Day 271 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నాయందు మీకు సమాధానము (యోహాను 16:33).

సంతోషానికి, ధన్యతకు తేడా ఉంది. అపొస్తలుడైన పౌలు చెరసాల, బాధలు, త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి.

ఒక ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో క అంశాన్ని ముగించి, అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హటాత్తుగా తన మయోలిన్ వంక చూసుకున్నాడు. అది తన స్వంత వయొలిని కాదు. ఎవరిదో, పాతది.

ఒక్కక్షణం అతని గుండే గతుక్కుమంది. వెంటనే ప్రేక్షకులవైపుకి తిరిగి పొరపాటు జరిగిపోయిందని, ఇప్పటి దాకా తాను వాయించిన వయొలిన్ తనది కాదనీ చెప్పాడు. వెంటనే తెర వెనుకకు వెళ్ళి తన వయొలిన్ ఉంచిన చోట వెదికాడు. అప్పుడతనికి తెలిసింది, ఎవరో తన వయొలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయొలిన్ ను ఉంచారని. మళ్ళీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నాడు "సోదర సోదరీమణులారా, సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు. ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను" ఆ పాత వయొలిన్ తోనే ఇంతకు ముందెన్నడూ వాయించనంత మధురంగా సంగీతం వినిపించాడు. ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీత నాదాలకు ప్రేక్షకుల ఆనందపారవశ్యానికి అంతులేకుండా పోయింది. వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమ్రోగి పోయింది. ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు గాని కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు.

నీ కర్తవ్యం కూడా ఇదే. ఈ లోకమనే నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుటా సంగీతం మ్రోగించడం అనేది బాహ్యపరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడి ఉండదనీ, అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందనీ నిరూపించాలి.

హృదయంలో నెమ్మది నెలకొంటే
భయప్రపీడిత తుపాను రాత్రిలో
నోహర సౌందర్యం గోచరిస్తుంది
చీకటి నీకు దారి చూపుతుంది
ప్రాణమున్న ప్రతిదీ జయధ్వని చేస్తుంది
నీ హృదయంలో శాంతి ఉంటే
శిలలూ తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి