Day 247 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్బాటముగా కేకలు వేయవలేను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు (యెహోషువ 6:5).

ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకీ, చెక్కు చెదరని విశ్వాసపు ఆర్బాటమైన కేకలకీ ఎక్కడా పోలిక లేదు. ఈ ఆర్బాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి ప్రశస్థమైనది. దేవుడు యెహోషువతో అన్నాడు "ఇదిగో యెరికోను, దాని రాజును నీ చేతికి అప్పగించాను. దాని శూరులందరూ నీకు లొంగిపోతారు. దేవుడు యెహోషువతో నీ చేతికి అప్పగిస్తాను" అని అనలేదు. "అప్పగించాను" అన్నాడు. యెరికో పట్టణం ఇక యెహోషువదే. వెళ్ళి దానిని స్వంతం చేసుకోవడమే మిగిలిన పని. కాని ఎలా అన్నదే ప్రశ్న. ఈ అసాధ్యమైన పనికోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు.

వాళ్ళ అరుపులవల్ల యేరికో గోడలు కూలాయని ఎవరూ అనుకోరు. అయినప్పటికీ వాళ్ళ జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది. ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు. ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే. వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకలద్వారా వారు పొందారు. అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించడం లేదు. కాని వాళ్ళ విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు. అందుకనే వాళ్ళు జయజయ ధ్వానాలు చేసినప్పుడు గోడలు కూలాయి.

ఆ పట్టణాన్ని వాళ్ళకిచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు. విశ్వాస మూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు. ఎన్నో శతాబ్దాల తరువాత హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్దాత్మ వ్రాయించాడు. "విశ్వాసమునుబట్టి యేడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యేరికో గోడలు కూలేను."

విజయ నినాదపు స్తుతిగీతం ధ్వనించేదాకా
విశ్వాసఫలం ప్రత్యక్షం కాదు
దివ్య పరమపురిలో
ద్వారాలన్నీ స్తుతుల ద్వారాలే