నా అనేవారు నాశనమవ్వకూడదని..!!


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

నా అనేవారు నాశనమవ్వకూడదని..!!

స్నేహం. స్నేహితులు. ఈ మాటల్లో ఎంతో తియ్యని అనుబంధాలు, భావోద్వేగాలు. కుల మత బేధాలు లేనిది, బీద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాలకన్న మిన్నది స్నేహమే. కన్నీళ్ళతో నిండుకున్న కష్టాల్లో, ఊహించలేని నష్టాలున్నా, భరించలేని బాధలెన్నున్నా, మోయలేని బరువు భారమైన ఎటువంటి పరిస్థుతులు ఉన్నా ఓటమిలో ధైర్యాన్నిస్తూ, దుఃఖ సంతోషాలను కూడా సమానంగా పంచుకుంటూ,  ప్రాణం కంటే త్యాగం గొప్పదని నిరూపించే స్నేహితులు మనందరి జీవితంలో తప్పక ఉండే ఉంటారు. నాకు కూడా ఇటువంటి స్నేహితులు ఉన్నారు.

నేనంటాను, స్నేహితులు లేని జీవితం కూడా వ్యర్ధమే. మంచి స్నేహితుడు తన స్నేనితుల క్షేమం కోసం ప్రయాసపడతాడు. తన స్నేహితులకు మార్గదర్శిగా జీవిస్తాడు. నిజమైన స్నేహితుడు తన మంచి స్నేహితుల నుండి దూరమవ్వడం కష్టతరం, అసాధ్యం. మీ అనుభవాల అభిప్రాయాలను బట్టి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంధంలో ఇద్దరు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు మోషే మరొకరు అపో.పౌలు.

స్నేహితులను విడనాడి రావడానికి మోషే కూడా గొప్ప వేదనను వ్యక్తపరిచాడు. దేవునిని సీనాయి పర్వతంపై కలుసుకోడానికి వెళుతున్నప్పుడు, బంగారు దూడను ఆరాధించిన సోదరుడిని, సోదరిని, ఒక జనాంగాన్ని కోల్పోతానన్న ఆలోచన ఎదురైనప్పుడు (నిర్గమ 32:32) లో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, “నా” అనేవారు నాశనమవ్వకూడదని మోషే దేవునితో చేసిన విజ్ఞాపన నాకు ఆశ్చర్యాన్ని కలిగజేసింది. అతడు తన వారి విషయమై ఎంతగా చింతుస్తున్నాడో వ్యక్తపరుస్తూ, “అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నా”నని అంటూ ఆ శిక్షనంతా తనపై వేసుకునే గొప్ప మనసు మోషే కలిగియున్నాడు. 

అపో.పౌలు కూడా తన స్నేహితులైన ఇశ్రాయేలీయులను గూర్చి చింత కలిగి ఏంతో భావోద్వేగానికి గురై, బహు దుఃఖము, హృదయంలో వేదన కలిగి (రోమా 9:3) “పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును” అని అంటూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములులన్నిటికీ అర్హులైనటువంటివారు నాశనమవ్వకూడదని ఎంతో వేదన కలిగియున్నాడు.

మోషే మరియపౌలు వీరిరువురు తమ స్నేహితులైనవారిని గూర్చియే చింత కలిగి క్రీస్తు యేసు మనసు కలిగియున్నారు. అయినా వారు చూపించిన ప్రేమను, అర్పింపగలిగిన అర్పణను, విజ్ఞాపనలను యేసు క్రీస్తు మనలను విడనాడకుండా నీతో నాతో ఎల్లప్పుడు ఉండుటకు మనకు రావలసిన శిక్షను తానే భరించి తనను తాను సిలువపై అర్పించుకొని, తనకున్న స్నేహాన్ని ఋజువు చేశాడు. క్రీస్తును ఎరుగని మన స్నేహితుల గురించి ఎప్పుడైనా ఆందోళన  కలిగియున్నామా? “నా” అనేవారు నాశనమవ్వకూడదని వారి రక్షణ కొరకు ఎప్పుడైనా ప్రార్ధన చేస్తున్నామా? మనం పొందిన సువార్త ఆనందాన్ని మన స్నేహితులతో పంచుకుంటున్నామా? ఒకసారి ఆలోచనచేద్దాం. ఆమెన్.

https://youtu.be/_Vg9ciROPqk