Day 133 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు (రోమా 8:26).

మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు, ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది.

మన విధేయత కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మన మీదికి శ్రమలను పంపుతాడు. ఎందుకంటే మనం శ్రమపడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము.

మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము. ఇతరుల భారాలను నెత్తిన వేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడు ఇస్తాడు.

మనం శక్తికోసం, నమ్రతకోసం ప్రార్థిస్తే సైతానుబంటు ఎవడో వస్తాడు. మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొర్రపెట్టేదాకా బాధిస్తాడు.

మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్ధిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది. లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. లేక ఇప్పటి వరకు కనివిని ఎరుగని శ్రమ ఎదో సంభవిస్తుంది. అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవరుచుకో లేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలవుతుంది.

దీన మనసు కోసం ప్రార్ధిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది. మనకి ద్రోహాలు జరిగిపోతుంటాయి. ప్రతీకారానికి తావుండదు. ఎందుకంటే వధకి తేబడే గొర్రెల్లాగా మన ప్రభువును తీసుకెళ్లారు. ఆయన నోరు మెదపలేదు.

ప్రసన్న ప్రసాదించమని ప్రార్థిస్తాము. వెంటనే మన కోపాన్ని దురుసుతనాన్నీ రేపేనా ఏదో ఒక శోధన వస్తుంది. ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమై పోయే సంఘటన. ఇందుమూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకొని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము.

మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము. దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమలేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు. మనసుని గాయపరిచే మాటలు, హృదయాన్ని కోసే మాటలు వాళ్లు ఎడాపెడా మాట్లాడేస్తారు. ఎందుకంటే ప్రేమ దయగలది, దీర్ఘశాంతం గలది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. కవ్వింపుకు లొంగదు. అన్నిటిని సహిస్తుంది. అన్నింటినీ నమ్ముతుంది. నిరీక్షణతో ఓర్చుకుంటుంది. ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు. మనం యేసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము. సమాధానంగా "శ్రమల కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను" అని జవాబు వస్తుంది. "నీ హృదయం భరించగలదా, నీ చేతులు బలంగా ఉంటాయా? వీటిని సహించడం నీకు చేతనౌతుందా?"

శాంతి, విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని, శ్రమనీ ప్రేమమూర్తి అయిన దేవునినుండి నేరుగా స్వీకరించి మేఘాలకుపైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే.

శక్తినిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరు చెయ్యి ఒంటరిగా చేశారు. హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది అవసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేసాయి నిస్త్రాణలో, వణుకులో ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు ననెత్తి పట్టాయి

వెలుగునిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు అనుమానాల పెనుమబ్బుల్లో మినుకుమనే చుక్క నా బేలతనంకేసి జాలిగా చూసింది నా చిరుదీపపు కాంతి కొడగట్టింది చీకటి కంబలి కప్పుకొని తారాడుతుంటే క్రీస్తు వచనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది.

శాంతినిమ్మని వేడుకుంటే, విశ్రాంతికై అర్రులు చాస్తే బాధల చేదు మందు మింగి కళ్ళు మూతబడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగు చేశాయి పగవారు కత్తులు నూరి సన్నద్దులయ్యారు పోరాటం రేగింది పెను తుఫాను సాగింది ప్రభువు మృదువైన స్వరము వినిపించి శాంతిని తెచ్చింది.

ప్రభూ వందనాలు, నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపాన్నికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు. జవాబుగా ఇచ్చిన ఈవులే, ఊహకి మించిన దీవెనలైనాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకి పట్టని ఈవులు ప్రసాదించు.