40 సిలువ ధ్యానములు - Day 40 - సిలువ శక్తి

  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - సిలువ ధ్యానాలు - 40 Days

40 సిలువ ధ్యానములు - Day 40 - సిలువ శక్తి

Audio: https://youtu.be/9ZpEiwCfgkc

1 కొరింథీ1:18 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

సిలువ అనేది మనిషి చేసిన పాపమును భరించే దేవుని ప్రేమ, సిలువ ప్రేమ ఒక్కటే పాపి హృదయాన్ని కరిగించి, పశ్చాత్తాపాం తీసుకురాగలదు. పరలోకమునకు సిలువే మార్గం. సిలువ యొద్దకు వచ్చిన వారు ఎప్పటికీ ఒకేలా ఉండరు. సిలువ జీవితమునకు క్రొత్త ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును అని వాక్యం సెలవిస్తుంది. సిలువను ఎత్తుకున్నవానికే యేసు బోధలు అర్ధమవుతాయి. సిలువను ఎత్తుకున్నవాడే దేవుని చేత నడిపించబడుతాడు. సిలువను ఎత్తుకున్నావాని ప్రాణమునకే విశ్రాంతి. విశ్రాంతి అనగా ప్రతి ప్రయత్నంలో విజయమును చూస్తావు కాబట్టి నీకు నిరుత్సాహం ఉండదు నెమ్మది సంతోషముతో నింపబడతావు.

యేసు ప్రభువు సిలువలో మరణించిన తరువాత ఏటు చూసిన రెండు గుంపులు కనిపిస్తున్నాయి. కలిసి దొంగతనములు చేసి దోషులుగ తీర్పు తీర్చబడిన ఇద్దరు దొంగలలో ఒకడు విడువబడితే మరొకడు యేసు ప్రభువుతో పాటు పరదైసులో అడుగువేసాడు. సిలువ దగ్గర ఉన్న శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగ నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచాడు కాని, వాక్యం తెలసిన ప్రధానయాజకులు ఆ వంచకుడు అని యేసు ప్రభువును పిలిచారు. 3 1/2 సం।। యేసు ప్రభువుతో కలిసి సేవ చేసిన శిష్యులు భయపడి దాగుకున్నారు, సమాజమునకు భయపడి రహస్యముగా యేసు ప్రభువును వెంబడించిన అరిమతయియ యోసేపు తెగించి యేసు దేహము కొరకు పిలాతును అడిగాడు. ఒక గుంపు యేసు మరణమును జయించి లేచాడని ప్రకటిస్తుంటే, మరొక గుంపు యేసు దేహమును శిష్యులు ఎత్తుకెల్లారని ప్రకటించారు. యేసేవరో ఎరుగనని చెప్పినందుకు పేతురు ఏడ్చి పశ్చాత్తాపంతో మరల యేసు వద్దకు వచ్చాడు, నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసానని ఇస్కరియోతు యూదా ఏడ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరంతా సిలువను చూసునవారే కాని, ఆ సులువలోని శక్తిని ఆశ్రయించనివారు నమ్మనివారు సిలువను తృణీకరించి నిత్యరాజ్యమును కోల్పోయారు, ఎవరైతే సిలువలోని శక్తిని ఆశ్రయించారో వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగిరారు. సిలువ నీకు వెఱ్ఱితనముగా ఉంది లేదా సిలువ నీకు శక్తిని ఇస్తుందా? మనకున్న గొప్ప భాగ్యం సిలువ. సిలువను ధరించేవాడు కాదు సిలువను మోసేవాడే కైస్తవుడు. సిలువ ధ్యానం ఎంత శక్తివంతమైనదనగా, సిలువ గురించి ధ్యానం చేస్తే లోకం మీద కోరిక ఉండదు. సిలువ ధ్యానం శరీరాశల మీద విజయమును ఇస్తుంది. శరీరమును జయించాలంటే సిలువ ధ్యానమే మార్గం. నీవు ఒంటరిగ ఉంటే సిలువ వైపు చూడు. నీవు విడువబడితే సిలువ వైపు చూడు. నీవు అవసరతలో ఉంటే సిలువ వైపు చూడు. జీవితములో విజయం చూడలేనని అనిపిస్తే సిలువ వైపు చూడు ఎందుకంటే సిలువలో యేసు ప్రభువు అందరిచేత తృణీకరించబడి, తండ్రి చేత విడువబడి, ఒంటరితనములో ఎలా విజయము సాధించాడో చూడగలిగితే నీవెప్పుడు వెనకడుగు వేయలేవు, ఆగిపోలేవు.