Day 279 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అతడు నోరు తెరవలేదు (యెషయా 53:7).

ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి! ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి! ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్నిపరీక్ష. మనం బంగారుపూత పూసినవాళ్ళమేనా, లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీటురాయి ఇదే. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే షిమీ తనను దుర్భాషలాడినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాము -"అతణ్ణి శపించనియ్యండి.. వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో."

కొందరు మనుషులు తాము జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తులనుండి దారీ తప్పిపోయి, తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు. వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవులతో, తంటాలతో నిండిపోతుంటాయి. ఇది తేనెపట్టులాంటిది. తేనెటీగలను రేపడం తేలికే. కాని అవి కుట్టకుండా తప్పించుకోవడం కష్టం. ఆ బాధ భరించరానిది.

దేవా, మాకు క్రీస్తు మనస్సును దయచెయ్యి. ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు. కాని న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు.

నీకు ముందే వేదనబాటలో వెళ్ళాడు
అనవత శిరస్సుతో గాయాలు భరించాడు
అంతులేని దుఃఖం, బాధలు చవిచూశాడు
తెరిపిలేకుండా చాలాకాలం సహించాడు
దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు
ఒక్క నెత్తుటి బొట్టుకూడా ఉంచుకోలేదు
నీకంటే ముందే, నీకోసం విజయం సాధించాడు
నిన్ను మహిమ కాంతులలోకి తేవాలనే.