Day 250 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు (కీర్తనలు 46:1).

"దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు గదా" అని ప్రశ్నిస్తూ ఉంటాం కాని, ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను విడిపిస్తాడు. "ఆపదలో నేను సహాయం చేస్తాను. అతణ్ణి విడిపిస్తాను" అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలు, రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను దానిలోనుండి బయటకు నడిపిస్తాడు. నువ్వు అసహనంగా, అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు. నిమ్మళించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు.

చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు. అవి మనలను జ్ఞానవంతుల్ని చేయ్యడానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దానిద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు.

ఆపదల్లోంచి ఘోర విపత్తుల్లోంచి
బయటపడాలని చూస్తున్నావా
వాటిలోనే మన దేవునిలోనే
మన శాంతి, మన విశ్రాంతి

ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోలేము. "దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన తన వాగ్దానాలను నిరూపించేలా ఆయన్ను నువ్వు పరీక్షించడానికి మంచి సమయం. నీ శ్రమలవల్ల నువ్వెంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయననుండి రాబట్టడానికి అదే అదను"

పరీక్షలనుండి బయటపడడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, ఆ ఆపదను వదిలించుకుని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం. రెండోది, ఆ ఆపద దేవునినుండి వచ్చిన సవాలేనని గుర్తించి దానిద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం,దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం. ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడౌతాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైవవుతాయి. మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం.