ప్రముఖుడై ఉండాలంటే?


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ప్రముఖుడై ఉండాలంటే?

సెలెబ్రిటీలను వెంబడించే నేటి మన సమాజంలో కొందరు పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులకు అధిక లాభాలు పొందడానికి వీరిని క్రయ విక్రయాలు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు, ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రముఖులను వెంబడించినట్టు ఆ దినలలో కూడా కొందరు యేసు క్రీస్తును కూడా వెంబడిస్తూ, ఆయన బోధలను వింటూ, ఆయన చేసే అద్భుతాలను గమనిస్తూ ఆయనను తాకితే చాలని, ఆయనతో ఉంటేచాలని కోరుకుంటూ అనేకమంది యేసును వెంబడించి ఆయనను సెలెబ్రిటీలానే చూశారు.

అయినా యేసు ఎన్నడు తనను తాను ప్రాముఖ్యమైన వానిగా ఎంచుకోవడం గాని, దూరంగా ఉండడం వంటివి చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేవాడు. అందరిసమస్యలు తీరుస్తూ, ప్రతి ప్రార్ధన వింటూ, రోగులను స్వస్థపరుస్తూ అందరిలో ఒకని వానిగా ఉండేవాడు. మార్కు 10వ అధ్యాయం ప్రకారం, తాను నిర్మించబోయే పరలోకరాజ్యంలో స్థానం కొరకు తన శిష్యులైన యాకోబు, యోహానులు సామాలోచన చేస్తున్నప్పుడు, యేసు తన శిష్యులందరికీ “మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను.  మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను” (మార్కు 10:43,44) అని గుర్తుచేశాడు. అదే అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ఈ మాటలు పలికిన తరువాత వెంటనే, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డివాడైన ఒకనిని, “నేను నీకేమి చేయగోరుచున్నావని” అడిగినప్పుడు. ఆ గ్రుడ్డివాడు “బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని” అడిగినప్పుడు,  “యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను” వెంటనే అతడు చూపు పొందినట్లు గమనించగలం. అంతేకాదు తండ్రిపేరుతో సహా మార్కు తన పత్రికలో వ్రాసియుంచాడంటే, బర్తిమాయి యేసును వెంబడించాడు.(52వ) ప్రకారం “వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొందివెళ్లెను”. హల్లెలూయ.

మన ప్రభువు “...పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను.” (వ 45). యేసు క్రీస్తు శరీరుడుగా మన మధ్య జీవించినప్పుడు, ఆనాడు అందరికీ అందుబాటులో ఉన్నలాగున నేడు కూడా మన ప్రార్ధనలను వింటూ మనతో మనమధ్య తన ఆత్మా ద్వారా సహవాసం కలిగియున్నాడు. ఇటువంటి అనుభవం కలిగిన మనము,  ఆయనలా కనికరముగలవారముగా ఇతరులకు అందుబాటులో ఉన్నప్పుడే గొప్ప సహవాసాన్ని అనుభవించగలం. ఆమెన్.

https://www.youtube.com/watch?v=RE2SG412QNQ