జీవితకాలం చేరువగా!


  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

జీవితకాలం చేరువగా!

ఆశ్రమంలోనికి ఒక వృద్ధ మహిళను తీసుకుని వచ్చారు ఆమె బంధువులు. తాను ఒంటరిగా ఉంటూ దిక్కుతోచని స్తితిలో ఉన్నకారణంగా ఆ చోటికి వచ్చినట్టు గమనించింది అదే ఆశ్రమంలో పని చేస్తున్న సలోమి. ప్రతి రోజు లోలోపల తాను పడుతున్న వ్యధ, తడిసిపోతున్న తన కళ్ళను గమనిస్తూ పరామర్శించడం మొదలు పెట్టింది సలోమి. తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంగతులను పంచుకుంటూ, చేదు అనుభవాలను చెప్పడం ప్రారంభించింది. భర్త చనిపోయిన తరువాత తమ బిడ్డలు ఎన్నడు అనాధలు కాకూడదని వారికి సమస్తం సిద్దపరచి ఒక ఇంటివారిని చేస్తే, వారే చివరకు తనని ఇంటినుండి బయటకు పంపి, ఒంటరిని చేసి అనాధగా ఈ ఆశ్రమంలోనికి తీసుకువచ్చారను సంగతి తనకు బాధ కలుగజేసిందని తన గుండెలోని బరువునంతా సలోమికి వెళ్ళగక్కింది. రోజులు కాలాలు గడుస్తూ ఉన్నప్పడు, వారి మధ్య స్నేహం బలపడింది. వారిద్దరి స్నేహం ఆ ఆశ్రమంలో గడిపిన సంవత్సరాలన్నీ సంతోషంగా మార్చబడ్డాయి. నీ స్నేహం నా ఒంటరితనాన్ని తీసేసిందని ఆ మహిళ సలోమికి తన కృతజ్ఞతలను తెలియజేసింది.

అందరూ ఉన్నా కొన్ని సార్లు మనం ఒంటరివారమే. యేసు క్రీస్తు, పరలోకానికి తిరిగి ఆరోహనమయ్యే ముందు తన శిష్యులతో సదాకాలం ఉంటానని, ఆదరణకర్తయైన తన ఆత్మను మనకొరకు పంపుతానని తెలియజేశాడు. అంతేకాదు, ఆయన ఆత్మదేవునిగా వారిలోనే ఉంటూ, వారితోనే ఉంటూ మరియు వారి మధ్యనే నివసిస్తూ ఎన్నడును వారిని “అనాథలనుగా విడువను” అని వాగ్దానం చేశాడు. (యోహాను 14:18). యేసు క్రీస్తు నందు విశ్వసించేవారికి ఈ వాగ్దానం నేడు కూడా వర్తిస్తుంది. (యోహాను 14:23) యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము. మనలో నివాసముంటానని ఆనాడు శిశ్యులతో ప్రమాణం చేసిన త్రియేక దేవుడు నేడు మనతో కూడా ఉన్నాడు...ఉంటాడు అనుటలో ఎట్టిసందేహం లేదు.

ప్రియ స్నేహితుడా! ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు; మనతో జీవితకాలం చేరువగా ఉండే నమ్మకమైన స్నేహితుడు మన ప్రభువు. మన వ్యధలోనూ, బాధలోనూ మరియు అత్యంత లోతైన పోరాటాలో కూడా మనతో ఉండి, మనలను నడిపిస్తాడు... విడిపిస్తాడు. మన ప్రతి పాపమును క్షమిస్తాడు. మౌనంగా మనం చేసే ప్రార్ధన తప్పకుండా ఆలకిస్తాడు. ఇంకా మన గుండెలోని ప్రతి బరువును మనం మోయలేని ప్రతి భారాన్ని ఆయన భరిస్తాడు. అట్టి మధురమైన తన సహవాసాన్ని అనుభవిస్తే ఎన్నడూ మనం ఒంటరివాళ్ళం కాదు. అట్టి సహవాసాన్ని కలిగియుండడానికి ప్రయత్నం చేద్దామా! ఆమెన్.

https://youtu.be/TqFpwrTLLPA