ప్రార్ధన, వాక్యము

  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General

ప్రార్ధన ప్రాముఖ్యమైనదా?
వాక్యము ప్రాముఖ్యమైనదా?
ఏది ప్రాముఖ్యమైనది?

నీకున్న రెండు కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే? ఏమి చెప్తావు?

ప్రార్ధన, వాక్యము రెండూ రెండు కళ్ళ వంటివి. రెండూ అత్యంత ప్రధానమైనవే. దేనినీ అశ్రద్ధ చెయ్యడానికి వీలులేదు.

"వాక్యము" ద్వారా దేవుడు మనతో మాట్లాడితే? "ప్రార్ధన" ద్వారా మనము దేవునితో మాట్లాడుతుంటాము. అందుచే,
వాక్యమును ధ్యానిస్తూనే ప్రార్ధించ గలగాలి.

క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదానిలో ఒకటి. అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్నదానిలో ఒకటి. "ప్రార్థన"

ప్రార్థన అంటే? దేవుని సహాయమును అభ్యర్దించడం

ప్రార్థన అంటే? మనకు వచ్చినట్లు నచ్చినట్లు చేయడంకాదు.
దేవుడు వినేటట్లు , ప్రతిఫలమిచ్చేటట్లు ప్రార్ధించాలి.

నీ ప్రార్థనకు సమాధానం రావడం లేదంటే? రెండే కారణాలు.
1. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో?
2. దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో వున్నావేమో?

దేవుని యొక్క ధనాగారాన్ని, సర్వ సంపదలనిధిని తెరువగలిగే అత్యంత శక్తివంతమైన తాళపుచెవి "ప్రార్ధన".

అయితే, ఆ తాళపు చెవిని ఎట్లా ఉపయోగించాలో తెలియాలి.

.....రహస్య ప్రార్థన....
(ఇది వ్యక్తిగతమైనది)

నీప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే? ప్రార్ధించే నీవు దేవునిచే అంగీకరించబడాలి. అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రతిఫలం వస్తుంది.

నీవు దేవునిచేత ఎట్లా అంగీకరించబడతావు.?
రహస్య ప్రార్థన ద్వారా.

నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు "చూచు" నీతండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
మత్తయి 6:6

రహస్య ప్రార్థన లో దేవుడు నీప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. "చూస్తాడట".
ఏమి చూస్తాడు? నీహృదయాన్ని చూస్తాడు. నీ ప్రతీ పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నావో? లేక కప్పుకున్నావో?అని. కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు.

కనీసం ఇప్పుడైనా ఒప్పుకొనే ప్రయత్నం చేద్దాం..!
ఒప్పుకోవడానికి భయమెందుకు.? నీ జీవితం అంతా ఆయనకు తెలుసు.

దావీదు అంటున్నాడుకదా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపుపుట్టకముందే నీవు నామనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్దనుండి నేనెక్కడకు పొవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును.?
కీర్తన 139:2,7.

నీప్రతీ కదలిక ఆయనకు తెలియును. ఏమి తెలియని వాళ్ల దగ్గర నటించవచ్చు. అన్నీ తెలిసిన వాళ్ల దగ్గర నటించడం సాధ్యం కాదుకదా? అట్లాంటప్పుడు, ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన పనిలేదు. ఎంత ఘోర పాపినైనా? ఆయన క్షమించి రక్షిస్తాడు.

గతంలో చేసిన పాపములను ప్రతీసారి సాతాను ఙ్ఞాపకములోనికి తీసుకొచ్చి నీవు ఆతప్పు చేసావు. ఈతప్పు చేసావంటూ నిన్ను కృంగదీస్తూంటాడు.

అయితే నీవు ఒకసారి ఒప్పుకొన్న పాపాలను ప్రతీసారి ఒప్పుకోనవసరం లేదు అట్లా చేస్తున్నావంటే. నీ పాపమును దేవుడు క్షమించాడు అని నమ్మకం నీకులేనట్లే.

ఈరహస్య ప్రార్థన అనుభవం నీ జీవితం అంతా కొనసాగాలి... ఎందుకంటే?

మన చూపులు, తలంపులు, క్రియలు పరిశుద్దమైనవి కావు. అందుకే, అనుదినం రహస్య ప్రార్థన మన జీవితం లో వుండాలి.

అట్లాఅని, అనుదినం తప్పుచేస్తూ ఒప్పుకొంటూ వుండకూడదు. ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి.అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. నీవు చేసిన ప్రార్థన దేవునిచేత అంగీకరించబడి, ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది.

నీ కన్నీరు తుడవబడాలి అంటే?
కన్నీటి ప్రార్దనే శరణ్యం.
ఆ కన్నీరు కార్చేముందు
రహస్య ప్రార్ధనలో నీ హృదయం కడుగబడాలి.

కల్వరిలో నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యచూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాలచెంత కృమ్మరించు.
ఆయన బిడ్డగా మార్పు చెందు.
ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు!

అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక..!

ఆమెన్!