యేసును గూర్చి సాక్ష్యమిచ్చిన నక్షత్రం

  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

 వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండినచోటికి మీదుగా వచ్చి నిలిచువరకు వారికి ముందుగా నడిచెను. ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:9-11

ఈ దినాలలో ప్రజల ఆశలు, కోరికలను విభిన్నరీతులలో మనము చూస్తుంటాము. ఉన్నాలేకపోయినా ఏదోఒకటి పొందాలని దానికొరకు అవిశ్రాంతముగా పోరాడుచూ దానిని వెదకి కనుగొనాలని ఆరాటపడేవారిని ఎంతో మందిని చూస్తుంటాము. అయితే బైబిలు గ్రంథములో తపనతో, ఆశతో క్రీస్తును వెదకి, చూచి, సంతోషించిన ముగ్గురు జ్ఞానులను గురించి మనము ధ్యానిద్దాము. వారు నక్షత్రమును చూచి యేసు యొద్దకు నడిపించబడ్డారు. వారిని నడిపించింది నక్షత్రమే అయినా వారి వెనుక వుండి కార్యమును జరిగించింది దేవుడే. ఇది మన కన్నులకు ఆశ్చర్యమే. దేవుడు కొన్నిసార్లు సృష్టిలో దేనినైనా ఉపయోగించుకుని తన కార్యమును జరిగించగలడు. ఇక్కడైతే దేవుడు వాడుకొనినది ఆకాశములోని నక్షత్రమునే. కీర్తనకారుడు 19:1,2 వచనాలలో ఇలా వ్రాశాడు. ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి అన్నీ కూడా సృష్టిలో భాగమే. ఇవన్నీ కూడా దేవుని గూర్చి సాక్ష్యమిచ్చినట్లు మనము చూడగలుగుతాము. అయితే ఆకాశములో వుండే నక్షత్రములు కూడా దేవుని మహిమపరచడం గొప్ప విషయమే. జ్ఞానులకంటే మొట్టమొదట సాక్ష్యమిచ్చింది సృష్టేయని ఆదికాండము 1 అధ్యాయములో చూడగలము. కనుక సృష్టియందలి సమస్తము దేవుని గురించి సాక్ష్యమిచ్చినప్పుడు మరి నీ స్థితి ఏమిటి? నీ జీవితములో ఎప్పుడైనా దేవుని గూర్చి ఎక్కడైనా సాక్ష్యమిచ్చావా? ఇంతవరకు ఇవ్వకపోతే ఈ సందేశము చదివిన తర్వాతనైనా ఆయన గురించి సాక్ష్యమిచ్చి దేవునిని మహిమపరచుము. రోమా 1:20-23 వరకు మనము గమనిస్తే దేవుని అదృశ్యలక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు ఆయన దేవత్వమును సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన మనము తెలుసుకుంటాము. కాబట్టి వ్యర్థమైనవాటియందు మనస్సునుంచక దేవుని యెరిగి ఆయనను దేవునిగా మహిమపరిచి కృతజ్ఞత చెల్లించుచూ ప్రభువును నిత్యము ఆరాధించుదుముగాక.

శిశువును చూచినా జ్ఞానులు

     జ్ఞానులు చాలా గొప్ప జ్ఞానం కలిగినవారు. ఎందుకనగా వీరు ఖగోళ శాస్త్రమును బహుగా ఎరిగినవారు సృష్టిలోని ప్రతిదీ పరిశోధించి తెలుసుకునేవారు. అందుకే యేసు పుట్టగానే నక్షత్రము ద్వారా యేసు ఇంటికి నడిపించబడి అత్యానందభరితులైరి. దీనిని బట్టి సృష్టిలో జరిగే ప్రతిదీ వీరు క్షుణ్ణంగా ఎరిగియున్నారనడానికి ఇదే నిదర్శనము. ఇలాంటి అరుదైన సంఘటన చరిత్రలో ఎప్పుడు జరగలేదు. వారికి మనకు ఆశ్చర్యమే. అంతేకాక వారు తల్లియైన మరియను శిశువును చూచినప్పుడు ఆశ్చర్యపోయారు. మన జీవితములో కూడా అనేకమైన విషయాలు వింటుంటాము. చూచినప్పుడు ఆశ్చర్యపోతాము. వీరు ఎంతగొప్ప అనుభూతి పొందారో!

     ప్రియ చదువరి! మన దైనందిన జీవితములో ఎన్నోసార్లు ఎన్నెన్నో చూస్తుంటాము, ఎన్నెన్నో వింటుంటాము. అయితే వాటిని బాగా గుర్తు పెట్టుకుంటాం. అయితే మనం వినినను, చూచినను మరిచిపోయేది దేవునిని, దేవునియొక్క వాక్యాన్ని. నేటి క్రైస్తవ్యం ఈ స్థితిలో వుందో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

జ్ఞానులు ఆరాధించింది యేసునే

     ఇచ్చట జ్ఞానులు తల్లియైన మరియను చూచి ఆ తరువాత యేసుకు సాగిలపడి పూజించి, ఆరాధించిరి అని మత్తయి 2:11వ వచనములో చూస్తాము. ఈ లోకములో ఆరాధనకు యోగ్యుడు యేసు ప్రభువు మాత్రమే. చాలాసార్లు మన జీవితాలలో ఎవరిని ఆరాధించాలో తెలియక ఎవరిని పూజించాలో తెలియక ఆరాధనకు యోగ్యులుకాని వారిని అనేకసార్లు ఆరాధిస్తుంటాం. చాలాసార్లు దేవుని బిడ్డలైనవారు సహితము కొన్ని సందర్భాలలో దేవున్ని పక్కకుపెట్టి తమ తల్లిదండ్రులను ఆరాధిస్తుంటారు. ఇది ఒక చెడు ఆచారం. ఇలాంటి చెడు సంస్కృతి నుండి మనం బయటపడాలి. ఇలాంటివి మనము ఆచరించ కూడదని మత్తయి 15:6లో చూస్తాము. అలాంటివారిని దేవుడు వేషధారులు అని పిలుస్తున్నాడు. అంతేకాక పరలోకమునకు అస్సలే చేర్చబడలేవు. ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు, అభిషిక్తుడైన యేసుక్రీస్తు మాత్రమే.

     దేవుని యెరుగని సమరయ స్త్రీకి దేవుడిచ్చిన బలమైన సందేశము యోహాను 4:24లో చూస్తాము. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను. ఈ నిజమైన ఆరాధన నీలో ఉందా?

యేసుకు కానుకలు సమర్పించిన జ్ఞానులు

నక్షత్రముచేత నడిపించబడిన తల్లియైన మరియను, శిశువును చూచి సాగిలపడి పూజించడం ఒకయెత్తైతే ఆ శిశువునకు కానుకలు సమర్పించడం మరి గొప్ప విషయం. కేవలం చూచి వెళ్ళవచ్చుగాని వారు శ్రేష్టమైనటువంటి వాటిని యేసుకు కానుకలుగా సమర్పించిరి. నేటి దినాలలో మనం దేవుని దగ్గర నుంచి అన్ని రకాల ఆశీర్వాదములు పొందుకుంటాం కానీ దేవుని స్తుతించటం, దేవుని ఘణపరచటం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయనకు కానుకలు సమర్పించటం మన జీవితములలో వుండదు. పొందడానికి చూపించే ఆసక్తి ఇచ్చే విషయంలో చూపించం. దేవుడు చేసే మేలులనుబట్టి జీవితకాలమంతా ఆయనకు విధేయులమై జీవించాలి. మనము చేయవలసినవేవనగా:
1) మన జీవితములను దేవునికి సమర్పించాలి. ఎందుకనగా దేవుడు వెలపెట్టి మనలను కొన్నందుకు.
2) నీ హృదయము దేవుని ఆలయము కాబట్టి ఆ హృదయములో దేవుడే నివసించాలి.
3)దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు మీ సంపాదనలో ఆయనకు దశమభాగము చెల్లించాలి. నీవు ఇస్తే దీవించబడతావు. 2కొరింథీ 9:7 ఆ సత్యాన్ని తెలుసుకుంటాం.
కావున జ్ఞానులవలె మనము తగ్గించుకుని దేవుని వెదకి ఆయనను కనుగొని, ఆరాధించి, ఆయనకు కానుకలు సమర్పిస్తే అదే నిజమైన క్రిస్మస్ దేవుడు మిమ్మును దీవించునుగాక.