Day 286 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

దేనినిగూర్చియు చింతపడకుడి (ఫిలిప్పీ 4:6).

ఆందోళన అనేది విశ్వాసిలో కనిపించకూడదు. మన కష్టాలు, బాధలు అనేక రకాలుగా మనమీదకు రావచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్టే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్నివేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనలను కాచి కాపాడడమే ఆయనకు ఆనందం. కాబట్టి "దేనిని గూర్చియు చింతపడకుడి. గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి."

"దేనిని గూర్చియు" అనేది అన్నిటికీ వర్తిస్తుంది. నీ ఇల్లు తగలబడిపోతున్నదా? భార్యాపిల్లలు మృత్యుముఖంలో ఉన్నారా? ఇంత పెద్ద విషయాల నుండి చిన్న చిన్న విషయాల దాకా, అన్నిటినీ దేవుని వద్దకు తీసుకురా. ఎంత అల్పమైన విషయాలైనా సరే, ఏదైనా సరే ఫర్వాలేదు. రోజంతా మన పరిశుద్ధ జనకునితోను, యేసుప్రభువుతోను సహవాసంలో ఉండాలి. రాత్రివేళ హటాత్తుగా మెలుకువ వస్తే మన మనస్సు తనంతట తానే ఆయన వైపుకి తిరగాలి. నిద్రలేని రాత్రుళ్ళలో మనల్ని వేధించే సమస్యలను ఆయన ముందుంచాలి. మన కుటుంబం, వ్యాపారం, వృత్తి, ఏదైతే మనల్ని విసిగిస్తున్నదో దాని విషయం ప్రభువుతో మాట్లాడాలి.

"ప్రార్ధనా విజ్ఞాపనలతో" అంటే ఆసక్తిగా, పట్టుదలగా, దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టాలి.

"కృతజ్ఞతా స్తుతులతో" అంటే ఎప్పుడూ ముందుగా కృతజ్ఞతాస్తుతుల పునాది వెయ్యాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనలను దేవుడు నరకంనుండి తప్పించాడన్న సత్యం మాత్రం ఎప్పుడూ ఉంది కదా. తన పరిశుద్ద వాక్కును, తన కుమారుణ్ణి మనకు ఇచ్చాడు కదా. తన ప్రశస్థమైన వరం, పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు కదా. ఆయనకు వందనాలు చెల్లించడానికి మనకు కారణాలకేమీ కొదువలేదు. దీనిలో మనం ఆసక్తి కలిగి ఉందాం.

సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి మీ మనస్సునీ, మీ హృదయాన్నీ యేసుక్రీస్తులో ఉంచుతుంది. ఇది ఎంత దీవెనకరమైనదీ, వాస్తవమైనదీ, విలువైనదీ అంటే ప్రయోగాత్మకంగా దానిలోనికి ప్రవేశించి చూడాలి. ఎందుకంటే అది మన జ్ఞానానికి అందదు. ఈ విషయాలను హృదయంలో భద్రం చేసుకుందాం. మనం ఆత్మలో నడవడం అలవాటు చేసుకుంటే తత్ఫలితంగా ఆయనకు గొప్ప మహిమను ఆపాదించినవాళ్ళం అవుతాం.

రోజుకు రెండు మూడుసార్లు నీ హృదయం ఏదైనా విషయం గురించి దిగులుగా ఉందేమో పరీక్షించి చూసుకోవాలి. అలా ఉన్నదని తెలిసినట్టయితే దానిలో తిరిగి ప్రశాంతత నెలకొనేలా చూసుకోవాలి.