మౌనధ్యానం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మౌనధ్యానం

వాస్తవంగా నేటి దినములలో మనము ఎక్కువ సమాచారాన్ని సృష్టించాము. మరో విధంగా చెప్పాలంటే మనము జీవించే ఈ యుగం సమాచారం అధికంగా ఉన్న యుగం అని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అధిక ఉత్తేజానికి బానిసలమై పోయాము. ఆధునికతలో మనకు చేరువయ్యే వార్తలు మరియు జ్ఞానము యొక్క నిరంతర దాడి మన మనసులను నియంత్రించగలవు.

ప్రసార మాధ్యమాలచే నిరంతరం ముట్టడి చేయబడుతున్న నేటి పరిస్తితులలో, రాను రాను ప్రశాంతంగా ఉండడానికి, ఆలోచించడానికి, ప్రార్ధించడానికి కష్టమైపోతూ, ప్రభువుపై దృష్టిని నిలపడము కష్టరంగా మారుతుందని నా అభిప్రాయం. ఈ సందర్భాలు ప్రభువుపై దృష్టిని నిలపకపోగా భయాన్ని ఆందోళనను కలిగిస్తూ అనుదిన జీవితంలో కాస్త వెలితి ఎదురవుతుంది. మీరేమంటారు?

ప్రభువుపై దృష్టిని నిలపడము యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది కీర్తన 46:10 “ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”. అవును ప్రియమైన వారలారా, బైబిలు చదివి, ప్రార్ధించి, దేవుని మంచితనాన్ని, గొప్పతనాన్ని గురించి ఆలోచించడానికి కొన్ని సార్లు మౌనంగా ధ్యానించే సమయం (Quiet Time) అన్నది ప్రతి దినములో ప్రాముఖ్యమైన భాగమని గ్రహించాలి.

ఇటువంటి మౌనంగా ధ్యానించే సమయాల్లో దావీదు వలే మనము కూడా “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు (కీర్తన 46:1)” అన్న వాస్తవాన్ని గుర్తిస్తే, అది మనలోని భయాన్ని ప్రారద్రోలి, లోకము యొక్క గందరగోళమునుండి దేవుని సమాధానానికి మన దృష్టిని మళ్ళించి, ప్రతీది మన ప్రభువు స్వాధీనములో ఉన్నది అన్న నెమ్మదితో కూడిన నిశ్చయతను మనకు కలుగజేస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత గజిబిజిగా ఉన్నా మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమలో, శక్తిలో నెమ్మది, బలాన్ని తప్పక పొందుకోగలం. ఆమెన్.

https://youtu.be/MO-g4_J69ps