Day 204 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు . . . (ఎఫెసీ 5:20).

నీకు కీడు కలిగించేదేదైనా సరే, నువ్వు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణంలాగా దేవుడు నిన్ను ఆవరించినట్టయితే ఆ కీడు అంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటిరావాలి కదా. అందువల్ల నీకు సంభవించే ప్రతి దాని కోసమూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దానిద్వారా దేవుడు ఏదో ఒక మేలునే తలపెడతాడు. దేవుడు మన జీవితాలను కృతజ్ఞతా యాగాలుగాను, నిత్యమూ ఆయన్ను మహిమపరిచే సాధనాలుగాను చేస్తాడు గాక. మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవేనే.

ఒకసారి ఒకతను అదే పనిగా ఓ కాగితంపై నల్లచుక్కలు పెడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతనేమీ చేస్తున్నట్టు అనిపించలేదు. తరువాత అతడు కొన్ని గీతలు గీశాడు. ఆ గీతల పైన ఇంగ్లీషు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు. వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగం కుదిరింది.

అన్ని దీవెనల దాతయైన దేవుని స్తుతించండి
అధోలోకంలో ఉన్న అల్ప జీవులన్నీ ఆరాధించండి

మన జీవితంలో ఎన్నెన్నో నల్లచుక్కలు, మచ్చలు ఉన్నాయి. అయితే అవి ఎందుకు మనకి దాపురించాయో, దేవుడు వాటిని ఎందుకు తొలగించడో మనకు అర్థం కాదు. కాని దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించి ఆయన్ను ఆ మచ్చల్ని క్రమపద్ధతిలో సవరించనిస్తే, ఆయనకు ఇష్టమైన గీతల్ని వాటిపై రాయనిస్తే వాటిని విభజించి సరియైన చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే ఆ నల్లని మచ్చల్లో నుంచే మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు. ఈ ధన్యకరమైన పని చెయ్యకుండా ఆయన్ను అడ్డగించడం తగదు.

మందస్థాయి సంగీతం లేకుంటే
హేచ్చుస్తాయీ వినసొంపుగా ఉండదు

సముద్రాలకి ఇసుకతెన్నెలకీ నీడల్ని చిత్రించకుంటే
చిత్రకారుడు గీసిన బొమ్మలో అందముండదు
విచారం లేనిదే సంతోషపు సొంపు తెలిసేనా
చీకటి తెలియకుంటే వెలుగు వన్నె తెలిసేనా

చాలామంది గతంలో వాళ్ళు జటిలమైన ఇక్కట్ల పాలైనందువల్లనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు.

ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటలు నొక్కినా, తెలుపు మీటలు నొక్కినా వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది. కాని ఆర్గాన్లోని సంగీతం వినిపించే సామర్ధ్యాన్ని పరీక్షించాలంటే అతడు వాటినీ, వీటినీ కూడా నొక్కాలి.