దేవుని వలన కృప పొందిన స్త్రీ


  • Author: Mercy Ratna Bai Shadrach
  • Category: Women
  • Reference: Bible Women

లోకరక్షకుని జనన కాలంలో దేవుని కృపపొందితి అని దేవదూత ద్వారా కొనియాడబడిన స్త్రీ యేసు తల్లియైన మరియ. (లూకా 1:30) కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి “ఇమ్మానుయేలు” అను పేరు పెట్టబడును అనే ప్రవచనము క్రీస్తుకు పూర్వం దాదాపు 700 సం||ల క్రిందటనే ప్రవచింపబడినది. (యెషయా 7:14) దాని నెరవేర్పు క్రొత్తనిబంధనలో ఈ రీతిగా జరిగింది.

గబ్రియేలు దూత ద్వారా దేవుడు తన చిత్తాన్ని గలిలయలోని నజరేతు గ్రామ నివాసియైన 17 సం||ల ప్రాయంలో ఉండి యోసేపు అను పురుషునికి ప్రధానం చేయబడి పవిత్రురాలైన కన్య మరియకు బయలు పరచబడింది. “మరియా, భయపడకుము! దేవుని వలన కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును” (లూకా 1:30,33) ఈ మాట మరియకు భయాన్ని కలిగించగా అవిశ్వాసివలె నేను కన్యను. పురుషుని ఎరుగనిదానను నాకు ఇది ఎలా సంభవము? అని దూతను ప్రశ్నించింది. అందుకు దూత పరిశుద్ధాత్మ వలననే నీవు గర్భం ధరిస్తావని చెప్పి ఇంకనూ ఆమెను ధైర్యపరచడానికి ని బంధువురాలును, వృద్ధురాలునైయున్న గోడ్రాలని పిలువబడే ఎలీసబెతు కూడా గర్భము ధరించియున్నది. అమెకిప్పుడు ఆరవ మాసం అని చెప్పినప్పుడు, విశ్వాస-ముంచుటయందును, ఆయన మాటలు విని లోబడుటయందును ఆసక్తిగల మంచి స్వభావమున్న మరియ భయాన్ని, బిడియాన్ని సంఘబహిష్కరణను లెక్కచేయక ఇదిగో ప్రభువా! నీ దాసురాలను నీ చిత్తం చొప్పున జరుగునుగాక! అని ఆయన మాటకు విధేయత చూపింది. (లూకా 1:38) ప్రభువు తల్లిగా వాడబడుటకు పూర్ణాంగీకారాన్ని తెలియజేసింది, ధన్యురాలైంది. మనం కూడా మన దేహమనే దేవాలయంలో ఆయన్ను చేర్చుకోడానికి అంగీకరిస్తున్నామా?

హృదయమనే ద్వారం వద్ద నిలుచుండి ప్రభువు తట్టుచుండగా దానిని తెరచి మరియ వలె ఆయనను మనలో చేర్చుకుంటున్నామా? మన దేహము దేవుని ఆలయమని గ్రహించిననాడే నిజమైన క్రిస్మస్ అని ప్రతివారు గ్రహించాలి.

బంధువురాలైన ఎలీసబెతును చూడడానికి యూదా దేశముచేరి, వృద్ధురాలికి అభివాదము చేయుచున్న మరియ స్వరాన్ని విన్న గర్భస్త శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ప్రభువు తల్లిని చుచాననే ఆనందాన్ని తల్లి గర్భంలో ఉండగానే ఆయన అనుభవించాడు. క్రైస్తవ బిడ్డలమైన మనం బంధుమిత్రులను, ఇరుగు పొరుగువారిని కలిసినప్పుడు ఇట్టి ఆనందాన్ని పొందుతున్నామా? లేదా? అని ప్రశ్నించు-కుందాం.

పశుపాకలో లోకరక్షకుడు జన్మించగానే ప్రకృతి పులకించింది. ప్రకాశ-వంతమైన నక్షత్రం పాకపై వెలసింది. కాపరులు, జ్ఞానులు ఆరాధించి కానుకలర్పించారు. పరలోక సైన్యం పాటలు పాడారు. ఇన్ని జరిగినా మరియ ఈ ఘనతంతా దేవునిదే నేను యిహలోకపు తల్లిని మాత్రమే అనే సత్యాన్ని మరువలేదు. నీతిమంతుడైన యోసేపు, మరియలు ప్రభువును దేవునిదయలోనూ, మనుష్యుల దయలోనూ పెంచారు.

మరియ యోసేపుతో సాంసారిక జీవితాన్ని కొనసాగించి యాకోబు, యోసేపు, సీయోను, యూదా అను కుమారులను, కుమార్తెలను కూడా పొందియున్నది. కుటుంబ భారము ఎక్కువగా వరపుత్రుడైన యేసుపైననే మోపబడినట్లు గ్రంధములో వ్రాయబడినది. యోసేపు మరణానంతరం వడ్రంగి పనిచేయుచూ ప్రభువు కుటుంబాన్ని పోషించాడు. 30 యేండ్ల ప్రాయం వచ్చే వరకు కుటుంబ సభ్యులను పోషించిన ప్రభువు తన తండ్రి కార్యములు నెరవేర్చడానికి పూనుకున్నాడు. మరియ కూడా ఆయన శిష్యులతో 31/2ల సం||లు తిరిగింది. (అపో. 1:14) ప్రభువు అందరి స్త్రీలవలెనే ఆమే యెడల కూడా జరిగించాడు కాని ప్రత్యేకించి చూడలేదు. కానా వివాహంలో ద్రక్షారసమై -పోయినప్పుడు తల్లి విజ్ఞప్తి చేయగా “నాతో నీకేమి పని? నా సమయమింకా రాలేదు అన్నాడు” (యోహాను 2:4) మరియొక సందర్భంలో నీ తల్లియు, సహోదరులు వెలుపలనున్నారని చెప్పిన వ్యక్తితో పరలోక-మందున్న నాతండ్రి చిత్తప్రకారం చేయువారే నా తల్లి, సహోదరులు అని చెప్పాడు. (మత్తయి 12:46-50)

నవమాసాలు మోసి బాధకోర్చి, కని 30సం||ల వరకు ఒకే చోట జీవించి 3 1/2 సం||లు ఆయనతో పాటు తండ్రి సేవలో తిరిగిన మరియకు తన ప్రియాతి ప్రియమైన కుమారుడు సిలువ మ్రానుపై దారుణహింసలు, బాధలు పొందుచుచూచినా ఆమె హృదయవేదన ఎంతగా ఉన్నదో వర్ణించగలమా! తనకు కలిగే బాధలు, జబ్బులు ఒంటరిగా భరించగలుగుతుంది. గాని బిడ్డలు పడే బాధలు మాతృమూర్తి చూస్తూ సహించలేదు. సుమెయోను ప్రవక్త పసిబాలుని చూచి పలికిన ఆ ఖడ్గము తల్లి హృదయంలోకి దుసుకోనిపోగా ఆమె కన్నీరు మున్నీరుగా సిలువచెంత విలపించింది.