తగ్గించుకోవడం అంటే?


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

తగ్గించుకోవడం అంటే?

ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ గారు తాను పనిచేస్తున్న కళాశాలలో విద్యార్ధుల నడవడిని సరి చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. వారి నైపుణ్యతను పెంచడానికి వారికి అర్ధమయ్యే మాటల్లో చెప్పాలని ఎంత ప్రయత్నించినా అనేక సార్లు విఫలమయ్యాడు. అప్పుడు ఒక ఆశ్చర్యమైన ప్రశ్న అతనికి ఎదురయ్యింది. అది “ తెలివిగల, సంకుచితమైన, స్వనీతిపరుడైన, నమ్రతగల” తనవంటివాడు చెబితే ఒక విద్యార్ధి ఎందుకు వింటాడు అని ఆ ప్రొఫెసర్ తనను తాను ప్రశించుకోవాల్సి వచ్చింది. అయితే ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినందుకు తనను తాను తగ్గించుకొని అతని విధ్యార్ధులలో ఒకని వంటివానిగా ఎప్పటికీ కాలేడను సంగతి ఇక్కడ మనం గమనించగలం.

యేసు క్రీస్తు ఈ భూమిమీదికి వచ్చినప్పుడు మనలో ఒకనివంటివాడు అయినందున తగ్గించుకోవడం అంటే ఏమిటో చూపించాడు. హద్దులన్నిటినీ దాటి సేవ చేయడము, బోధించడము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, యేసు క్రీస్తు ప్రతి చోటా ఇమిడిపోయాడు. తగ్గించుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. ఆయనను సిలువ వేస్తూ ఉన్నప్పుడు కూడా తనను సిలువ వేసే వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. సిలువలో ప్రతిసారి ఊపిరి తీసుకోవడానికి బాధపడుతూ కూడా, తనతోపాటు మరణిస్తున్న దొంగను క్షమిస్తూ నిత్యజీవాన్ని ప్రసాదించాడు.

ఎందుకు అంతటి స్వభావాన్ని యేసు క్రీస్తు కనుపరచారు, అంతము వరకు ఆయన మనలాంటి ప్రజలకు ఎందుకు సేవ చేశాడు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు? అపో. యోహాను ఈ విషయాన్ని గుర్తించాడు 1 యోహాను 3:11-18 లో వ్రాస్తూ “ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము” అంతేకాదు “మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.” అని క్రీస్తుతో తాను నేర్చుకున్న అనుభవాన్ని వివరిస్తూ ఉన్నాడు. “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” అనే ప్రశ్నను ఆలోచన చేసినప్పుడే మన తగ్గింపు స్వభావం మనకు తేటగా కనబడుతుంది.

స్నేహితుడా, క్రీస్తు ప్రేమ మన గర్వాన్ని, స్వయం తృప్తిని, నీవు ఆర్జించినవాటినిబట్టి గొప్పగా అనుకునే తత్వాన్ని, నిన్ను నీవు హెచ్చించుకునే తత్వాన్ని నిర్మూలిస్తుంది. ఇట్టి ప్రేమను క్రీస్తుయేసు అత్యంత శక్తివంతమైన విధానములో చేసి చూపించాడు. తన ప్రాణాన్ని మనకొరకు అర్పించాడు. తగ్గించుకోవడం అంటే తెలుసుకున్నాం మన జీవితాల్లో పాటించి చూపిద్దామా? ఆమెన్.

https://youtu.be/lM_Jurrb2JA