ప్రస్తుత దినముల లోతు దినముల వంటివి


  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

క్రీస్తునందు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రస్తుతం దినముల గురించి ఎవరి అభిప్రాయము వారు చెప్పుతుంటారు. చాలామంది చెప్పేది ఒకటే. రోజులు బాగా లేవు జాగ్రత్త అంటారు. రోజులు మునుపటిలాగా ఉండవు. అంతా గందరగోళం అస్తవ్యస్తంగా ఉంది అంటారు. ఇవన్ని చూస్తే శాంతి సమాధానాలు కరువైన రోజులుగా ఈ దినాలు అభివర్ణించవచ్చు.

నాటి దినములకు నేటి దినములకు చాలా వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు. ప్రజల మనస్తత్వము లో చాలా మార్పులను చూడగలుగుతాము. ఇంకా లోతుగా వెళ్తే ప్రజలు నైతిక విలువలు కోల్పోయి అనైతికంగా ప్రవర్తిస్తున్నారు.పాతనిబంధన కాలము నుండి నేటి వరకు ప్రజల మనస్తత్వ ములో ఏ మార్పు  కనబడటము లేదు. పాపములు విడిచిపెట్టమని ప్రవక్తలు బోధించినా, నేటి కాలంలో అనేకమంది దైవ సేవకులు క్రీస్తు బోధలు వినిపించినా, చాలామంది పాపములు జీవిస్తున్నారు. క్రీస్తు బోధ విని కూడా మార్పు చెందకుండా జీవించేవారిని చాలా ఎక్కువ మందిని చూస్తున్నాము.

ఆదికాండము 19వ అధ్యాయమంతా చదివితే లోతు దినాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అబ్రాము తన జీవితములో దేవుని సంకల్పము ప్రకారము దేవుని ఆజ్ఞ మేరకు కల్దీయుల ఊరను పట్టణము నుండి తన కుటుంబముతో బయలుదేరి కనాను లోని హారాను అను పట్టణము చేరి అక్కడ జీవించేను. అక్కడే తన తండ్రి మరణించినట్లు చూస్తాం. అక్కడ నుండి బయలుదేరి ప్రయాణమై పోవుచుండగా దేవుడు ప్రత్యక్షమై యెహోవా దేవునికి ఒక బలిపీఠమును కట్ట మనగా అక్కడ బలిపీఠము కట్టెను. మరలా దేవుడు ప్రయాణములో ప్రత్యక్షమై మరల బలిపీఠము కట్టమన్నప్పుడు మరలా కట్టెను. తన ప్రయాణములో తనతో కూడా లోతు కుటుంబము ఉన్నది. ఈ ప్రయాణము ద్వారా  అబ్రాహాముకు విశ్వాసమనే పాఠశాలలో దేవుడు నేర్పుతున్న పాఠాలు నేర్చుకుంటున్నాడు. అపజయము, విజయము, తన విశ్వాసమనే పరీక్షలో నేర్చుకుంటున్నాడు.ఇదిలా ఉండగా అబ్రాము తన తప్పును కూర్చి పశ్చాత్తాప పడి నప్పుడు లోతు పశువుల కాపరులకు, అబ్రాము పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఈ ప్రయాణంలో జరిగిన ఈ కలహము ద్వారా అబ్రహాము లోతును విడిచి ప్రత్యేకముగావెళ్ళిపోవాలనుకున్నాడు. అందుకే లోతు తో ఇలా అన్నాడు -అది 13 :9 లో ఈ విషయాన్ని మనం గమనించగలం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అన్న మాటకు లోతు అంగీకరించి తన దృష్టిలో దేవుని తోటవలె కనబడిన సొదొమ గొమొఱ్ఱా పట్టణాన్ని ఎంచుకున్నాడు.

సొదొమ గొమొఱ్ఱా ఎలాంటిది?:

జిల్లాలలోని,మండలాలు, గ్రామాల కంటే పెద్దది పట్టణము. దిగువ గ్రామాలలో నుండి అందరు పట్టణములోని కి వచ్చి జీవించుచున్నారు. దీనిని మనం నేడు మనం కళ్లారా చూస్తున్నాము. అన్ని సౌకర్యాలు కలిగి ఉండేదే పట్టణం. అందుకే కాబోలు సొదొమ గొమొఱ్ఱాల ను లోతు ఎంచుకున్నాడు. అయితే ఆశ్చర్యమేమిటంటే సొదొమ గొమొఱ్ఱాల లో ఏమి దొరుకుతుందో ఏమో మనకు తెలియదు గాని. అక్కడ ఉండేదంతా పాపము దుష్టత్వమెనని లేఖనాలు చెప్తున్నాయి. సొదొమ గొమొఱ్ఱా మనుషులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి అని చూస్తున్నాము. అంగట్లో కూరగాయలు దొరకకపోయినా ఈ ఊరిలో ఎక్కడికి వెళ్లినా విశ్రులంఖముగా పాపమనే వ్యభిచారము స్వాభావిక విరుద్ధమైన వ్యభిచారము సొదొమ గొమొఱ్ఱాలో దొరికేది.

సొదోమ గొమొఱ్ఱా లోతు ఇంట్లో ఏమి జరిగింది?:

లోతు అనే ఒక వ్యక్తి కొరకు దేవదూతలు సొదొమ చేరుకొనిరి. అప్పుడు లోతు గవిని యుద్ధ కూర్చుండెను. గవిని దగ్గర ఏమి ఉంది? అక్కడ ఒక రాజకీయ నాయకుడి రూపంలో కూర్చున్నట్లున్నాడు. లోతులో మార్పు కుటుంబములో మార్పు,ఊరులో మార్పు తేవడానికే ఈ దేవదూతలు వచ్చారు. వారిని చూచి సాష్టాంగ పడి ప్రభువులారా, అని సంబోధించి తన ఇంట్లో ఉండమని వేడుకున్నాడు. దైవ సేవకులకు కూడా విశ్వాసులు ఇలా గౌరవిస్తే,అభినందిస్తే ఆ ఇంటికి ఎంత ఆశీర్వాదం.

లోతు కుటుంబాన్ని కాపాడడానికి వెళ్లిన దేవదూతలకు ఏమి ఎదురైంది?:

దేవదూతలు ఇంట్లో ఉండగా రాత్రి పండు కొనక మునుపు అనగా వారు భోజనం చేసిన తర్వాత ఊరిలో వారందరు అనగా బాలురు,వృద్ధులు, అందరును ఆ ఇంటి చుట్టు చేరి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? అని లోతును పిలిచి అడిగి, మేము వారిని కూడు నట్లు మా వద్దకు తీసుకు రమ్మని అడిగిరి. ఎంత హేయం.స్వాభావిక విరుద్ధమైన పాపము చేయుటకు బానిసలైన ప్రజలు.

సొదోమ ప్రజలు పాప సంబంధమైన క్రియలు చేయుటలో పాపమునకు బానిసలై యున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వారు ఎవరో తెలుసుకోకుండా, వారి శక్తి ఏంటో గ్రహించకుండా, వారితో మేము కూడాలని లోతుతో వాదించటం ఎంత విడ్డూరం. కాబట్టి పురుషులు, స్త్రీలు వయో భేదము లేకుండా ఎప్పుడైనా ఎవరితోనైనా శరీర కోరికలు తీర్చుకోవడానికి ముందుంటారు. ఈనాడు లోకములో కూడా ఇలాంటి ప్రజలు మనకు ఎదురౌతుంటారు. వెనుకా ముందు చూడకుండా, అడ్డు అదుపు లేకుండా, ఎవ్వరితే ఏమి పాపము చేయాలనే తపనతో ఈనాడు బాలురు, యవనస్తుల నుండి వృద్ధుల వరకు మనం చూస్తుంటాం. అలాంటి వారి గురించి పౌలు రోమాలో 1వ అధ్యాయము 26: 27 వచనాల్లో ఇలా అంటున్నాడు -“స్త్రీలు సహితం”అని ప్రారంభించాడు. దానర్థం పురుషులు అతీతులు కాదు అని గుర్తుంచుకోవాలి. మరేం చేశారు? స్వాభావికమైన ధర్మమును విడిచి అనగా స్త్రీ యొక్క ధర్మమును మరచిరి. అదేమనగా ఇక్కడ స్త్రీ మరొక స్త్రీతో కలిసి జీవించటం చూస్తున్నాము. ఇలాంటి క్రియలలో పాలు పొందేవారంతా పురుషులైనను స్త్రీలైనను తమ తప్పిదములకు ప్రతిఫలం పొందుదురు అని వ్రాయబడి ఉంది. ఈ పరిస్థితులకు మూల కారణం వారు తమ మనసులో చోటు ఇవ్వకపోవడంతో ఇలాంటి చేయరాని కార్యములు చేయుచు ఉండుట వలన వారు సాతాను ఇచ్చలకు అప్పగించబడిరి.

ఈ పరిస్థితులు నేటి దినాలలో ప్రస్ఫుటంగా మన కళ్ళముందు చూస్తున్నాం వింటున్నాం.

ఇలాంటి నీచ క్రియలు చేయాలనుకున్న సొదొమ ప్రజలకు లోతు ఏమి చేయాలో అర్థం కాక నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మీకు ఇష్టం వచ్చినట్లు వారిని చేయుడి అని వారిని అప్పగించుటకు సిద్ధమైనప్పుడు ఆ దేవదూతలు లోతును లోపలికి లాక్కున్నారు. అప్పుడు వారందరు లోతుకు కీడు చేయుటకు ముందుకు రాగా వెంటనే దేవుని దూతల హస్తము చాపగా ఆ ప్రజలందరు చూపు కోల్పోయిరి.

అప్పుడు వెంటనే దేవదూతలు లోతుతో చెప్పినదేమనగా, నీ కుటుంబము ఈ పట్టణమును విడిచిపెట్టాలి. దేవుడు ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు. నమ్మలేని ఈ విషయాన్ని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చింది. లోతు ఆలస్యము చేయుటచే బలవంతంగా లోతును బయటకు తెచ్చిరి. లోతు కుటుంబము బయటికి రాగానే ఆ ఊరు మొత్తాన్ని యెహోవా దేవుని అగ్నిచేత కాల్చివేయబడెను. బాధకరం ఏమిటంటే లోతు సమ్మతి లేకుండా లోతు ప్రక్కన ఉండి కూడా వెనక్కి తిరిగి చూడటం చేత లోతు భార్య ఉప్పు స్తంభమాయెను. ఆమె మీద పడి ఏడ్వడానికి కూడా వీలులేని పరిస్థితి అక్కడ లోతు అతని కుమార్తెలు ఎదుర్కొనవలసి వచ్చింది.

ఏదేమైనా, ఇలాంటి పాప సంబంధమైన క్రియలు నీ కంటబడితే నీకు సంభవిస్తే ఈ పరిస్థితులే వస్తే ఏమి చేయాలి? లోతుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవించుచుండగా, రాబోవురోజుల్లో మనం చూడబోయేదంతా ధర్మానికి వ్యతిరేకమైన పరిస్థితులు. ఇవి చూచినప్పుడు మనం వాటికి దూరంగా వెళ్ళాలి. మనం వెళ్లకపోతే దేవుడే లాక్కుపోతాడు. కావున పాపమును చూసి భ్రమలో పడక పాపమువిడిచి  దేవునితో సహవాసము కలిగి జీవించుదుము.

ప్రియ పాఠకులారా! ఇలాంటి చెడ్డరోజుల్లోమనం జీవిస్తున్నాము. పాశ్చాతదేశాల్లో మరీ పెచ్చుమీరు ఉన్నది. అందుకే అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి.  మన దేశములో కూడా వాటితో సమానముగానే పాపములోనే మునిగిపోతున్నారు.

సాతాను వాని సమయం కొంచెమే అని ఎరిగి ఎవరిని దిగమింగుదునా అని ఎదురు చూస్తున్నాడు. అప్రమత్తమైదాం. మేల్ కొందాం. ప్రభువు రాకడ సమయము సామీప్యాన్ని గుర్తెరిగి ఆయన రాజ్య విస్తరణలో పాలు పొంది ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మిమ్ములను దీవించును గాక.