హెబ్రీ పత్రిక ధ్యానం


  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Volume 2 Issue 2 - Feb Mar 2012

అధ్యాయాలు 13 వచనములు 303

రచించిన తేది : క్రీ.శ. 70

మూల వాక్యాలు :హెబ్రీయులకు 1:3-4 “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునై యుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను.”

హెబ్రీయులకు 11:1 “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.”

హెబ్రీయులకు 13:8యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. “

రచించిన ఉద్దేశం: హెబ్రీ పత్రిక యేసు క్రీస్తును గూర్చి ఎన్నో సంగతులను బోధిస్తుంది. ఈ పత్రికను వ్రాసిన వారు ఎవరో తెలియనప్పటికీ, వ్రాసిన శైలిని ఆధారం చేసుకొని అపో.పౌలు ఈ పత్రికను వ్రాసియుండవచ్చు అని నిర్ధారించారు. ఈ పత్రిక అతి ప్రాముఖ్యమైన పత్రికగా ఎంచబడినది, ఎందుకనగా పరిశుద్ధ గ్రంధంలో ఉన్న అనేక సంగతులను క్లుప్తంగా తెలియజేసే గ్రంథమిది. అంతేకాకుండా యేసు క్రీస్తని ఆయన దేవునిదూత కాడని లేదా దేవుని యొక్క సేవకుడు కాదని, ఆయన దేవుడని తెలియజేస్తుంది. పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు నరావతారిగా జన్మించి; ప్రాధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని తెలియజేస్తుంది. అయితే అనాదిలో అనగా పాత నిబంధన కాలంలో యాజకులు ప్రజల యొక్క పాపమును పరిహరించుటకు జంతువులను బలి ఇచ్చేవారు. అయితే మన పాపములకు అపరాధములకు క్రీస్తు బాధించబడి కలువరి సిలువ బలిపీఠంపై మరణించాడు. ఆ సిలువ మరణాన్ని దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోక పాపమును పరిహరించడమే కాకుండా ఎవరైతే ఆయనయందు విశ్వాసము కలిగియుంటారో వారు ఆయనతో నిత్యత్వంలో ఉంటారు అని వివరిస్తుంది ఈ పత్రిక. పాత నిబంధన కాలంలో అనేక మంది విశ్వాసంతో జీవించారు; అనేక శ్రమలు కలిగినా ఆదే విశ్వాసంలో జీవించారు (హెబ్రీ 11,12 అధ్యా), అట్టి విశ్వాసం మనము కూడా కలిగియుండాలి అని వివరిస్తుంది ఈ గ్రంధం.

ఉపోద్గాతం :

అనాదిలో దేవుడు ప్రవక్తల ద్వారా అనేక రీతుల్లో మాటలాడిన దేవుడు, అంత్య దినములలో తన కుమారుని ద్వారా మనతో మాటలాడుతున్నాడు. దేవుడు తన కుమారునికి సార్వభౌమాదికారాన్ని ఇచ్చి ఘనపరచి సృష్టంతటిని క్రమపరచాడు. దైవ కుమారుడు తనకు తానుగా అర్పించుకొని మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేసి తండ్త్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు.

పాత నిబంధన కాలంలొ దేవుని ఆజ్ఞలను మీరి అతిక్రమము వలన అవిధేయత వలన జీవించిన వారు తగిన ప్రతిఫలం పొందారు. అయితే మంటి మాత్రులమైన మనలను దేవుడు జ్ఞాపకము చేసుకొనుటకు తగిన వరామా? కాదు కదా!. అట్టి మనలను దేవదూతల కంటే తక్కువ వానిగా చేసి మహిమాప్రభావములతో కిరీటమును ధరింప జేసి, దేవుని చేతితో చేయబడిన సృష్టంతటిపై అధికారమిచ్చాడు. అట్టి కృపకు దూరస్తులైన మనకొరకు దూతలకంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు ద్వారా సమీపస్తులుగా చేయబడ్డాము; ఎట్లనగా పాపములవలన మనము పొందవలసిన మరణమును అనగా జీవితకాలమంతా మరణ భయముచేత దాసత్వములో ఉన్నవారిని విడిపించుటకు ఆయన మనకొరకు మరణించి ఉచితముగా మనకు రక్షణ ఇచ్చి పోగొట్టుకున్న ఆ స్వాస్థ్యాన్ని తిరిగి అనుగ్రహించాడు. ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లు, క్రీస్తు కూడా దేవుని కుమారుడైయుండి ఆయన యింటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను కలిగియున్న మనకు తుదమట్టుకు స్థిరముగా యున్న యెడల మనము ఆయన ఇల్లు. నలుబది సంవత్సరములు ఇశ్రాయేలీయులు తమ హృదయాలోచనలతో దేవుని మార్గాముల నుండి తప్పిపోయి ఆయనను విసిగించి శోధించి కోపము పుట్టించినవారై పొందవలసిన స్వాస్థ్యమును పొందలేక అరణ్యములొ రాలి పోయారు. అయితే వారివలె ఉండకుండా ధృఢ విశ్వాసాన్ని అంతమువరకు కలిగియుండి క్రీస్తులో పాలివారమై యుండవలెనని గ్రహించాలి. అట్టి విశ్వాసం కలిగి, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును అని తెలుసుకొనవలెను. కాబట్టి అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడవలెను.

మనుష్యులలో నుండి అర్పణలను అర్పించుటకు యేర్పరచబడిన ప్రధానయాజకుడు బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూప గలవాడై యున్నాడు. అందుకనిన అతడు తన పాపములకొరకు ఇతరుల పాపముల కొరకు అర్పణము చేయవలసిన వాడైయున్నాడు. అయితే క్రీస్తు ప్రధాన యాజకునిగా తనను తాను మహిమపరచుకోలేదు గాని తండ్రి ద్వారా మహిమపరచబడ్డాడు; తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొని మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. నీతి విషయంలో అనుభవం లేని మనము దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోవలెనని ప్రభువు కోరుచున్నాడు. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోaయినయెడల దేవుని మహా ఉగ్రతకు లోనైన వారమగుదుము, అంతే కాక క్రీస్తును మరలా సిలువ వేయుచున్నామని గ్రహించాలి. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపన కలుగదు అయితే క్రీస్తు రక్తము వలన అట్టి రక్షణకు మనము పాత్రులము అని రూఢిగా చెప్పవచ్చు.

ఈ పత్రికలో విశ్వాసమును గూర్చిన ఎన్నో సంగతులు మనకు తెలుపబడినవి. విశ్వాసానికి నిజమైన నిర్వచనం హెబ్రీయులకు 11:1 “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది”. అబ్రాహామును మొదలుకొని అట్టి విశ్వాసమందు నిరీక్షణతో నిలకడ గలిగి జీవించిన విశ్వాస వీరుల పట్టికలో (హెబ్రీ 11వ అధ్యా) లొ గమనించగలం. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అని తెలియజేస్తుంది ఈ పత్రిక.

సారాంశం: రక్షణ అను మాట ప్రస్తుత స్థితిని మరియు ముందున్న జీవితమును గూర్చి సూచిస్తుంది. హెబ్రీ పత్రిక ఇట్టి రక్షణను ఉద్దేశిస్తూ “ఎవరైతే ఈ రక్షణను కలిగి యుంటారో” అనే అంశంపై అధికముగా ప్రస్తావించింది. సిలువ ద్వారా గాని లేదా విశ్వాసము ద్వారా గాని కలుగు రక్షణ అతీతమైనది. ఒకనాడు నిత్యత్వం లో ఉంటాము అనే నిరీక్షణ ఈ రక్షణ నుండే కలుగుతుంది. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ తిరిగి ఆశించకుండా అనుదినము నడుచుకోనవలెనని ఈ గ్రంథం ద్వారా తెలుసుకొనగలుగుతున్నాము. అట్టి పరిమాణము లేని ధృఢమైన విశ్వాసముతో అంతము వరకు జీవించే కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.