అతి చిన్న విషయంలో..!


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

అతి చిన్న విషయంలో..!

ఏదైనా విలువైనవి, ఖరీదైనవి, ప్రాముఖ్యమైనవి పొందుకోవాలంటే వాటికోసం ప్రయాసపడడమే కాకుండా ఒక్క క్షణం ఆగి దేవుని వైపు ప్రార్ధనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము. అవసరమైతే వాటిని పొందుకోవడం కోసం ఉపవాసమైనా ఉంటాము. ఎందుకంటే మనం విశ్వసించే దేవుడు మనకు తప్పకుండా దయజేయగలడు అనే నమ్మకం మనకుంటుంది. అవును, సుసాధ్యమైనవి సాధ్యమైనప్పుడు దేవుని స్తుతించకుండా ఉండగలమా!.

నేనంటాను, ప్రాముఖ్యమైన వాటికోసమే దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ, కేవలం వాటిని పొందుకున్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండడం కాకుండా, మన జీవితంలో పొందుకునే చిన్న చిన్న విషయాలలో, బహుమతులలో, సంతోషంలో కూడా దేవుని స్తుతించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎవరైనా మీకు చిన్న బహుమతి ఇచ్చినప్పుడు, చిన్న చిన్న విషయాలలో విజయం పొందినప్పుడు, మంచి భోజన పదార్థాల ద్వారా తృప్తి పొందినప్పుడు, సుఖమైన నిద్రలో సేదదీరినప్పుడు... ఇలా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కృతజ్ఞత కలిగియుండమని, అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ వారికి అనుగ్రహించబడిన వాగ్ధాత్త దేశంలోనికి నడిపించబడిన ఇశ్రాయేలీయులకు మోషే నేర్పించాడు. “నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.”(ద్వితి 8:10).

దేవుడు ఉచితముగా వారికి అనుగ్రహించిన ఆశీర్వాదాలను ఎన్నడు మరువక, వారికి ఇచ్చిన దేశమును బట్టి, వారు పొందుకున్న స్వాస్థ్యమును బట్టి, మరియు ప్రతి విషయమునందు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే అలవాటు కలిగియుండమని ప్రాధేయపడ్డాడు. ఆనాటినుండే యూదులు మరియఇశ్రాయేలీయులు, అది ఎంత చిన్నదైనా గాని ప్రతిసారి భోజనం చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టారు.

మన కుటుంబాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, మనకు కలిగినదానిలో సంతోషిస్తూ, మనం పొందుకుంటున్న అతి చిన్న విషయాలలో, అది ఎంత చిన్నదైనా గాని ప్రతిసారి భోజనం చేసేటప్పుడు, పడుకున్నా లేచినా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆనాడు మోషే నేర్పించిన విధానాన్ని నేడు మనమును అలవరచుకోమని ప్రభువు పేరట వినయముగా ప్రార్ధిస్తూ ఉన్నాను. ఆమెన్.

https://youtu.be/jVLizOZq0pU