Day 266 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవజల నదులు పారును (యోహాను 7:38)

మనలో కొంతమంది పరిశుద్దాత్మ తమను ఎందుకు నింపలేదని ఆశ్చర్యపడుతూ ఉంటారు. నిజానికి ఏమి జరుగుతున్నదంటే మనలో చాలినంత పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. గాని దాన్ని మనం ప్రవహింపనీయం. నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు. సేవను ఇంకా విస్తారంగా చేసే పథకాలు సిద్ధపరచుకో. అప్పుడు పరిశుద్దాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆ పనులకు కావలసిన దీవెనలను నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు.

ప్రకృతిలో ఈ ఆత్మీయ సత్యాన్ని పోలిన ఒక దృశ్యం ఉంది. గాలి తెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది. స్వతహాగా దానిలో సంగీతమంటూ ఏమీలేదు. అయితే దీని తీగెలమీదుగా గాలి వీచినప్పుడు తియ్యని సంగీత ధ్వనులు వినిపిస్తాయి. దేవదూతల గాయక బృందం ఆ తీగెలపై నిలిచి పాడుతున్నారా అనిపించేంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది.

మన హృదయాలను కూడా ఈ విధంగానే పరిశుద్దాత్మ స్పర్శకోసం సిద్ధంగా ఉంచుకోవాలి. తన ఇష్టమైనప్పుడు ఆయన దాన్ని మ్రోగిస్తాడు. ఆయన సమక్షంలో ఓపికతో, సిద్దబాటుతో కనిపెట్టుకుని ఉండాలి.

అపొస్తలులు మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు ఆ గదిని అద్దెకు తీసేసుకుని అక్కడే జీవితాంతం జపంచేస్తూ కూర్చోలేదు. సువార్తను తీసుకుని నలుమూలలకీ వెళ్ళి ప్రచురించారు.

నా రొట్టె ముక్కను
నేనొక్కడినే తింటే
దిక్కులేని లోకం ఆకలితో సొక్కిపోతూ
ఉన్న లోకపురీతి చక్కబడేదెలా

మనకు రొట్టెముక్కనిచ్చిన ప్రభువు అన్నాడు
ఉచితంగా దొరికింది ఉచితంగా పెట్టు
కొయ్యపై అందరికోసం రక్తం కార్చాడు
నీ రొట్టెను ఇష్టంగా అందరికీ పంచి పెట్టు

"నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడు?" (ఆది 4:9)