యేసు సిలువలో పలికిన 3వ మాట


  • Author: Monica Hans
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4

యోహాను 19:26,27 “యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి – అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.”

యేసు క్రీస్తు ప్రభువు సిలువమీద పలికిన ఏడు మాటలలో మొదటి మూడు మాటలు ఇతరుల కొరకు పలికినారు, తరువాత నాలుగు మాటలు తన కొరకు పలికారు. ఈ వచనములో ముగ్గురు వ్యక్తులు కనబడుచున్నారు:

1. యేసు క్రీస్తు, 2. మరియ, 3. యోహాను.

యేసు క్రీస్తు: దేవాది దేవుడైన యేసు క్రీస్తు, తండ్రి తనను పంపిన పనిని నెరవేర్చి తన భాధ్యతను నెరవేర్చారు.ఇహలోకంలో తల్లిదండ్రులకు సహాయపడినారు. ప్రభువు, తాను భారమైన సిలువ శ్రమ అనుభవిస్తున్నప్పటికి తన భాధ్యతగా తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నారు. అమ్మా! అని సంభోధించడం వలన యేసు ప్రభువు వారు సిలువలో కూడా తన తల్లిని మరువలేదు. అమ్మ అనే పదం ఎంతో కమనీయమైనది. తల్లిని దేవాది దేవుడైన యేసయ్య మరవక పోవడం లోకంలోని బిడ్డలందరకు మాదిరి. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని చూస్తారు. పెద్దవాళ్లము అయిన తరువాత తల్లిదండ్రులను మనం చూడాలి. వృద్ధులయితే వారికి చిన్న బిడ్డల మనస్తత్వాలు వస్తాయి. కాబట్టి కుమారులు కుమార్తెలు వారి తల్లిదండ్రులను చిన్న బిడ్డలుగా చూడాలి. ప్రభువును మాదిరిగా తీసుకొని మన తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిద్దాము. ఈ రీతిగా చేయుట వలన నీవు దీవించబడతావు. నిర్గమ 20:12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము” అని వ్రాయబడింది. ప్రభువు తన జీవితంలో ఈ ఆజ్ఞను నెరవేర్చాడు. ఎఫెసీ 6:1-3ప్రకారం నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే తల్లిదండ్రులను సన్మానించటము అనేది ఆజ్ఞ+దీవెన. 2 in 1. అంతేకాకుండా దేవుని బిడ్డలుగా పిలువబడిన మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు అప్పగింపబడిన పనిని భాధ్యతను విడువక నమ్మకంగా నెరవేర్చాలి. అది చిన్న పనియైనా పెద్ద భాధ్యతయైనా దేవుని పనిని ఎంతో నమ్మకంగా నెరవేర్చాలి. ముందు మనము చిన్న పనిలో నమ్మకముగా ఉంటే అప్పుడు మనకు పెద్ద పని అప్పగిస్తారు.

యేసు తల్లియైన మరియ: లేఖనముల ప్రకారం మరియ తన గర్భమున లోక రక్షకుడైన ప్రభువుకు జన్మనిచ్చే గొప్ప అద్భుతమైన అవకాశమును పొందుకొని ధన్యురాలైంది. ఈ ధన్యతను పొందుటకు అనేక అవమానములు, నిందలు కూడా సహించింది. మరియను గూర్చి సుమయోను ప్రవక్త లూకా 2:35లో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకోనిపోవునని చెప్పెను. ప్రభువుని గూర్చి సుమయోను చెప్పిన మాటలు యోసేపు మరియలు విని ఆశ్చర్యపోయారు. 1) బాలుడైన యేసుని పస్కా పండుగకు యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు యేసు- “మీరేల నన్ను వెదకుచుంటిరి నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా” అని చెప్పినప్పుడు మరియ హృదయంలో సుమయోను చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్నది (లూకా 2:41-51). ఈ మాటలు ఆమెను ఎంతో ఆలోచింపచేసి యుండవచ్చు. 2) యోహాను2:4,5 కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ ప్రభువుకు తెలియజేసినప్పుడు “అమ్మా నాతో నీకేమి పని నా సమయము ఇంకనూ రాలేదు” అని చెప్పెను. దానికి మరియ “ఆయన మీతో చెప్పినది చేయుడి” అని శిష్యులకు చెప్పినది. అప్పుడు జరిగిన అద్భుతమును బట్టి ప్రభువును అందరు కొనియాడుతున్నప్పుడు మరియ ఎంతో సంతోషించి ఉంటుంది. కాని తన జీవితంలో కలుగుతున్న ఈ అనుభవములను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు సుమయోను మాటలు ఆమెకు జ్ఞాపకము వచ్చి యుండవచ్చు. 3) లూకా 8:19-21 “నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు” అని చెప్పినప్పుడు దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించువాడే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. మరియ ఈ మూడు అనుభవాల ద్వారా తన కుమారుని భూలోక రాకలోని ఆంతర్యాన్ని ఆయన మరణ శాసనం వెనుక ఉన్న ఆవశ్యకతను ఆమె అర్థం చేసుకొని ఉంటుంది. మరణ సమయంలో కూడా తన భాధ్యత గూర్చి ఆలోచించిన కుమారుని మాటలకు ఎంతగానో ఆదరణ పొందింది. అంతే కాదు మరియ, ప్రార్థించిన స్త్రీలలో ఒక స్త్రీగా ఉంది. అపో 1:14 అంటే రక్షణ పొందిన స్త్రీగా ఉంది. కనుక మరియను ఎవ్వరూ పూజించి ఆరాధించకూడదు అని గ్రహించవలసి ఉంది. మరియను బట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే తల్లిదండ్రులముగా మన బిడ్డలను సామాజికంగా ఉన్నత స్థితిలో ఉండాలని ఆశించుటకన్నా వారి ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు దేవుని పరిపూర్ణంగా వెంబడించుట కొరకు, ఆయన సాక్షులుగా నిలువబడుట కొరకు దీవారాత్రులు దేవునిని గోజాడ వలసిన వారమై యున్నాము. ప్రభువు సెలవిచ్చినరీతిగా ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకినప్పుడు, మనకు కొదువ లేకుండా సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు.

యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను: యోహాను ప్రభువు తనకు ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చాడు. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. యోహానును యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి తనకు ఉన్న సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు (మార్కు 1:19,20) తల్లియైన మరియ బాధ్యతను తీసుకొని యేసు క్రీస్తు మరియకు చేయవలసినది అంతా యోహాను నెరవేర్చాడు. చివరకు యేసుక్రీస్తు సిలువ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో శిష్యులందరు పారిపోయినా యోహాను ఒక్కడే మిగిలి సిలువ యొద్ద నిలుచున్నాడు. ప్రభువు పిలిచిన నాటి నుండి సిలువ శ్రమ వరకు ప్రభువును విడువక యేసు ప్రేమించిన శిష్యుడుగా ఉన్నాడు.

ప్రియులారా యోహానుగారు యేసు ప్రేమించిన శిష్యుడిగా పిలువబడుటకు కారణం ఆయనలోని లోబడే స్వభావమేనేమో. 1సమూ 15:22ప్రకారము బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. యోహాను అట్టి శ్రేష్ఠమైన లక్షణం కలిగియున్నాడు కాబట్టి ఆయనకు శ్రేష్ఠమైన భాద్యతను అప్పగించారు. ప్రభువు నిన్ను కూడా ఏర్పరచుకొని పిలుచుకున్నారు. ఆ పిలుపునకు లోబడి అన్ని సమయాలలో శ్రమలలో కూడా ప్రభువును వెంబడిస్తూ ప్రభువును హత్తుకొని జీవిస్తూ, ప్రభువు అప్పగించిన బాధ్యతను నెరవేర్చిన వారముగా ఉండాలి. ప్రభువు యోహానుతో ఇదిగో నీ తల్లి అనడంలో సంఘాన్ని గూర్చిన బాధ్యతను ప్రభువువారు విశ్వాసికి ఆప్పగిస్తున్నారని గ్రహించాలి. విశ్వాసికి సంఘము తల్లి. తల్లిని ప్రేమించినట్లు విశ్వాసులైన మనము కూడా సంఘమును ప్రేమించి సంఘము యెడల మనకున్న బాధ్యతను నమ్మకంగా నెరవేర్చి “భళా నమ్మకమైన మంచి దాసుడా” అని ప్రభువుతో శభాష్ అనిపించుకోవాలి. అట్టి కృప ప్రభువు మనకందరకు దయచేయును గాక.

toilax 5mg toilax 01 toilax spc


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.