేసుపై నీ నా దోషములన్ని మోపి నిర్ధాక్ష్యనముగ ఒంటరిగ సిలువ మీద చెయ్యి విడిచేసాడు. చెయ్యి విడుచుట అనేది ఎంత భయంకరమైన వేదననగా; కొరడాలతో కొట్టినప్పుడు, మేకులతో సిలువకు కొట్టినప్పుడు మౌనముగ సహించి భరించిన యేసు తండ్రి చెయ్యి విడువగానే పెద్ద కేక వేసాడు.
మన రక్షణ కొరకు, మన సంతోషం కొరకు, మన పరలోకరాజ్య ప్రవేశం కొరకు తన సొంత ఏకైక కుమారుని చెయ్యి విడిచిన దేవాది దేవుని కొరకు సులువుగ చిక్కులు పెట్టు పాపమును, దేవుని నుండి ఆయన సన్నిధి నుండి సహవాసం నుండి దూరము చేసే పాపమును నీవు విడువగలవా?